– ప్రధాని మోదీకి కానుకగా ఇవ్వాలి
– బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారికి న్యాయం చేయాలని బీజేపీి డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీి విజయం సాధిస్తుందని పూర్తి నమ్మకం ఉందన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన భాగ్యనగరంలోని ఎనిమిది జిల్లాల ప్రధాన నాయకుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. పార్టీ బలోపేతం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, బూత్‌స్థాయి సమన్వయం వంటి కీలక అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికలోనూ ప్రజలు మన పార్టీని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా, సమన్వయంతో పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని రామచందర్‌రావు సూచించారు. గత బీఆర్‌ఎస్ హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పి విషాదనగరంగా మారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అభివృద్ధిని కనుమరుగు చేసిందని విమర్శించారు. వరదల సమయంలో ప్రభుత్వ ప్రణాళికా లోపం స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని, ప్రధాన మార్గాలు, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్ల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే వారిపై బీఆర్‌ఎస్ సర్కారు చూపిన కర్కశత్వాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికీ మరువలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ మరోవైపు బస్సు చార్జీలు పెంచడం దారుణమన్నారు. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకపోవడం బాధాకరమని రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండుమూడు రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య చీకటి బంధాలను ఎండగట్టి బీజేపీ అభ్యర్థిని గెలిపించి ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





