అభయ హస్తం కాదు.. శూన్య హస్తం

ముఖ్యమంత్రివా… చెడ్డి గ్యాంగ్‌ సభ్యుడివా
సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌
మెదక్‌ గడ్డ గులాబీ అడ్డా..
లోకల్‌ లీడర్‌ వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమన్న మాజీ మంత్రి

పటాన్‌ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ముఖ్యమంత్రివా..చెడ్డి గ్యాంగ్‌ సభ్యుడివా అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. 6 గ్యారంటీలు అంటూ..అభయ హస్తం అంటూ అధికారంలోకి వొచ్చిన రేవంత్‌ సర్కార్‌ ప్రజలకు శూన్యహస్తం అందించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. పటాన్‌ చెరు మండలంలోని రుద్రారం గ్రామంలోని గణేష్‌ గడ్డలో గల శ్రీ గణేష్‌ దేవాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డిలతో కలిసి ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఎన్నికలో కాంగ్రెస్‌ నాయకులు ఆచరణ సాధ్యం కాని, అలివి కాని హామీలు ఇచ్చి ప్రజలను ధోఖా చేసిందన్నారు. మార్పు మార్పు అని ఉన్న సంక్షేమ పథకాలకు కోత పెట్టారన్నారు.

పాల పొంగులా కాంగ్రేస్‌ పాలన అసలు స్వరూపం బయటపడిరదన్నారు. 6 గ్యారంటీల కోసం రాహుల్‌, ఏఐసీసీ మాట అన్నారని..అయినా 120 రోజులు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. మహాలక్ష్మి పథకంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 2500 ఇస్తామన్నారని, రాష్ట్రంలో ఉన్న..1.42 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్‌ బాకీ పడిరదన్నారు. 42 లక్షల పింఛన్‌ దారులు ఉన్నారని వారికి నెలకు 4 వేలు ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. నాడు నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్‌, ప్రియాంక గాంధీ, రేవంత్‌ రెడ్డిలు మాట్లాడారని, నేడు తోక ముడిచారన్నారు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వడం లేదని, కేసీఆర్‌ కిట్‌ బంద్‌ అయిందని, కల్యాణ లక్ష్మికి తులం బంగారం, వడ్లకు బోనస్‌ 500 ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

వరి పంటకు బోనస్‌ 500 ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్‌ అడుగితే..సీఎం రేవంత్‌ రెడ్డి అవాకులు, చెవాకులు ప్రేలుతున్నారని విమర్శించారు. ఆయనకు చేతనైతే 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని, రైతు భరోసా ఇవ్వాలని, కరెంటు బాగా ఇవ్వాలని సూచించారు. ఫేక్‌ వార్తలు, లీక్‌ వార్తలు ఎన్ని రోజులో సాగవన్నారు. మెదక్‌ గడ్డ బీఆర్‌ఎస్‌ పార్టీకి అడ్డ అని, 2001 నుండి ఇక్కడ మెదక్‌ పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతుందన్నారు. తమ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి లోకల్‌ అని, తెల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడని, మొన్న ఎన్నికల్లో 38 వేల వోట్లు మహిపాల్‌ అన్నకు వేసి గెలిపించారని గుర్తు చేశారు. 11 ఏళ్ళు ఉమ్మడి మెదక్‌ జిల్లా లో పనిచేసిన,  విద్యావంతుడు వెంకట్రామరెడ్డిని .గెలిపించు కుంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపిస్తాడని, దుబ్బాకకు చెందిన అనాథ పిల్లలు సహాయం కోసం వొస్తే ఆదుకున్నారని, సిద్దిపేటలో హమాలీ కార్మికుని కుమార్తెకు ఎంబిబిఎస్‌ సీటు వొస్తే అదుకోవడంతో పాటు ఆమె చెల్లెకు ఎంబిబిఎస్‌లో సీటు వొస్తే చదివించిన గొప్ప మనసున్న వ్యక్తి వెంకట్రామరెడ్డి అని పేర్కొన్నారు. ధనంతో పాటు దాన గుణం ఉన్న వ్యక్తి కాబట్టే 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో తనతో పాటు అర్ధరాత్రి వరకు వెంకట్రామరెడ్డి పనిచేశాడని గుర్తు చేశారు. పటాన్‌ చెరు అభివృద్ధి గురుంచి  కాలుష్య నివారణ కోసం, మెట్రో పొడగింపు కోసం ఆయన కృషి చేస్తాడన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత మహిపాల్‌ రెడ్డితో పాటు వెంకట్రామరెడ్డి తోడుగా ఉంటారన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డట్లు మళ్లా కష్ట పడాలని, ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. దుబ్బకలోఎడ్లు నాగలి, నిరుద్యోగ భృతి, దుబ్బాకకు రైలు బండి అని హామీలు ఇచ్చి మోసం చేసిన రఘునందన్‌ రావును అక్కడ చిత్తుగా ఓడిరచారని, అక్కడ చెల్లని వ్యక్తి ఇక్కడ పటాన్‌ చేరులో ఎలా చెల్లుతాడన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జాతకం తమ కన్నా ప్రజలకే  తెలుసన్నారు. గణేష్‌ గడ్డ మనకు అచ్చి వొచ్చిన గడ్డ అని, ఇక్కడ 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో మహిపాల్‌ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, వాహన పూజకు జెండా ఊపడం జరిగిందని, ఘన విజయం సాధించడం జరిగిందన్నారు. నేడు వెంకట్రామరెడ్డితో కలిసి పూజలు నిర్వహించడం జరిగిందని,  గెలుపు కూడా ఖాయమన్నారు. మినీ ఇండియాలో భారీ మెజారిటీ అందిస్తామని, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి మినీ ఇండియాగా పేర్కొనే పటాన్‌ చెరులో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి కి భారీ మెజారిటీ అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. పటాన్‌ చెరులో 6 లక్షల వోట్లు ఉన్నాయని, మెజారిటీ వోట్లు రావడం ఖాయమని, పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పనిచేయాలన్నారు..ఈనెల 13న  సాయంత్రం 4గంటలకు  సిఎమ్మార్‌ ఫంక్షన్‌ హాల్లో  నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రికార్డు మెజార్టీ అందిస్తాం..: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి
రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో పటాన్‌ చెరు నియోజకవర్గం నుండి బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి వెంకరామిరెడ్డికి రికార్డు మెజార్టీ అందిస్తామని పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో గత పదేళ్ళలో పటాన్‌ చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలిపామని తెలిపారు. బూత్‌ స్థాయి నుండి బిఆర్‌ఎస్‌ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉందని, ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి వెంకటరామిరెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆశీర్వదించండి..అండగా ఉంటా : ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి
కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌గా 11 ఏళ్ళు ప్రజలతో పనిచేశానని, ఎంపీ అభ్యర్థిగా ప్రజా సేవకోసమే వొస్తున్నానని, తనను అశీర్వదిస్తే అండగా ఉంటానని ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి కోరారు. తాను పటాన్‌ చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్‌ వాసినని, ఏ కష్టం వొచ్చినా పిలవగానే వొచ్చి అండగా నిలుస్తానన్నారు. ట్రస్టు ద్వారా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే  సత్యనారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *