2023 శుభమంటూ వీడ్కోలు పలికింది. 2024 కోటి ఆశలతో ఆహ్వానం పలికింది. 2024లో సకారాత్మక మార్పులు జరగడానికి ప్రతి ఒక్కరు ఆరోగ్యకర తీర్మానాలు తీసుకొని ఆ దిశగా సాధన ప్రారంభించాలి. స్థూలకాయులు బరువు తగ్గడం, అత్యుత్తమ నైపుణ్య విద్యను ఆర్జించడం, జీవనశైలిలో సకారాత్మక మార్పులు చేసుకోవడం, వ్యాపారంలో లాభాలను పెంచుకో వడం, ఉద్యోగంలో ప్రమో షన్లు పొందడం, వివాహిత యువత సకాలంలో పిల్లల్ని కనడం, సరైన వయస్సులో యువత పెళ్లికి సిద్ధపడడం, విద్యార్థులు మార్కులను/ర్యాంకులను పెంచుకోవడం, సృజనకు పట్టం కట్టడం లాంటి ప్రధాన తీర్మానాలు తీసుకొని ఆ దిశగా 365 రోజులు కృషి చేయాలి. 2024 శుభంగా వీడ్కోలు పలకడానికి మనం తీసుకున్న తీర్మానాలను సాకారం చేసుకోవడంలో ఫోకస్ లేదా దృష్టి పెట్టాలి. మన కృషి లేకుండా 2024 ఏడాది ఎలాంటి ప్రయోజనాలను ఇవ్వదని, మనమే విజయ తీరాలకు చేరడానికి శ్రమ చేయాలని తెలుసుకొని, శుభకరమైన 2024 ఏడాది తీర్మానాలను/అంచనాలను నిర్ణయించుకోవాలి.
ఏఐ ఆధారిత జీవనశైలి అంచనాలు
ఛాట్జిపిటీ రాక తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కొత్తపొంతలు తొక్కనుంది. 2024 సంవత్సరంలో ఏఐ ఆధారిత అద్భుతాలతో మానవ జీవనశైలి సమూలంగా మారనుంది. 2024ను ఏఐ విప్లవ సంవత్సరంగా పిలవడం జరుగుతుందేమో అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు భారతీయ యువ టెక్నొక్రాట్లకు వరంగా మారనున్నాయి. 2024లో స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ ధరలు తగ్గనున్నాయని అంచనా వేస్తున్నారు. డిజిటల్ యుగంలో లాగిన్స్, పాస్వర్డ్స్, బార్‌కోడ్స్, ఫిజికల్ ఐడి చెకిన్స్కు బదులుగా ఫేస్ ఐడి భద్రత ఉద్యమ గుర్తింపు రానుంది.
రాజకీయ ముఖచిత్ర అంచనాలు
2024లో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల్లో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. భారత్‌లో ఏప్రిల్/మే నెలల్లో, అమెరికాలో నవంబర్ మాసంలో కొత్త కేంద్ర ప్రభుత్వాలు కొలువుతీరనున్నాయి. గత మాసంలో నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమైన మూడు రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలు ఏర్పడడంతో సాధారణ ఎన్నికల్లో కూడా కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరవచ్చనే పలు సర్వే అంచనాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆర్థిక అంచనాలు
2024లో బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డుల వాడకాలు పెరుగుతూ ఈఎంఐ ఇన్సాల్మెంట్ చెల్లింపులు పెరగనున్నాయి. సామాన్య ప్రజలు కూడా ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఈ-చెల్లింపులకు మొగ్గు చూపడం శుభ పరిణామం. రానున్న రోజుల్లో పౌరసమాజం స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు ఇష్టపడడం జరుగవచ్చు. రెండు యుద్ధాలు భీకరంగా జరుగుతున్న వేళ ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఆటుపోట్లను, ద్రవ్యోల్బణం కూడా పెరగడం కూడా అనుభవిస్తున్నాయి. విద్య, ప్రజారోగ్య రంగాలు మరింత ఖరీదు కానున్నాయి.
సామాజిక అంశాల అంచనాలు
భారతీయుల సగటు ఆదాయాలు 8 శాతం వరకు పెరగడంతో జీవన ప్రమాణాలు పెరగనున్నాయి. రోడ్లు, ఏయిర్‌పోర్టులు, హైవేస్, రైళ్ల ప్రాజెక్టులు, వేగవంతమైన రైళ్లు రానుండడంతో ప్రజారవాణ సులభం అవుతూ రాజ్యమేలనున్నది. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో 22 జనవరిని హిందూ బంధువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ట కార్యక్రమాలు జరగనున్నాయి. కరోనాతో కుదేలైన విమానయాన పరిశ్రమ కుదుటపడి విమాన ప్రయాణాలు చవక కావచ్చని, సామాన్యులు సహితం ఆకాశ మార్గాలను రుచు చూడనున్నారు. ప్రపంచ మానవాళి తమ గోతిని తామే తవ్వుకున్నట్లు కాలుష్య భూతాలను పెంచి పోషిస్తున్నారు. ప్సాస్టిక్ గరళ కాలుష్యంతో పాటు గాలి, నేల, నీరు కలుషితం కావడంతో మనిషి ఆరోగ్యం గాల్లో దీపం కానుంది.
మానవ సంబంధాల అంచనాలు
యువకులు యుక్తవయస్సులో వివాహాలకు ఉత్సాహం చూపడం లేదు. నేటి యువత 30 ఏళ్లు దాటితేనే అక్షింతలకు సిద్ధం అవుతున్నారు. వివాహం తరువాత పిల్లల్ని కనడానికి సుదీర్ఘకాలం పాటు ఆలోచిస్తున్నారు. వివాహం కన్న ఉద్యోగాల్లో స్థిరపడడమే ప్రధాన మంత్రం అవుతున్నది. సహజీవన చిత్రవిచిత్రాలు, సింగిల్ పేరెంట్ కుటుంబాలు మరింత వేగంగా విస్తరించనున్నాయి. మానవ ఏకాగ్రతను స్మార్ట్‌ఫోన్ ఆకర్షిస్తూ విలువైన కాలాన్ని హరిస్తున్నది. మానవ సంబంధాలను వదిలి డిజిటల్ ప్రపంచంతో సంసారాలు చేయనున్నారు. మాటలు, బంధువులు, మిత్రులు పలుచబడనున్నారు. నేటి డిజిటల్ యువత ప్రేమ వివాహాలు, కులమతాంతర వివాహాలకు ఓట్లు వేయనున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు బదులు తామే కుదుర్చుకున్న వివాహాలకు పెద్దలను ఓప్పిస్తున్నారు. నేటి యువత తమ నిర్ణయాలను తామే తీసుకుంటూ అమ్మనాన్నల సలహాలకు ఆస్కారం ఇవ్వడం లేదు. స్వలింగ వివాహాలతో పాటు ఎల్జిబిటిక్యూ వర్గాలకు సమాజ గుర్తింపు పెరగనుంది.
ప్రజారోగ్య అంచనాలు
ఆరోగ్య పరిరక్షణ విజ్ఞానం పెరగడంతో తీపి పదార్థాలను దూరం పెట్టనున్నారు. బిపీ, షుగర్ సమస్యలు అధికం కావడంతో జీవనశైలిలో మార్పులకు ప్రజలు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్యాలను హరించే క్రేజీ ఫుడ్స్, సూపర్ ఫుడ్స్, అశాస్త్రీయ ఆహారపు అలవాట్లు పెరగనున్నాయి. జిమ్ కల్చర్ ఫాషన్గా మారుతోంది. ఫిట్నెస్ వాచ్‌లు, స్లీప్ ట్రాక్స్, ఫుడ్ డెయిరీ యాప్‌ల వాడకం ఊపందుకోనున్నది. స్థూలకాయ సమస్యలకు శారీరక శ్రమకు బదులుగా అనారోగ్యకర ఔషధాలు/డ్రగ్స్ వాడడానికి స్థూలకాయులు మొగ్గుచూపనున్నారు.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





