- ఈ ఎన్నికలు కెసిఆర్- జగన్‌తో పాటు, మోదీకి కూడా గుణపాఠం లాంటివే
- మోదీ బాణం కూడా గురితప్పింది
- తప్పంతా ప్రజలదే అన్నట్టుగా ఆత్మవంచనకు పాల్పడుతున్నారు
- మంచి పాలనే ఇస్తే ప్రజలెందుకు ఓడిస్తారు..
- విపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.
తెలంగాణలో కెసిఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్లీ మనదే అధికారం అంటూ పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికారు. అలాగే ఏపీలో అయితే మాజీ సిఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఇవిఎంలు శకుని పాచికల్లా పనిచేశాయని, ఇవిఎంల తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. అలాగే ఏపీలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బ తిన్నాయని గొల్లున ఏడ్చేస్తున్నారు. ఇదంతా గతమనే విషయాన్ని మరిచారు. ఇలా ఆత్మ విమర్శకు సిద్ధపడకపోగా పరనిందకు తెగబడుతుండడం విచారకరం. ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలలో అధికారం కోల్పోయిన పార్టీలు కారణాలు తెలుసుకోవాలి. .. ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంతా మంచి చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో గుర్తించాలి. ఏరకమైన పొరపాట్లు దొర్లాయో పూర్తిగా విశ్లేషించుకోవాలి. కానీ అలా జరగడం లేదు. ఈ ఇద్దరు నేతలకు ఆత్మపరిశీలన చేసుకోవడం కన్నా…పరనిందతో పోతే సరిపోతుందన్న భావనలో ఉన్నారు. నిజానికి మోదీ బాణం కూడా గురితప్పింది. ఈ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల పాలకులు జగన్, కెసిఆర్‌లతో పాటు, మోదీ కూడా గుణపాఠం లాంటివే. ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ మళ్లీ ఎన్నికల నాటికి ప్రజాభిమానం చూరగొనడానికి ప్రయత్నిస్తుంది. ప్రజల్లోకి వెళ్లి మంచి చేయడం ద్వారా లేదా చేసిన చెడును ఒప్పుకోవడం ద్వారా ప్రజలకు చేరువ కావాలి. కెసిఆర్ మాత్రం ఇంకా భ్రమల్లోనే ఉన్నారు.
కమిషన్లు, విచారణలు తూచ్ అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంఫెయిల్యూర్ అంటూ కల్వకుంట్ల కుటుంబం రోజూ తిట్టి పోస్తున్నారు. ఇకపోతే ఆత్మవిమర్శ అన్నది.. జగన్ ఆయన పార్టీ నేతల్లో కనిపించడంలేదు. తప్పంతా ప్రజలదే అన్నట్టుగా ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. చెడు చేసి ఓడితే బాధపడాలి కానీ, మంచి చేసి ఓడితే బాధపడకూడదని రోజాలాంటి వారు వితండవాదం చేస్తున్నారు. నిజంగా మంచి పాలనే ఇస్తే ప్రజలెందుకు ఓడిస్తారన్నది చెప్పాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిపిన సమావేశాల్లో జగన్‌రెడ్డి ఉపన్యాసం తీరు ఆయన వితండ వాదాన్ని సూచిస్తోంది. జగన్ మారతారని భావించడం భ్రమే అవుతుంది. తన పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలూ ఎందుకు ఏకమయ్యారో గుర్తించలేక పోతున్నారు. తన పాలనలో వ్యస్థలు ఎలా భ్రష్టు పోయాయో గ్రహించడం లేదు. శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయో గుర్తించడం లేదు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సాధించిన ఘన విజయాన్ని సాంకేతిక విజయం మాత్రమేనని ఆడిపోసుకుంటున్నారు. జగన్‌రెడ్డే అసలైన ప్రజా నాయకుడని, ప్రజల మద్దతు ఆయనకే ఉంటుందని ప్రచారం చేస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే జగన్ ఓడిపోయారని ప్రచారం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని ఇదే జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల తర్వాత తేల్చి చెప్పడాన్ని వారు మరచిపోయారు. ఈవీఎంల ద్వారా ప్రజల తీర్పును తారుమారు చేయలేరని అనేక సందర్భాలలో ఎన్నికల కమిషన్ రుజువు చేసింది.
చంద్రబాబు విజయానికి ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఎన్నికల కమిషన్ పరోక్ష సహకారం ఉందని ప్రజలను నమ్మించే విఫలయత్నం చేస్తున్నారు. ఇకపోతే తాజా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 2019 మాదిరి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ లభించలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమయ్యే పక్షంలో చంద్రబాబు విజయానికి సహకరించిన మోదీ తన సొంత పార్టీకి మెజారిటీ సీట్లు సాధించుకోలేరా అన్నది వైసిపి నేతలు ఆలోచన చేయాలి. ప్రభుత్వ పనితీరు అదరహో అని ప్రచారం చేస్తూ , విపక్షాన్ని విమర్శిస్తూ పోయారు. దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్‌ను అదేపనిగా విమర్శించారు. నమ్మించారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని నమ్మించారు. వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కెసిఆర్ కూడా ఇలాగే చెప్పారు. మా లెక్కలు మాకున్నాయన్నారు. మోదీ కూడా 400 సీట్లు ఖాయమని ప్రచారం చేసుకున్నారు. దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ ప్రజలకు మంచి పనులు చేయకుండా వ్యక్తిగత డంబాచారాలకు పోయిన నేతలు భంగపడ్డారు. ఇందుకు మోదీ అతీతుడేవిూ కాదు. 2019 కంటే ఎక్కువ శాతం ఓట్లు, సీట్లు వస్తాయని నమ్మబలికారు. సంక్షేమ పథకాల వల్ల పేదల జీవితాలు మారిపోయాయని, సామాజిక న్యాయం అద్భుతం గా జరిగిందని ప్రచారం చేసుకున్నారు. దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా సాహసించని నిర్ణయాలను జగన్‌రెడ్డి తీసుకొన్నారని వైకాపా నేతలు ఊరూవాడా ఊదరగొట్టారు. జగన్ పేదలు, పెత్తందారులు అంటూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఉన్మాద మూకను పెంచి పోషించినందుకు జగన్మోహన్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకొని వాస్తవిక దృక్పథంతో ఆలోచించడం నేర్చుకోవాలి. నేతలు నిజాలు తెలుసుకోవాలి.
ప్రజలు గొల్లున అరుస్తున్నా పట్టించుకోకుండా పాలన చేస్తే సరికాదని గుర్తించాలి. ఇప్పటికైనా అధికారంలో ఉన్న నేతలు ప్రజలకు మేలు చేకూర్చే పనులపై దృష్టి పెట్టాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. విపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. ప్రభుత్వానికి సరైన సూచనలు చేసే అలవాటు చేసుకోవాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. దేశం ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రధానంగా పరిష్కరించాలి. నిరుద్యోగ యువతను బిజెపి నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. మూతపడ్డ పలు సంస్థల పునరుద్ధరణ కోసం నోరుమెదపని వారికి మాట్లాడే నైతిక హక్కు లేదు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. ఉద్యోగాలు లేక యువత ఎంత బాధ పడుతున్నారో తెలుసు కోవాలి. సీసీఐ సహా అన్ని సంస్థలను వెంటనే తెరిపించాలి, కేంద్రం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్‌కు అమ్మేసింది. దీంతో వేల మంది రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఎల్‌ఐసీ సహా అనేక కంపెనీల వాటాలను అమ్మకానికి పెట్టింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నది. విచ్చలవిడిగా ప్రభుత్వరంగ సంస్థలు అమ్మడం వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు.
ఆ కుటుంబాలకు నేతలు సమాధానం చెప్పగలరా? ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజల తిరుగుబాటు తప్పదు. ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. దీంతో గ్రామాల్లో ఉపాధి కూలీలకు నిరంతరాయంగా పనులు దక్కుతాయి. అలాగే వ్యవసాయ పనులు కూడా చురుకుగా సాగుతాయి. వ్యవసాయ రంగంలో కూలీలు దొరక్క రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి హావిూ పథకం కూలీలను వ్యవసాయ రంగం వైపు మళ్లిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. 25శాతం చెల్లింపులు, ప్రభుత్వం 75శాతం చెల్లింపులు జరిపేలా ఒక విధానాన్ని తీసుకువస్తే వ్యవసాయం ఎంతో లాభదాయకం అవుతుంది. కౌలురైతులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు అందించాలి. రైతులు వ్యాపారులుగా ఆలోచించాలి. ఇందుకు గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తుల రూపాంతరానికి చిన్నచిన్న యూనిట్ల ఏర్పాటుకు రైతులు కృషి చేయాలి. ఇజ్రాయిల్, వియత్నం వంటి దేశాల్లో పద్ధతులు ఇక్కడ రైతులు అవలంభించాలి. రైతులకు ప్రకృతి వ్యవసాయమే లాభదాయకమని ఆ దిశగా రైతులు చర్యలు చేపట్టాలి. గోవుల మూత్రంతో జీవామృతం తయారు చేసుకుని పంటలు పండించుకోవాలి. కాలం కాని కాలం దాపురించింది. రుతుపవనాలు ప్రవేశించి పదిరోజులు దాటినా ఇంకా ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి.
పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత ఆందోళనకు గురి చేస్తోంది. సాయంత్రం వేళలో అక్కడక్కడా చిరుజల్లులు పడినా ఆ తర్వాత భరించలేని ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో కరెంట్ వినియోగం కూడా పెరుగుతోంది. ఎసిలు లేనిదే పట్టణ ప్రజలు ఉండలేకపోతున్నారు. ఆంధ్రాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. అక్కడ మధ్యాహ్నం వేళలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కొన్ని జిల్లాలో విత్తిన పత్తిగింజలు మొలకెత్తాయి. ఆ తర్వాత ఆశించిన మేర వానలు లేకపోవడంతో పత్తి మొలకలు వాడిపోతున్నాయి. జూన్ రెండు లేదా మూడో వారంలో వర్షాలు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు వరుణుడు కరుణించలేదు. వర్షాకాలం ప్రవేశించినప్పటికీ ఎండకాలం తలపిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నప్పటికీ ఎండల తీవ్రత ధాటికి చేన్లు పొడిబారి పోయాయి. వర్షం పడితే కానీ దున్ని విత్తనాలు నాటుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎండల తీవ్రతకు జనం ఉక్కపోతతో ఆగమాగం అవుతున్నారు. అప్పుడప్పుడు వాతావరణంలో మార్పు చోటుచేసుకుని చల్లబడుతున్నప్పటికీ రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. పూర్తిస్థాయి వర్షాలు పడే వరకు రైతులు తొందర పడకుండా విత్తనాలు నాటొద్దని అధికారులు సూచించారు. అయినప్పటికీ కొన్నిచోట్ల రైతులు విత్తనాలు నాటుకుంటున్నారు. ఇప్పటికీ ఆశించిన మేర వానలు పడలేదు. ఇలా రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు విలయతాండవం చేస్తుంటే పట్టించుకోని ఓడిన నేతలు ఆత్మస్తుతి, పరనింద చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఈవీఎంలలో ఏదో జరిగిపోయిందని చెప్పే వారు, దానిని నిరూపించగలగాలి. ఎన్నికలకు ముందు ఐదేళ్ల అరచాక పాలన చేసిన జగన్, ఇప్పుడు ఫలితాల అనంతరం జరిగిన స్వల్ప సంఘటనలను భూతద్దంలో చూపినంత మాత్రాన ప్రజలు నమ్మరు. తన పాలనలో జరిగిన దురాగతాలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. ఇది అన్ని రాష్టాల్రకు వర్తిస్తుంది.
-కందుల శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్
సెల్ : 9848443599





