– గల్ఫ్ పాలసీ, ఎన్నారై పాలసీలు ఏమయ్యాయి?
– భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి
– మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: బీఆర్‌ఎస్ పాలనలో వలసలు వాపస్.. కాంగ్రెస్ పాలనలో వలసలు మొదలు అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న వలస కార్మికుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుండటం సిగ్గుచేటంటూ 22 నెలలు గడిచినా కాంగ్రెస్ గల్ఫ్ పాలసీ, ఎన్‌ఆర్‌ఐ పాలసీకి అతీగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకూ దిక్కులేదన్నారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని తెలిపారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఉపాధి, ఉద్యోగాలు కరవై ఎడారి ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి వచ్చిందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే కాంగ్రెస్ పార్టీ వలస కార్మికుల కుటుంబాలను సైతం దారుణంగా వంచించిందని ఆయన ఆరోపించారు. అభయ హస్తం మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం అంటూ అనేక హామీలు ఇచ్చింది తప్ప ఇప్పటి వరకు ఒక్కటీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర పాలన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులు, సభ్యులు ఏం చేస్తున్నట్లు అని హరీష్‌రావు నిలదీశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





