బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
విదురుని ధృతరాష్ట్రుడు పిలిపించాడు. ఆయన మనస్సులోగిలి ఉంది. నా రాజ్యానికీ, నా పిల్లలకూ ఎలాంటి ఉపద్రవం రాకుండా మార్గం చెప్పు అన్నాడు. విదురుడు తన మనస్సులోని మాట చెప్పాడు. రాజ్యం సుఖశాంతులతో వుంది. ప్రజాభిమానాన్ని చూరగొనాలన్నా ప్రభువులైన వారు ధర్మపథాన సత్యబద్దులై నడవాలి. మీరు పాండవులను పిలిపించి వారి రాజ్యభాగం వారికిచ్చేయండి అన్నాడు. శకుని సలహాలు పాటించకండి అన్నాడు.
ధృతరాష్ట్రునికి కించిత్ కోపం రాగా విదురుని దేశం నుండి బహిష్కరించాలన్నాడు. నీవు పాండవ పక్షపాతిగా మారావు. నీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడికే పో అనగా విదురుడు హస్తినాపురం విడిచి, కామ్యకవనం చేరి ధర్మరాజాదులను కలుసుకున్నాడు. జరిగిన విషయాన్ని విదురుడు ధర్మరాజుకు వివరంగా చెప్పాడు. మీకు కూడా జూదానికి దిగవద్దని చెప్పినా వినలేదన్నాడు. ఓరిమితో ఉండమన్నాడు. క్షమాశీలురు లోకాన్ని జయిస్తారని చెప్పాడు. విదురుడు అక్కడే ఉంటూ వచ్చాడు.
ధృతరాష్ట్ర మహారాజుకి విదురుడి వంటి మంత్రి దూరమైనందుకు చాలా విచారించాడు. మనస్సు ఏమీ బాగుండటం లేదు. సంజయుని పిలిచి విదురుడు ఎక్కడ ఉన్నా వెంటనే తీసుకు రమ్మాన్నాడు. సంజయుడు కామ్యకవనం చేరగానే పాండవులు సకల మర్యాదలూ చేశారు. విషయాలు తెల్సుకున్నాక విదురుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఈ పరిణామం దుర్యోదనునికి రుచించలేదు. విదురుడు పాండవులను వనవాసం నుండి తప్పించే ప్రయత్నం గావిస్తాడని దుర్యోధనాదులు భయపడ్డారు. మరలా మునుపటిలాగానే ఆలోచించడం ప్రారంభించారు.





