ఆరు నెలలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటదని తరవాత ఎలాగైనా కూలిపోతుందని, కుల్చేస్తామని మీడియా ముఖంగా పార్టీ ముఖ్యులు చెబుతుంటే వింటున్న సామాన్య ప్రజలు రెట్టింపైన కోపంతో ఊగిపోతున్నారు, అలా కనుక చేస్తే ప్రజా క్షేత్రంలో ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి ఎగిసి ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి పార్టీ నాయకులకు రాక తప్పదు. నిన్న మొన్నటి వరకు పోటీ పడి అధినాయకత్వం మన్ననలు పొందేందుకు కోట్ల కట్టల సంచులతో బారులు తీరిన కోటీశ్వరులైన లీడర్లు ఎంపీ ఎన్నికల్లో కనీసం పార్టీ ఆఫీసులోకి వస్తందుకే మొఖం చాటేస్తున్న మాట నిజం కాదా.? పొందుతున్న దాని నుండి కోల్పోతున్నదేమిటి? అనే కనీస స్పృహ లేకుండా, ఎప్పుడైనా సమీక్ష చేసిన సందర్భాలు లేకపోగా పార్టీ ముఖ్యులు ఎవరైనా చెప్తే పెడ చెవిన పెట్టింది నిజమే కదా.! గూడ అంజన్న అన్నట్టు ‘‘ఎందాక జూద్దామురో ఎల్లన్నోరి మల్లన్నా ఇగ ఎగపడుదామురో..’’ అని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఆతురుతగా ఎదురుచూసిన జనం ఆచితూచి తీర్పును ఇచ్చారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో ప్రజల తీర్పునే శిరోధార్యంగా స్వీకరించాల్సిన పరిపక్వతను ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థి అలవర్చుకోవాలి, అంతేకాకుండా ఫలితాలను స్పోర్టివ్ గా తీసుకొని ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి రాజ్యాంగ స్పూర్తితో మెలగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం , గెలుపే శాశ్వతం కాదు, ఓటమి అంతం కాదనేది గుర్తెరిగి, భేషజాలకు పోకుండా, నిత్యం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక పోరాటాలు చేస్తూ ప్రజల మన్ననలు చూరగొంటూ ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రచించుకొవడమే తక్షణ కర్తవ్యమవ్వాలి. గెలుపుతో గర్వం తలకెక్కకూడదు, అలాగని ఓటమితో కుంగిపోకూడదు. కానీ, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ పెద్దల రాజరిక పోకడలు, ఇంకా అధికార మదం దిగిపోలేదని సామాన్య ప్రజలు దగ్గర గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార పక్షానికి తగినంత పాలనా సమయం, కనీసం వారు విదిల్చిన గడువు తర్వాతే వారి యొక్క పని తనాన్ని, నిర్ణయాలను విమర్శిస్తే ప్రజల్లో హుందాతనం పెరుగుతుంది లేకపోతే అంతకు మించి ప్రజల్లో పలుచనయ్యే ప్రమాదం లేకపోలేదు.!
‘‘ చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్టు’’ పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా నిర్వహించిన ప్రతి మీటింగ్ లో కేటీఆర్ పైన కార్యకర్తలు తమలో నిఘూడమై ఉన్న అసంతృప్తిని, ఆవేశాన్ని వెళ్లగక్కారు.
ఇది ఒకరకంగా చూస్తే పేరుకు మాత్రమే కానీ, ఇక్కడ సమీక్ష జరగక పోగా, కనీసం వీటికి రావడానికి కూడా సుముఖత చూపని కార్యకర్తల్లో, ముఖ్యంగా ఉద్యమకారుల్లో, పార్టీ నిర్మాణం నుండి భాగస్వామ్యం అయి ఆదరణకు నోచుకోక పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కట్టర్ తెలంగాణ వాదుల తిరుగుబాటుకు వేదిక అయ్యింది. ఇవి ఎంత మేరకు కార్యకర్తల ఇగోను సాటిస్ఫయ్ చేసాయో తెలియదు కాని, ఇంకా కేటీఆర్ అనే వ్యక్తిలో అహం తగ్గలేదనే సందేశం మాత్రం తెలంగాణ నలుమూలలు పాకింది. వాస్తవానికి పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కలిసినా అడిగేది మహా అయితే ఒక సెల్ఫీ అంతే తప్పా గడిచిన పదేళ్లలో వారు పోగేసుకున్న వేల, లక్షల కోట్ల ఆస్తిల్లో వాటా అడగలేదు కదా! అంతకుమించి పదవులు అస్సలే ఆశించలేదు ఎందుకంటే, ‘‘అయినోనికి ఆకులల్లో కానోనికి కంచంలో వడ్డించినట్టు’’ బయటి నుండి సూటుకేసుల్లో నోట్ల కట్టలను కుప్పలుగా పోసిన వారికి మాత్రం ప్రగతి భవన్, ఫామౌజ్ దిడ్డి దరువాద గుండా స్వాగతం పలికింది చూసి చూసి తమలోని అసంతృప్తిని ఎక్కడ ‘కక్కలేక మింగలేక’ మిన్నుకుండుపోయిన అగ్రహజ్వాలాలను నిన్నటి వరకు జరిగిన మీటింగ్ లల్లో తమతో తమ మాజీ ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఎదురుగా ఉన్నారన్న బిడియాలన్ని పక్కనపెట్టి యువ నేత అని పిలుచుకునే హైటెక్ లీడర్ ను దునుమాడారు, కొంత మేర హరీష్ రావు ఉన్న మీటింగ్ ల్లో కార్యకర్తలను సముదాయించడంలో సక్సెస్ అయ్యారు. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఎన్నడూ కార్యకర్తల బాధను పంచుకోలేదు కానీ ఇప్పుడు వారంలో మూడు రోజులు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటాను ఎవ్వరూ అధైర్యపడొద్దు వంటి వాక్యలు చేస్తూ, తాను ఇకపై ఎటువంటి తప్పులు చేయనని వొగల ఏడ్పులు ఏడిషినా కార్యకర్తలు కనీసం కనికరం కూడా చూపించడం లేదు. ఎమ్మెల్యేలు నియోజకవరర్గాన్ని తమ ఇష్టారాజ్యంగా మలుచుకొని ఏకాచత్రాధిపత్యంగా నడుచుకొని ప్రభుత్వ అధికారులను సైతం బెదిరించి తమకు బానిసలుగా పనిచేయాలని చెప్పు చేతుల్లో ఉండాలని వాళ్ళు కూడా సగటు ఓటర్లే అని వారికి ప్రజలతో సంబందభాంధవ్యాలు ఉంటాయనే కనీస సోయి లేకుండా అజమాయిషీ చేలాయించి చతికిల పడ్డారు.
యూట్యూబ్ చానెళ్లు పెట్టుకుంటే గెలిచే వాళ్ళమనే కేటీఆర్ చౌకబారు మాటలు మానుకుంటే మంచిది, ఎందుకంటే తెలంగాణ అత్యంత రాజకీయ చైతన్య వంతమైన నేల, ఉద్యమాలను ఎప్పటికప్పుడు పురుడోసుకొని ఉద్యమించిన నేలను ఇలాంటి మాటలతో, వారిచ్చిన తీర్పును అవమానిస్తే తెలంగాణ ప్రజల మనసులను ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఏం అర్ధం చేసుకున్నట్టు..? అయితే పార్టీ అనేది ‘నేల విడిచి సాము’ చేసినట్టుగా సంస్థాగతంగా పునాదులను వదిలిపెట్టి, కార్యకర్తలను పూర్తిగా విస్మరించి వారిని పురుగుల కంటే హీనంగా చూసిన దాఖలాలే ఎక్కువ. మరీ ముఖ్యంగా అనుబంధ సంఘాల కమిటీలు వేసిన సందర్భాలు కానీ అవి పార్టీకి పట్టు కొమ్మలు అన్న సంగతి మర్చిపోయి ఎన్నికల్లో పట్టు కోల్పోయి నవ్వినోని ముందు ఊషి పడ్డట్టు అయిపోయింది. ఇకపోతే ఉద్యమం మొదలైన నుండి కవులు, రచయితలు, మేధావులతో ఎన్నెన్నో మేధో మదనాలు చేసి వ్యూహాలు రచించిన కేసీఆర్ వాళ్లంటేనే గిట్టని వాళ్లుగా అంటరాని సంతగా, అవసరమున్నప్పుడు నయానో భయానో ఇచ్చో బయపెట్టో లోబర్చు కుందామనే సంకుచిత బుద్ధితో ఉన్నది జగమెరిగిన సత్యం.! మొన్న సమీక్షల్లో కార్యకర్తలకు అండగా ఉండేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామనే ప్రకటన చూసి, ఇంతవరకు తమకు కనీసం అపాయింట్మెంట్ కు నోచుకోని లీడర్లకు ఇప్పుడు ఇగురం వచ్చిందా అని హైకోర్టు, జిల్లా కోర్టుల్లోని తెలంగాణ ఉద్యమంలో, పార్టీ నిర్మాణంలో భాగస్వాములైన న్యాయవాదులు పడి పడి నవ్వుకుంటున్నారు.
దండిగా పైసలుండి ఖద్దరు వేసిన నేతలే పెద్ద సారును కలువాలంటేనే ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీలు కలిసేందుకు దరువాద కాడ దడి కట్టుకు కూసున్న తలుపు తెరువరని తమ కొలువు వినరనే అపవాదును ఆపాదించుకున్న నియంతృత్వ పోకడకు దారులేసుకొని కేసీఆర్ తాను తోడుకున్న గుంతలో తానే పడ్డడని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.!? కనీసం బహిరంగ సభలో సభ పైనే ఆశీనులైన నియోజకవర్గ స్థాయిలో మంచి పట్టున్న ప్రజాప్రతినిధులను సైతం దూరం దూరం ఉంచి దండం పెడితే అదే అహకరం నిన్నే తెలంగాణకు దూరం పెట్టింది. ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాల నుండి పరిశీలిస్తే ప్రయివేటు కంపెనీ నడిపించినట్టు పార్టీని నడిపి నట్టేట ముంచారు. పార్టీలో కార్యకర్తలకు కనీసం ప్రయివేటు కంపెనీల్లో లాగా వేతన కూలీలకు ఉన్న గౌరవం గాని, ప్రాధాన్యత గాని ఇవ్వక పోగా జన సమీకరణలో టార్గెట్ ఇచ్చి ప్రచారంలో నమ్మక ఫోటోలను ప్రూఫ్ లుగా చూపిస్తే నే పనిచేసినట్టు లేకపోతే బహిరంగంగా అవమానపరిస్తే ఆత్మగౌరవం చంపుకొని పక్క పార్టీలోకి పోలేక ఇక్కడ ఇముడలేక కుడితిలో పడ్డ ఎలుకల్లాగా గిల గిల కొట్టుమిట్టాడారు. ఏ మీటింగ్ పెట్టినా ప్రజలకు డబ్బులు ఇచ్చి , బలవంతంగా ఒక దగ్గర పోగేసి అదంతా తమ ప్రజా బలమే అని నమ్మబలికి, సర్వేలన్ని తమకే అనుకూలమైనట్టు ప్రకటన లతో కృత్రిమంగా ప్రజా ఆదరణను చూరగొనే జిమ్మిక్కులే చేశారే గాని వారి ప్రేమను పొందడం లో విఫలమైన మాట వాస్తవం. ప్రజలను ఎప్పుడైనా ప్రేమగా పలకరించిన దాఖలాలు లేకపోగా చీదరించుకున్న సందర్భాలే ఎక్కువ, వారిని సముదాయించే ప్రయత్నం కార్యకర్తలు చేసి చేసి అలిసిపోయి చివరకు చేతులెత్తేసి చేష్టలుడిగిపోయారు.
ఆరు నెలలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటదని తరవాత ఎలాగైనా కూలిపోతుందని, కుల్చేస్తామని మీడియా ముఖంగా పార్టీ ముఖ్యులు చెబుతుంటే వింటున్న సామాన్య ప్రజలు రెట్టింపైన కోపంతో ఊగిపోతున్నారు, అలా కనుక చేస్తే ప్రజా క్షేత్రంలో ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి ఎగిసి ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి పార్టీ నాయకులకు రాక తప్పదు. నిన్న మొన్నటి వరకు పోటీ పడి అధినాయకత్వం మన్ననలు పొందేందుకు కోట్ల కట్టల సంచులతో బారులు తీరిన కోటీశ్వరులైన లీడర్లు ఎంపీ ఎన్నికల్లో కనీసం పార్టీ ఆఫీసులోకి వస్తందుకే మొఖం చాటేస్తున్న మాట నిజం కాదా.? పొందుతున్న దాని నుండి కోల్పోతున్నదేమిటి? అనే కనీస స్పృహ లేకుండా, ఎప్పుడైనా సమీక్ష చేసిన సందర్భాలు లేకపోగా పార్టీ ముఖ్యులు ఎవరైనా చెప్తే పెడ చెవిన పెట్టింది నిజమే కదా.! గూడ అంజన్న అన్నట్టు ‘‘ఎందాక జూద్దామురో ఎల్లన్నోరి మల్లన్నా ఇగ ఎగపడుదామురో..’’ అని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఆతురుతగా ఎదురుచూసిన జనం ఆచితూచి తీర్పును ఇచ్చారు.
ఇకపోతే కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ‘ప్రజా ప్రభుత్వం’ ఏమెం చెయ్యాలో ఏమేం చెయ్యద్దో, ఎందువల్ల ప్రజాగ్రహానికి గురయ్యిందో గతంలోని బీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యక్ష ఉదాహరణ గా నిలిచింది. పదవుల్లో ఒకే వర్గాలకు పెద్ద పీట వేయకుండా, అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఆధిపత్య వర్గాల గుత్తాధిపత్యం లేకుండా ప్రజా అవసరాలను, అభిరుచులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఇలాగే ప్రజాస్వామిక పద్దతిలో తమ నిర్ణయాలు ఉంటే ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి, వారి ఆశీస్సులు మెండుగా ఉంటూ పూర్తి కాలం తమ ప్రభుత్వానికి ప్రజలే రక్షణ కవచంగా ఏర్పడి తోడ్పాటును ఇస్తారు. బీఆర్‌ఎస్ అనేది ఇప్పుడు కోరలు పీకేసిన పాము అది ఎంత బుస కొట్టినా ఒరిగేదేమీ లేదు, కనుక ఎవరో చేసిన పిట్ట బెదిరింపులకు అస్సలు అధైర్య పడకుండా కేవలం సువిశాల పాలన వైపు దృష్టి సారిస్తూ, సమున్నత లక్ష్యాల సాధనకై అడుగులెయ్యాలి.
-ముఖేష్ సామల
హైకోర్టు అడ్వకేట్, పొలిటికల్ అనలిస్ట్
9703973946





