ఒకప్పుడు అడవంటే భయం
అడవిలో పులులుంటాయని
సింహాలుంటాయని భయం!
అడవిని చూస్తే పారి పోయేవారు
లోనికి ప్రవేశం ఒక సాహసం
కాలచక్రం గిర్రున తిరిగేసరికి
మనుషులు విపరీతంగా పెరిగి
అడవులు తరిగి భయం స్థానంలో
జాలి చేరింది..
అడవిలో కలప వనరులు జంతుజాలం
మనిషి కంటి కిందకు పంటి కిందకు
కూడా రావటం లేదు..
మనిషి నుండి తమను తాము
రక్షించుకొనే ప్రక్రియలో అడవులన్నీ
అభయారణ్యాలుగా మారిపోయాయి
అడవికే మనిషి అభయం కావల్సి
వచ్చింది..
అయినా కూడా అది దొరకడం లేదు!
వారాంతపు విశ్రాంతికి వినోదానికి
మనిషిప్పుడు అడవుల చెంతకే
వస్తున్నాడు
అడవులకు అది చెప్పుకోలేనంత
ప్రాణసంకటంగా మారింది..
ప్లాస్టిక్ బ్యాటిళ్ళు తినిపారేసిన
ప్లాస్టిక్ వ్యర్ధాలు..
ఎక్కడ చూసినా వెక్కిరిస్తూ స్వచ్ఛమైన
అడవులకు పట్టిన ఆధునిక చీడలా
పచ్చదనాన్ని హరిస్తూ భూసారాన్ని
భుగ్గి చేస్తూ..
ఆధునిక మానవుడి వికృతరూపాన్ని
ఎత్తి చూపుతున్నాయి!
నరపశువుల సంచారాన్ని నిషేధించమని
అడవులిప్పుడు మౌనంగానే
మొరపెట్టుకొంటున్నాయి..!!
(మార్చి 21 ప్రపంచ
అటవీ దినోత్సవం..)
-భీమవరపు పురుషోత్తమ్ (9949800253)





