(కిందటివారం పూర్తివ్యాసం ముద్రణ కావలసి ఉంది కానీ కాలేదు. కొనసాగింపు భాగం ఇపుడు వేస్తున్నాము. పొరపాటుకు చింతిస్తున్నాము.) తమ మీద తల్లి నిరంకుశాధికారతను తప్పించుకుని బయటపడాలనుకున్న అరుంధతీ ఆమె అన్నా పదిహేడేళ్ళ వయసు లోపలే ఇంటినించి వెళ్ళిపోయి వారి బ్రతుకులు వారు లాగడం చేశారు తప్ప మళ్ళీ ఆమె దగ్గరనుంచి ఏ సహాయం స్వీకరించలేదు. ముఖ్యంగా అన్న. ఈమెకు ఢిల్లీ ఆర్కిటెక్చర్ కాలేజ్ సీట్ దొరికేందుకు ఏర్పాటు చేసేవరకే తల్లి ప్రమేయం. ఢిల్లీకి వచ్చిపడ్డాక ఈమె ఎవరో ఆమె ఎవరో అన్నట్లే ఉండిపోయారు. ఉన్నావా చచ్చావా అని కూతుర్ని అడిగిన పాపాన పోలేదు ఆ తల్లి తరువాత పదేళ్ళు. కూతురికి కావలసినదీ అదే.
ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలనే ఒకేరకమైన కోరిక కలిగిన ఈ తల్లీకూతుళ్ళకు విరోధం రావటం సులభమే కానీ, అసలు వారి స్వభావాలలోనే అంత భిన్నత్వానికి మూలం ఏమిటనేది మెల్లిగా చూస్తాము. మహిళాస్వేచ్ఛ, స్త్రీ అస్తిత్వ సిద్ధాంతాలలో తమ ఇద్దరికీ ఉన్నభేదాలు ఎటువంటివి అనే మర్మాన్ని విప్పడమే ఈ రచన చేయటంలో అరుంధతి రాయ్ ముఖ్యఉద్దేశం అనిపిస్తుంది, తన వాక్యాలవెనక నిగూఢార్థాలను చూస్తే.
మహిళకు ఆస్తిహక్కులు పోరాడి సంపాదించటం నుంచీ, పురుషాధిపత్య సమాజంలో స్వేచ్ఛగా నిలబడి, ఒంటిచేత్తో ఒక పెద్ద విద్యాసంస్థను విజయవంతంగా నిర్వహించటం, ఆర్థికంగా ఎదగడంతో పాటు ఆధిపత్యం సైతం సంపాదించి వ్యక్తిస్థాయి నుంచి తనే ఒకవ్యవస్థగా ఎదగటం విజయం అనుకునే వాదం తల్లిది. ఒకప్పుడు నీకిక్కడ స్థానం లేదని తరిమేసిన పితృస్వామ్యం రాజ్యమేలే చోటులోనే మర్రిచెట్టులా విస్తరించి వేళ్ళూని పాతుకుపోయి నిరూపించింది తనను తరిమేసినవాళ్ళకు, ఒక స్త్రీ పట్టుదల, శక్తి ఏమిటనేవి.
ఆమెకు ఏం కావాలో, దాన్ని ఎలా సాధించాలో తెలుసు. మనోదౌర్బల్యం, పరాజయం, పారిపోవడం, ప్రణాళిక లేకుండా బ్రతకటంలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నా ఆమెకవి ఏమాత్రమూ సహించని విషయాలు. తనకుతనే ఒక లంగరు, తనే పెద్దనౌక అనుకున్నట్లు బలమైన స్త్రీగా బ్రతికింది ఆమె. ప్రేమ, ఆకర్షణ, వాటివల్ల మోసపోవడం ఆమె దరిదాపులకు రావు. కూతురు అరుంధతీరాయ్ మనోగతి ఆమెకు పూర్తిగా వ్యతిరేకం. కుదురుగా ఇల్లు, కుదుటపడిన జీవితం, ఒడిదుడుకులు లేని ఒక రక్షణస్థానం ఇది అనిపించగానే ఇక అక్కడనుంచి పారిపోవాలనిపించటం ఈమె స్వభావం.
సముద్రంలో అడ్డంపడి పోవటంలో ఉన్న అపాయకరమైన కోరికలో ఆకర్షణ. లంగరూ నౌక ఈ పదాల్లో ఆమెకు అర్థంలేదు. ఏ వ్యవస్థ అయినా అందులో క్రమేపీ అనివార్యంగా అధికారధోరణులు ఒక కొసన, దొరికిన ఆలంబనకు అల్లుకుపోయే బానిసత్వ ధోరణులు ఒక కొసన చేరుతాయి. అవి రెండూ కూడా ఆమె దృష్టిలో మనిషి అస్తిత్వానికి రెండురకాల వ్యాధులు. తల్లికి క్రమపద్ధతి, స్వీయరక్షణ, గమ్యాలు. కూతురికి రెండిట్లోనూ నమ్మకం లేదు. రెండుసార్లు వివాహంలోంచి ఏ గొడవలూ ద్వేషాలు లేకుండా బయటికి వచ్చింది. తనవృత్తం పెద్దదని ఆమె అభిప్రాయం. వ్యక్తి, కుటుంబం, సంఘం పరిధులు దాటి దేశాన్ని చూడటం, అప్రజాస్వామిక నిర్ణయాలకు, చట్టాలకు ఎదురు పోరాడటం, అందులో తనకు ప్రాణాపాయమైన బెదిరింపులు ఎదురైనాసరే, అదీ, ఆమె ఎంచుకున్న త్రోవ.
వ్యక్తికి నిజమైన స్వతంత్ర అస్తిత్వం తననూ, తనస్థానాన్నీ పటిష్టం చేసుకుంటూ పోవటంలో ఉండదని ఈమె అనుభవం. గానుగెద్దు జీవితంలాంటి స్థిరరక్షణ వలయంనుంచి తప్పించి బయట పడవేసుకోవటం, బంధనాలకక్ష్యలను దాటి చరించగలగటం, అధికారకూపంలా తను తయారవకపోవటం అసలైన స్త్రీ స్వేచ్ఛ అని అనుకునే తత్వం ఈమెది. వ్యక్తిస్థాయిలో యుద్ధంచేసి ఒక వ్యవస్థగా, నియంతగా మారడం తల్లిచరిత్ర. తనకింద పనిచేసేవారిని అధికారంతో గడగడలాడించిన ప్రభువు ఆమె. కూతురి స్త్రీ అస్తిత్వవాదం, వాదాలనుంచి వ్యవస్థలనుంచి విడిపడటం మటుకేకాదు, వ్యవస్థగా తను మారిపోకుండా చూసుకోవటంలో ఉన్నది.
ఎంత ఉన్నతవాదమైనా దాన్ని వ్యవస్థీకృతం చేసే పోకడల నుంచీ పూర్తిస్థాయి విముక్తి తన గమ్యం. తల్లి అస్తిత్వపోరాటంలో అధికారం స్థిరపరచుకోవటం ఉంది. కూతురి వాదంలో ఎటువంటి అధికారాన్నైనా ప్రశ్నించటమే ఉంది.
ఒక్కపోలిక మటుకు ఉంది ఇద్దరికీ; ఇద్దరూకూడా వారివారి తల్లులు, పుట్టిళ్ళనుంచి ‘‘గెటౌట్‘‘ అనిపించుకున్నారు. అలా మాట్లాడిన తమ్ముడిని కోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చి కుటుంబ వారసత్వపు ఇంట్లోంచి తరిమేసింది మిసెస్ రాయ్. అరుంధతీ రాయ్ ఎవరి ఆస్తికీ ఎవర్నీ గెటౌట్ అనేహక్కుకూ వ్యాజ్యం వేయలేదు. ప్రధానమైన ఒక భేదం ఇద్దరిలో- తల్లికిలేని, ఈమెకు ఉన్న ఒక గుణంలో ఉంది అది; ప్రేమించటం, ప్రేమించబడటం ఈమెకు తెలుసు. అది ఇష్టం కూడా. ఈమెకు ప్రేమ విలువ తెలుసు. క్షమ విలువ తెలుసు. ప్రేమను బంధనంగా మారనివ్వకపోవటం ఇంకా బాగా తెలుసు.
“నా ఆశ్రయం, నా తుఫానూ ఒకరే” అన్న అరుంధతీ మాట ఒక్క తన నియంతతల్లిని గురించేనా? మరింత స్పష్టంగా మాతృదేశాన్ని ఉద్దేశించిన మాట అది. తనను దేశద్రోహి అని పిలుస్తూ, ఈ దేశంలో నీకు చోటులేదు వెళ్ళిపో అని అంటున్నకొద్దీ ఈ దేశంపై నాకు ప్రేమ అధికం అవుతోంది అంటుంది పుస్తకం మధ్య ఒకచోట ఎక్కడో, ఏదో యథాలాపంగా అన్నట్టు. తల్లి నెపం పెట్టుకుని దేశాన్ని, ప్రపంచంలో రకరకాల స్థాయిలలో జరిగే నియంతృత్వాన్ని ప్రశ్నించి, ఈ పరిస్థితుల్లో మనిషి ఎటువంటి అస్తిత్వస్పృహకు మేలుకోవలసి ఉందో హెచ్చరించింది ఈ పుస్తకం. (సమీక్ష చేసేపని పుస్తకంలో వినిపించిన సంగతులను ఎత్తిచెప్పటమే, సమీక్ష వ్రాసినవారు ఐచ్ఛికంగా ఆమోదించినవో, రచయితకు ఆపాదించినవో అయి ఉండవు ఆ సంగతులు.)
(వ్యాసం ముగిసింది)
పద్మజ సూరపరాజు





