తొలి మలి దశల తెలంగాణ ఉద్యమానికి అందివచ్చిన చైతన్యశీలి ఆమె. సామాజిక సాహిత్య రంగాల మీద ప్రేమ, వాటి మేలు కోసం గట్టిగా పని చేయాలనే పట్టుదల ఆమె స్వభావం. నిర్భీతి ఆమెలోని మరొక సుగుణం. తెలంగాణ సమాజం మీద తనదైన సంతకం చేసిన రచయిత, సామాజిక కార్యకర్త తిరునగరి దేవకీదేవితో ముఖాముఖి..
-కె.ఎన్.మల్లీశ్వరి
బతెలంగాణ ఉద్యమం మీ సాహిత్యజీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది?
బవివక్షను, అన్యాయాన్ని, అవినీతిని గుర్తించడం ప్రశ్నించడం, ఆ సమస్యలతో చేతనైనంత పోరాడటం నా స్వభావం. ఆ స్వభావమే తొలిదశ ఉద్యమానికి దారిచూపింది. అది అంతర్లీనంగా ఉన్న పోరాటపటిమను తట్టిలేపింది. గుండె ధైర్యాన్నిచ్చి పబ్లిక్ స్పీకర్‌గా తయారు చేసింది. రాజకీయనాయకుల స్వార్థాన్ని తెరిచిన పుస్తకంలా ముందుంచింది. ఈ ఉద్యమప్రస్థానం కొత్త మిత్రులను ఇచ్చింది. హేతుబద్ధత నేర్పింది. ఆధ్యాత్మిక వాతావరణంలో పుట్టిన నేను వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపిన. వరంగల్లులో పిఓడబ్ల్యు వ్యవస్థాపక సభ్యురాలైన. కానీ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండాల్సిన పరిస్థితి నా ఉద్యమ మార్గానికి బ్రేక్ వేసినప్పటికీ అంతరంగ భావజాలం స్థిరీకృతమై ఉండి, సహ అధ్యాపకుడు శంకరయ్యను ఇంటిముందే రెండు పూలదండలతో సహచరునిగా చేసుకున్న. ఆయన నిబద్ధత పట్టుదలగల సామాజిక కార్యకర్త ఐనందున ఉద్యోగం, కుటుంబబాధ్యతలు సహకరించనందున 50వ పడిలో రచనాప్రస్థానానికి పూనుకున్న.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూబోర్డు బసవపురాణంపై పరిశోధన చేయమని శాసించింది. అది నాకు మింగుడుపడక దాన్ని వదిలి తెలుగు విశ్వవిద్యాలయంలో ‘‘తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం’’ అంశంపై పరిశోధన చేసిన. చిన్ననాటి వ్యక్తిత్వాన్ని కొనసాగిస్తూ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న. ఒకవైపు ఉద్యమం చేస్తూనే పరిస్థితులను గమనిస్తూ వాటిని కొన్ని కవితలుగా రికార్డు చేసిన. తర్వాత ‘‘బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు- పాటల పరిణామక్రమం’’ అనే అంశంపై యూజీసీ మైనర్ రిసెర్చ్ ప్రాజెక్టు చేపట్టిన. ఈ రెండూ స్త్రీలపట్ల ప్రేమతో వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతూ రాసినవే. ఈ రెండు పుస్తకాలే కాకుండా దఫదఫాలుగా రాసిన నా వ్యాసాలు సమీక్షలు ముందుమాటలు, కథలు అన్నీ స్త్రీ చైతన్యదిశగా సమాజంలోని వివక్షను అక్షరబద్ధం చేస్తూ కొనసాగినై.
బసామాజిక కార్యకర్తగా మిమ్మల్ని సుదీర్ఘకాలం నిలిపి ఉంచిన అంశాలు ఏమిటి?
బసహచరుడు శంకరయ్య రంగారెడ్డిజిల్లా పౌరహక్కులసంఘం కన్వీనర్‌గా పనిచేయడం వల్ల సమాజంపట్ల నా అవగాహన మరింత పెరిగింది. సమావేశాలకు, నిజనిర్ధారణకు తరచుగా హరగోపాల్, కోదండరాం, జీవన్, బాలగోపాల్, కన్నాభిరాన్ గార్లు వికారాబాద్ వస్తూ ఉండేవాళ్ళు. నిజనిర్ధారణవల్ల చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలు నా మనసును కదిలించేవి. ముఖ్యంగా బాలగోపాల్ గారి వ్యక్తిత్వం నన్ను మరింత ఆలోచింపజేసేది. అప్పుడప్పుడూ ఒకటి రెండురోజులు మా ఇంట్లోనే ఉండేవారు. సహజంగానే సమాజం గురించి ఆలోచించే నేను ఈ పౌరహక్కుల సంఘ కార్యక్రమాలతో పాటు కొన్నిసందర్భాలలో మెరుపుతీగనై అధికారులను రాజకీయ నాయకులను ప్రశ్నించడానికి పూనుకునేదాన్ని. ఈ పరిస్థితులు నా స్వభావానికి తోడైనందువల్ల నేను సామాజిక కార్యకర్తగా కొనసాగిన బభిన్న సాహిత్యప్రక్రియలలో మీకు నచ్చిన ప్రక్రియలు ఏవి? ఎందుకు?
బచందోబధ్ధ కవిత్వం, కవిత్వం, నానీలు, కథ, నవల, నాటకం, విమర్శ మొదలైన ప్రక్రియలో నా అభిరుచి కథ. తర్వాత నవల. విషయం పాఠకులకి సమగ్రంగా చేరాలనేది నా అభిమతమైనందున కథలవైపే నా మొగ్గు. కవిత చాలావరకు కాన్సెప్ట్ కు పరిమితమైతే కథ సందేశంతో పాటు ఆ కథలోని ఇతరపాత్రల మనస్తత్వం, ఆ మనస్తత్వానికి దారితీసిన హేతుబద్ధతను పాఠకుల ముందు ఉంచుతుంది. కథకన్నా నవలది విశాలమైన వేదిక. కానీ ఈ తరం సంక్షిప్తతను ఇష్టపడుతూ ఉన్నది, పత్రికలుకూడా స్పేస్ నిబంధనను పాటిస్తున్నాయి. స్పేస్ నిబంధనను పాటిస్తూనే మంచి సందేశాన్నిచ్చే కథలు లేవని అనను. అట్లా రాయగలగడం కూడా ఒకకళ. ప్రతిభ కూడా ఆ క్రమంలో వచ్చినవే ఒకపేజీ కథలు, గల్ఫికలు. ఏమైనా నా మొగ్గుకథల వైపే.
బసాహిత్య సామాజిక సంస్థలలో మీ భాగస్వామ్యం?
బ2010 నుండి ప్రజాస్వామిక రచయితల వేదికలో సభ్యురాలుగా ఉన్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికై కృషిచేస్తున్న క్రమంలో కొన్నిరోజులు ప్రరవేలో మౌనంగా ఉన్న. 2017 నుండి తెలంగాణశాఖ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న. ఈ రచయితల సంస్థ సాహిత్య సామాజిక సమస్యలను తీసుకొని పనిచేస్తుంది. సంస్థలో అందరం కలిసికట్టుగా భాగస్వామ్యాన్ని పంచుకుంటాం. రుద్రమ సాహిత్య అధ్యయన వేదికలోనూ సభ్యురాలను. బహుళ అంతర్జాల త్రైమాసిక పత్రికలోనూ సంపాదక వర్గంలో ఉన్న.
సామాజిక సంస్థ గురించి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకాలంలో మహిళా జేఏసీ 15 మంది కన్వీనర్లలో నేను ఒకదాన్ని. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ కమిటీ రద్దయింది. మొదటినుండి నేను నా సహచరుడు శంకరయ్య సామాజిక సమస్యల పట్ల స్పందిస్తూ కృషి చేసినవాళ్లమే. 2010 నుండి ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీ ణిస్తూ 2017లో శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ చివరిరోజుల్లో కొందరు సామాజిక కార్యకర్తలు ఆయనను ఆర్థికంగా ఉపయోగించుకున్నారే తప్ప హార్దిక పలకరింపులు కరువైనై. నా మనసు గాయపడిరది. అది నా బలహీనత అయ్యుండొచ్చు. అది మొదలుకొని నేను ఏ సామాజికసంస్థలలో శాశ్వత సభ్యురాలుగా పనిచేయడం లేదు (పరవేలో తప్ప). కానీ ఏ సంస్థ సామాజికసమస్యలపై కార్యక్రమాలు కొనసాగిస్తున్నా సమస్యను గమనించి ఆయా సమావేశాల్లో నిరసనల్లో పాల్గొంటున్న.
బవర్తమాన సాహిత్య ధోరణులపై మీ అభిప్రాయం?
బవర్తమానంలో మధ్యతరగతి కథావస్తువుల స్థానంలో అస్తిత్వంలో భాగంగా దళిత, మైనారిటీ, ట్రాన్స్ జెండర్, ఆదివాసి, గిరిజన, ప్రాంతీయ ఆస్తిత్వ స్త్రీవాద రచనలు రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా స్త్రీవాదంలో ఇటీవల కాలంలో లైంగికస్వేచ్ఛకు సంబంధించిన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ వాదం, చర్చ కూడా సమాజంలో బాగానే వినపడుతుంది. మరోవైపు ప్రతిరోజు పత్రికల్లో తమ లైంగిక స్వేచ్ఛ కోసం భర్త భార్యను భార్య భర్తను అనుమానించి లేదా అడ్డు తొలగించే క్రమంలో చంపడం లేదా అదే క్రమంలో తమ లైంగిక స్వేచ్ఛకై కన్న పిల్లల్ని బలి చేయడం పంటి వార్తలు నిరంతరంగా వస్తూనే ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇద్దరూ లైంగికస్వేచ్ఛకు అనుకూలంగా ఉంటే సమస్య రాదు. ఈ కాలంలో వన్వే ట్రాఫిక్‌లో ఒకేవైపు ఆ లైంగిక స్వేచ్ఛను కోరుకోవడం వల్ల సమస్యలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. ఇదంతా ఓ సంఘర్షణ యుగం. ఈ సంఘర్షణకు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్న.