22 జనవరి 2024 ఉషోదయ భానుడి కిరణాలు తొంగి చూస్తున్న శుభ వేళ సూర్యవంశ అయోధ్య శ్రీ రాముడిని దివ్యమైన, భవ్యమైన గర్భగుడిలో భక్తిపూర్వక ప్రాణ ప్రతిష్ట, ప్రారంభోత్సవం చేయడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న విషయం భారతీయులకు అందరికీ పరమానందాల్ని తోడ్కొని వస్తున్నది. దేశ స్వాతంత్య్రానంతరం నిర్మించిన అత్యద్భుతమైన అతి పెద్ద మందిరంగా శ్రీరాముడి జన్మ స్థలం అయోధ్యలో భరతవంశాకురం రామయ్య కొలువు తీరనున్నారనే వార్త హిందూ బంధువులతో పాటు అందరినీ పులకరింపులకు గురిచేస్తున్నది.
05,ఆగస్ట్ 2020 భూమి పూజ
05 ఆగష్టు 2020న ప్రారంభమైన అయోధ్య రామమందిర నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీని జోడిస్తూ సనాతన భారతీయ సంస్కృతులను అనుసరించి రికార్డు సమయంలో నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. రాముడి జన్మ భూమిలోని సీతారాముల మందిర స్థలంలో 1528 – 29 కాలంలో మొగల్ రాజు బాబర్ ద్వారా బాబ్రీ మసీదు కట్టాడని హిందూ సంఘాలు వందల సంవత్సరాలుగా పోరాటం చేయడం, 06 డిసెంబర్ 1992న కరసేవకులు మసీదును కూల్చడానికి పూనుకోవడం లాంటి ఘటనలు సమసిపోయి 09 నవంబర్ 2019న కోర్టు తీర్పుతో అదే ప్రాంగణంలోని 2.77 ఎకరాల రాముడి నడయాడిన పుణ్య స్థలంలో శాంతియుత వాతావరణంలో నేడు అత్యద్భుత రామ మందిరం నిర్మించబడడం హర్షదాయకం.
ప్రపంచంలోనే 3వ అతి పెద్ద హిందూ దేవాలయం
ప్రపంచంలోనే 3వ అతి పెద్ద (భారత్‌లో అత్యంత పెద్ద) హిందూ దేవాలయంగా నిలుస్తున్న అయోధ్య మందిరాన్ని ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ఆధ్వర్యంలో ‘ఎల్ అండ్ టీ’తో పాటు ‘టాటా కన్సల్టెన్సీ’ సంస్థలు చేపట్టిన అయోధ్య రాముడి ఆలయం 54,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2.7 ఎకరాల్లో నిర్మించడం, 70 ఎకరాల ప్రాంగణం కోట్లాది హిందు భక్తులకు ఆహ్వానం పలకనుంది. భవ్య ఆలయ నిర్మాణానికి 4 లక్షల ఘనపు అడుగుల అరుదైన రాజస్థానీ పింక్ మార్బుల్ బన్నీ పహర్‌పూర్ శిలలను వినియోగించారు. అయోధ్య రాముడు కొలువుండే మందిరం 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉండేట్లు నిర్మించారు. చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ భాయి సోంపురా సలహాలతో ‘నగర శైలి’లో వాస్తు సూత్రాలకు లోబడి రామమందిరా నిర్మించారు.
దేవాలయ ప్రత్యేకతలు
తూర్పు ప్రధాన ద్వార గోపురం ఆహ్వానం పలుకగా అష్టభుజాకృతిలో ఉన్న ఆలయంలోని గోడలు రాముడి జన్మ విశేషాల చిత్రాలతో అబ్బురపరచనున్నాయి. ఐదు గోపురాలతో పాటు 161 అడుగుల ఒక టవర్‌తో 3 అంతస్థుల్లో నిర్మించిన ఆలయ గర్భ గుడిలో కొలువైన రామయ్యపై సూర్య కిరణాలు సోకనుండడం పరమాద్భుతమైన అంశంగా తోస్తున్నది. గృహ మందిరం, కీర్తన మందిరం, నృత్య మందిరం, రంగ్ మందిరం, రెండు ప్రధాన మండపాలు కూడా ఆలయంలో నిర్మించారు. రామమందిరంలో పురాతన శ్రీరాముడి విగ్రహంతో పాటు పెద్ద సైజ్‌లో ఉన్న రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయంలో రూ: 21 లక్షలు వెచ్చించి 6 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు ఉన్న 2,100 కిలోల బరువైన గుడి గంటను తయారు చేశారు. శతాబ్దాల పాటు పూజలందుకోనున్న ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి సేకరించిన టేకు కర్రలతో ఆలయ ద్వారాలు తయారు చేశారు.
వెయ్యేండ్లకు పైగా భక్తులకు అందుబాటులో..
వెయ్యేండ్లకు పైగా జీవితకాలం కలిగిన ఆలయంలో ప్రతి రోజు లక్ష వరకు భక్త కోటి దర్శనం చేసుకోనున్నారు. రామ మందిర నిర్మాణంలో ఎలాంటి ఐరన్, స్టీల్ వాడకపోవడం ఓ విశేషం. భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక శ్రీరామ్ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, జాతీయ రోడ్డు మార్గాలు నిర్మించారు. యూపీ రాష్ట్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న రామ మందిరం భారతీయ హృదయ స్పందనగా, పరమత సహనానికి చిహ్నంగా, శాంతియుత సహజీవన సూత్రాలను బోధించే ఆధ్యాత్మిక కేంద్రంగా, సనాతన భారతీయత ప్రతిబింబించే పుణ్య స్థలంగా, హిందూ ధర్మ ప్రచార వేదికగా నిలువనుండడం ఆనందదాయకం. 24 జనవరి 2024 నుంచి భక్తుల సందర్శనకు మందిరం సిద్ధంగా ఉంది. శ్రీరాముడిని కనులారా దర్శించుకొని, మనసులో నింపుకొని, రాముడి బోధనలను ఆచరిస్తూ హిందుత్వ సుగంధాలను విశ్వ వ్యాపితం చేద్దాం
హిందూ బంధువుల ఆనందోత్సాహాలు
‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ఆధ్వర్యంలో నిర్మించిన దివ్యమైన భవ్య అయోధ్య రామమందిరానికి అఖండ భారతం నుంచి మాత్రమే కాకుండా విదేశీ పరమత భక్తులు నుంచి కూడా విరాళాలు వెల్లువెత్తడం హిందూ భక్తకోటికి అమితానందాన్ని కలిగించింది. జనవరి 15, 2021 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించిన విరాళాల సేకరణ ఫిబ్రవరి 27, 2021 వరకు నిరాటంకంగా కొనసాగింది. హిందూస్థాన్ ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమరకు ఊరూరా రామ భక్తులు తమకు తోచిన విరాళాలు స్వచ్ఛందంగా భక్తితో సమర్పించుకోవడం జరిగింది. రామ మందిర నిర్మాణం కోసం భారతదేశంలోని 4 లక్షలకు పైగా గ్రామాలు, పట్టణ ప్రాంత వార్డుల్లోని దాదాపు 100 మిలియన్ల కుటుంబాల నుంచి విరాళాలు సేకరించారు. హిందూ బంధువులే కాకుండా రామ భక్త ముస్లిమ్ సొసైటీ, ఇతర మతస్తులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించడం భారత హిందూ ఏకీకరణ జరిగి, భిన్నత్వంలో ఏకత్వం సాధించినట్లు నిర్థారణ అయ్యిందని నిర్వాహకులు తెలిపారు.
కోట్ల కొద్ది విరాళాల వెల్లువ
నిరుపేదలు, యాచక వర్గాల నుంచి అత్యంత సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన నగదును (10/- నుండి కోట్ల రూ?ల వరకు) భక్తితో సమర్పించి శ్రీరాముని దీవెనలు పొందారు. ఈ విరాళాల సేకరణలో 9 లక్షల కార్యకర్తలు 1.75 లక్షల జట్లుగా ఏర్పడి, ఇంటింటికీ వెళ్లి నగదును స్వీకరించారు. సేకరించిన నగదును 38,125 కార్యకర్తలు పారదర్శకంగా బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. హైదరాబాద్?కు చెందిన ధనుష ఇన్ఫోటెక్ కంపెనీ సమన్వయ పరిచిన యాప్ సహాయంతో విరాళాల సేకరణకు దేశవ్యాప్తంగా 49 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అఖండ హిందూస్థాన్‌లో అరుణాచల్ నుంచి రూ: 45 మిలియన్లు, మణిపూర్ నుంచి 20 మిలియన్లు, తమిళనాడు నుంచి 850 మిలియన్లు, కేరళ నుంచి 130 మిలియన్ల నగదును సేకరించడం జరిగింది.
రామాయణం మానవ జాతి జీవన విధానానికి దివ్య సూచిక. శ్రీ రాముడు అత్యుత్తమ వ్యక్తిత్వానికి ఏకైక చిహ్నం. పాలనకు అనుసరణీయం రామరాజ్యం. ఉత్తమ ఇల్లాలుగా సీత, ఆదర్ష సోదరులుగా లక్ష్మణ భరత శత్రజ్ఞులు మరియు భక్తికి పరాకాష్టగా హనుమ విశ్వ మానవాళికి విలువలుగల జీవనశైలిని నిరంతరం బోధిస్తూ ఉన్నారు. నిత్యం రామ నామాన్ని జపిద్దాం, రామరాజ్యాన్ని ఆకాంక్షిద్దాం.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





