అవకాశ వాదం విడిచి.. ఆశావాదం వైపు పయనించాలి!

ఎక్కడో,ఏదో ఒక చోట కొన ఊపిరితో కొనసాగుతున్న చైతన్యం కొడిగట్టి పోతున్నది. వెలిగే దీపాన్ని ఆర్పే వరకు నిద్దుర పట్టని క్రూర మనస్తత్వాల కుటిలత్వానికి  మనిషన్నవాడు ఈ మానవ సమాజంలో మిగిలే ప్రశ్నే ఉత్పన్నం కాదు .మానవ రూపం ధరించిన క్రూర మృగాలు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. అభయారణ్యాలు అంతరించి, జీవించే నెలవు లేక జనారణ్యంలోకి అడుగుపెట్టే వన్య జీవులు సైతం మానవాకృతి ధరించిన వికృత వింత జీవులను చూసి, పలాయనం చిత్తగిస్తున్నాయి. మానవ సమాజమంటేనే ఒక మానసిక రోగగ్రస్థుల సమాజంలా పరివర్తన చెందింది. రోజు రోజుకీ మానవ’’తత్వం’’దిగజారిపోతున్నది. మానవ పతనం అత్యంత వేగవంతంగా సాగిపోతున్నది. వెలుగిచ్చే దీపాలను ఆర్పేస్తున్నారు. చీకటిలో ముంచేస్తున్నారు.దారి చూపిన మనుషులకు దారి లేకుండా చేస్తున్నారు.కాటికి దగ్గర దారి చూపుతున్నారు. హృదయాన్ని పిండేసి,బాధలతో నలిపేసి,పైశాచికత్వంతో శరీరం నుండి ఆత్మను వేరు చేసి పరమానంద భరితులై కన్నూ మిన్నూ తెలియని కఠినత్వంతో కర్కశంగా ప్రవర్తిస్తున్నారు.

ఇదీ నేటి మానవ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న వింత వికృత పైశాచిక క్రీడా విన్యాసం లో పరాకాష్టకు చేరిన ఆధునిక అమానవీయ విధ్వంస మనస్తత్వాల స్థూల విశ్లేషణ.ఎక్కడ చూసినా అసూయ,ఎక్కడ చూసినా విద్వేషం. ఓర్వలేని ప్రపంచ గమనాన్ని సవ్యమైన దిశలో నడిపే మహనీయులు మున్ముందు మహిలో జన్మిస్తారా? ఈలోకం వారిని బ్రతకనిస్తుందా? అయినా నిరాశ అలుముకున్న ప్రపంచంలో ఏదో ఒక ఆశ సన్నని కాంతి రేఖలా,కఠిక నిశిలో మిణుగురు పురుగుల వెలుతురులా, వెలుగుకోసం అన్వేషణ కొనసాగడం అల్పసంతోషమే.ఈ నిరంతర ప్రయత్నం మానవ జగతిని ముందుకు నడుపునా? ఎక్కడైతే అసూయ లేని స్వచ్ఛమైన మనసులతో పరిమళించే మానవ సమాజం చిగురిస్తుందో, ఎక్కడైతే స్వచ్ఛమైన త్యాగానికి,అంకిత భావానికి నిజమైన గుర్తింపు లభిస్తుందో,ఎక్కడైతే చైతన్యం అణగద్రొక్కబడకుండా, నిలదొక్కబడు తుందో, అటువంటి సమాజంలో నిండైన వ్యక్తిత్వానికి నిజమైన విలువ లభిస్తుంది. ఈర్ష్యాద్వేషాలతోపరపీడనతో, మూరత్వంతో నిండిన మనసు చచ్చి,మస్తిష్కాలు కుళ్ళిన  ఆధునిక,అవివేక,అనాగరిక విధ్వంస వ్యవస్థకు దూరంగా మెలగడమే శ్రేయస్కరం.మానవుడు సంఘజీవి. సంఘాన్ని త్యజించి మనగలడా?మనుగడ సాగించగలడా? అయినా ప్రయత్నించాలి. సంఘంలోని దుర్మార్గానికి దూరంగా ఉంటూనే  సంఘం కోసం పాటుబడాలి.స్వార్ధం, అహం,క్రోధం,మదం వంటి దుర్లక్షణాలతో నిండిన సంఘం చెక్కిన శిల్పాల్లో చలనం కలిగించాలి.దేహానికి స్నానం,మనసుకి ధ్యానం ఎంత అవసరమో, సమాజంలో పేరుకు పోయిన మాలిన్యానికి కూడా వివేకమనే  విరుగుడు అవసరం.ఎవరు ఎన్ని అవలక్షణాలు కలిగి ఉన్నా, మనం వాటిని అంటించుకోకూడదు.

మన బుద్ది బురదలో జారిపోకుండా ఆత్మబలంతో స్వీయరక్షణ పాటించాలి.ఎన్నో సమస్యలకు కాలమే సరైన సమాధానమిస్తుంది. మౌనమే ఎన్నో ప్రశ్నలకు చేధిస్తుంది. సహనమే శరణ్యం. ఎన్ని సమస్యలు ఎదురైనా,మరణమే దగ్గరైనా మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టు కోవాలి.  సద్విమర్శను స్వీకరించాలి. విమర్శ లేకుండా, విశ్లేషణ లేకుండా కేవలం పొగడ్తలకే పరిమితమైతే, లేని గొప్పతనాన్ని ఆపాదించుకుంటే, అది వ్యక్తిత్వాన్ని పెంచకపోగా, అహంకారాన్ని ప్రోది చేస్తుంది.  విమర్శ మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుంది.మన సహజ రూపాన్ని యధాతథంగా నిర్భయంగా మనకు చూపించే అద్దం మనకు నిజమైన నేస్తం.మన లోపాలను,మనకు  తెలియచెప్పి,సరిదిద్దుకునే  అవకాశం అద్దం కల్పిస్తుంది.విమర్శ అనేది అద్దం లాంటిది. అలాంటి అద్దాన్ని విసిరి కొడితే ముక్కలౌతుంది.ముక్కలైన అద్దంలో అనేక ప్రతిబింబాలు ఏర్పడి, దృశ్యాన్ని చిందర వందర చేస్తాయి. సహేతుకమైన విమర్శను  స్వీకరించకుండా,ఏవ్యక్తీ ఉన్నతంగా ఎదగలేడు. మంచి చెడులను విశ్లేషించుకుని,మంచిని  గ్రహించి,చెడుని పరిత్యజించడం వలన వ్యక్తిత్వం వికసిస్తుంది. వ్యక్తిత్వం వలన హుందాతనం పెరుగుతుంది.

సద్విమర్శను స్వీకరించకుండా వ్యక్తి ఎదుగుదల సాధ్యం కాదు.పొగడ్తలకే కాని విమర్శలకు పనికిరాని చెవులు ప్రమాదకరం.’’వినదగు నెవ్వరు చెప్పిన…’’అనే విధంగా ఎవరు ఏం చెప్పినా వినే సహనం మనలో ఏర్పడాలి.విన్న ప్రతీ విషయాన్ని వివేకంతో ఆలోచించాలి.ఏది వాస్తవమో ఏది అవాస్తవమో నిర్ధారించుకుని పాటించడమో, తిరస్కరించడమో చేయాలి.  ఇవన్నీ మనం చేసే ప్రతీ పనికి అన్వయించుకోవాలి.కుత్సితమైన విమర్శలతో వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే  వ్యక్తులకు దూరంగా ఉండడం సర్వోత్తమం.విమర్శించడం వేరు, విమర్శనాత్మక దృక్ఫథం వేరు. విమర్శ కోసమే విమర్శించడం మూర?త్వం. మనం చేసే ప్రతీ పనిని విమర్శించడం,వ్యతిరేకించడంలో ఓర్వలేని తనం బయట పడుతుంది.మన ముందు ఒక విధంగా, పరుల ముందు మరొక విధంగా ప్రవర్తించడం,లేని పోని అభాండాలు వేయడం,   కాలక్షేపం కోసం పరులను నిందించడం వ్యక్తిత్వ లోపం వలన తలెత్తిన ఒకరకమైన  మానసిక ఉన్మాదం.ఆ చెవితో విన్న మాటలు ఈ చెవితో వదిలేయడం విజ్ఞుల లక్షణం.పనికిమాలిన మాటలను పదిమంది చెవిన వేయడం ధూర్తుల లక్షణం. పసలేని,పనికిరాని వ్యర్థ  సంభాషణలు సాగించడం,గాలిని పోగేసి  ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరచడం దౌర్భాగ్యపు  క్రీడా విన్యాసం.

ఇలాంటి గాలి కబుర్లు అంతటా తిరిగి తిరిగి పెద్ద ప్రచారమై,చుక్క రక్తం చిందించకుండా మనిషిని చంపేసే శక్తిగల మారణాయుధాలు.నేటి అస్థవ్యస్థ,అయోమయ,అస్థిరమైన మానవ సమాజంలో విలువలు నశించిన కారణంగా అనేక విపరీతమైన ధోరణులు ప్రబలి పోతున్నాయి. కాలక్షేపం కబుర్లు ఎన్నో జీవితాలను బుగ్గిపాలు  చేస్తున్నాయి.పరిణితి చెందని వయసులో అల్లరి చేష్టలు చేయడం సహజం.దురదృష్టవశాత్తూ,  నేటి వ్యవస్థలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది  వివేకం కోల్పోయి,ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఎదుటి వారిపై బురద చల్లే కాలక్షేపం కథలను శ్రవణానందభరితంగా వినడం,వాటికి లేని పోని విశేషణాలు జోడిరచి, ప్రచారం కల్పించడం వంటి  అలవాట్లను వ్యసనాలుగా మార్చుకుని సమాజంలో ఆరోగ్య వంతమైన వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. గ్రంథ పఠనం,సమాజసేవ, ఆధ్యాత్మిక చింతన తదితర అంశాలను అలవాట్లుగా మార్చుకోవడం  అతిబద్ధకంగా మారిన నేపథ్యంలో నరం లేని నాలుకల నిడివి పెంచి, విష ప్రచారాలతో  కడుపునింపుకోవడం కలహ భోజన ప్రియత్వమే.ఇదొక మానసిక రోగం.ఇలాంటి ధోరణులు సమాజానికి అత్యంత ప్రమాదకరం.  ఎటు వైపు మన పయనం?ఏం సాధించాలని ఉబలాటం? ఇకనైనా మానవ మెదళ్ళలో మొలకెత్తిన ముళ్ళ కంపలను చెరిపేసి,మానసిక దరిద్రంలో నుండి ఉద్భవించిన కుళ్ళును వివేకంతో కడిగేయాలి. మంచి తనపు పరిమళాలతో వ్యక్తిత్వాన్ని వికసింప చేయాలి.ఒకరి హృదయఘోషతో మరొకరు హృదయానందం పొందడం అమానుషత్వం.మన హృదయ స్పందనలో మంచితనమనే సరిగమలు పలకాలి. వివేకమనే సంగీతం వినిపించాలి.సాంఘిక మాధ్యమాల హోరులో సమాజమే విధ్వంసమైపోతున్న నేపథ్యంలో రాబోవు విపత్కర పరిణామాల గురించి మేథావుల సమూహం తమ దృష్టి కేంద్రీకరించాలి. అవకాశ వాదంతో  కాకుండా ఆశావాదంతో  సమాజంలో మార్పు తీసుకురావచ్చు.

సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్‌ స్పీకర్‌)
సంగాయగూడెం, దేవరపల్లి మండలం,
తూ.గో.జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *