ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యం లాగే ఎంతో ముఖ్యమైనది. దీనిని మనిషి యొక్క మనోభావాలకు, భావోద్వేగాలకు దర్పణంగా పేర్కొనవచ్చు. ఇది వ్యక్తి ఆలోచనలను, అనుభూతులను, అనుభవాలను ప్రభావితం చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించటానికి, ఒత్తిళ్లను నియంత్రణ చేసుకోవటానికి, సంబంధాలను మెరుగుపరచుకోవటానికి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మరియు సరైన సమయంలో సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకొని జీవితాన్ని ఆహ్లాదకరంగా గడపటానికి వ్యక్తికి మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమైన అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే శారీరకంగా కూడా ఆరోగ్యంగా, దృఢంగా ఉండగలడు.
మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు
1. శారీరక ఆరోగ్యం
శరీరము మనసు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఒకదాని సమస్యలు మరొక దానిని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు డిప్రెషన్ వల్ల తలనొప్పి నిద్రలేమి వంటి సమస్యలు చూడవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి వలన గుండె జబ్బులు, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
2 .ఆహారం, వ్యాయామం, మరియు విశ్రాంతి
ఆకలి విపరీతంగా ఉండటం, ఆకలి లేకపోవడం, పదేపదే తినాలనిపించటం మానసిక ఆరోగ్య అసమతుల్యతను సూచిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ ,ఆందోళన లాంటి సమస్యలు ఆకలిపై ప్రభావాన్ని చూపుతాయి. సరైన శారీరక వ్యాయామం, రోజులో కనీసం నడక, యోగా సాధన వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరి ముఖ్యంగా శారీరక శ్రమకు తగినంత విశ్రాంతి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర వ్యక్తి శారీరక ,మానసిక ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. మనసు భరించలేని ఒత్తిడి లేదా డిప్రెషన్ తో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు కొన్ని రోజులపాటు నిద్ర లేకుండా ఉండగలుగుతారు.ఇది అనారోగ్యకరమైన మనసుకు చిహ్నం.
3 . ఆర్థిక పరిస్థితులు, సామాజిక మద్దతు
కుటుంబ ఆర్థిక స్థితిగతులు వాటి వలన ఎదుర్కునే ఒత్తిడి, ఆందోళన నిరాశకు దారితీస్తాయి. ఆరోగ్యవంతమైన స్థితిస్థాపకత మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సామాజిక మద్దతు, బలమైన అనుబంధాలు మానసిక శ్రేయస్సుకు దోహదపడగా….సామాజిక ప్రతికూలతలు నిరాశ, ఆందోళన కలిగించడమే కాకుండా… ఆత్మగౌరవం దెబ్బతీయటానికి దారితీస్తాయి.
4 . సంబంధాలు
కుటుంబ మరియు సామాజిక సంబంధాలు వ్యక్తి మానసిక ఆరోగ్యం పై అనుకూల మరియు ప్రతికూల, ప్రభావాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన సంబంధాలు ఒత్తిడిని తగ్గించి మద్దతునిచ్చి మేలు చేయగా…
లోపభూయిష్ట సంబంధాలు నిరాశ, ఆందోళన, ఒంటరితనం లాంటి మానసిక, ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. సామాజిక ,కుటుంబ సంబంధాలను ఏర్పరచు కొనే సమయంలో ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పరచుకోవటం శ్రేయస్కరం
5 .నమ్మకాలు
నమ్మకం అనేది ఒక మానసిక స్థితి. ఇది మానసిక ఆరోగ్యం పై ప్రభావంతంగా పనిచేస్తుంది. విశ్వాసం, సానుకూల ఆలోచనలు ఆనందానికి దారి తీయగా…. నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటివి జీవన నాణ్యతను దెబ్బతీస్తాయి.
6 .వ్యసనాలు
వ్యసనం అనేది ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటి మానసిక, ఆరోగ్య సమస్యలను పెంచే ఒక రుగ్మత. అలాగే వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనలు భావోద్వేగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. వ్యసనం కారణంగా పనిలో, ఇంట్లో ఇతర బాధ్యతలను నిర్వర్తించడంలో సమస్యలు తలెత్తవచ్చు.
7 . వైఫల్యాలు
మనిషి జీవితంలో గెలుపు ఓటములు సర్వసాధారణం. వాటిని అనుకూలంగా తీసుకొని మనిషి ఎదుగుదలకు ప్రయత్నించాలి. ఓటములను, వైఫల్యాలను సమర్థవంతంగా ఎదుర్కొని వాటినుండి నేర్చుకొని మళ్లీమళ్లీ ప్రయత్నించడంలో విజయాన్ని చేరుకోవచ్చు. చిన్న చిన్న వైఫల్యాలకు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు నిరాశ నిస్పృహలలో కూరుకుపోవడం…. లేదా చిన్న విజయానికి కూడా అతిగా పొంగిపోవడం వంటివి మానసిక అసమర్ధతకు సంకేతం. యుక్త వయసులో ఉన్న పిల్లలలో ఇది సాధారణ లక్షణంగా మనం పరిగణించటం గమనార్హం.
కేవలం పరీక్షల్లో ఫెయిల్ కావటమే కాకుండా ప్రేమ విఫలం అవడాన్ని కూడా చాలామంది యువత తట్టుకోలేక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ఇలాంటి పిల్లల్లో డిప్రెషన్ వంటి వ్యాధులు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఆత్మన్యూనత భావాల వలన వీరు విజయ ద్వారాలను మూసి వేసుకుంటున్నారు. ఇది స్వయంకృతాపరాధమే అవుతుంది. మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడు మన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతాము. కుటుంబంలో ఆరోగ్యకరమైన వాతావరణన్ని ఏర్పాటు చేయగలుగుతాము. సమాజంలో సత్సంబంధాలు నెరపగలుగుతాము. మరీ ముఖ్యంగా ..ఒత్తిడిని జయించగలుగుతాము. పైన చెప్పిన ఈ ఏడు అంశాలను దృష్టిలో పెట్టుకొని గనుక మనం ముందుకు వెళ్లగలిగితే అవి మన విజయానికి సోపానాలుగా నిలుస్తాయి.
డాక్టర్ .రాధ .శివపురం
9989741502





