-కోట దామోదర్
కవిత్వం చదివితే పాఠకుని మనస్సులో అంతవరకూ అలుముకున్న అస్పష్టత చెరిగిపోయేలా ఉండాలి. అలాంటి కవిత్వం పురుడు పోసుకొని మహోజ్వలంగా విరబూసేందుకు కవి మనుసులో క్షీరసాగరమధనం జరిగినట్లుగా భావమథనం జరిగితేగానీ ఆ కవిత్వం పాఠకులను నూరు శాతం మెప్పించి తీరుతుంది. ఇటీవల ‘‘మహతీ సాహితీ కవిసంగమం’’, కరీంనగరం వారి ‘‘ధనుర్మాస కవితోత్సవం 2024-25’’ సందర్భంగా వైవిధ్య వ్యాస రచయిత యేచన్ చంద్ర శేఖర్ మస్తిష్కం నుండి పురుడుపోసుకున్న ‘‘కవన చంద్రికలు’’ ఆ కోవకు చెందినవే.
ఈ పుస్తకంలో ‘‘జీవన సౌరభాలు’’ మరియు ‘‘స్వాతంత్య్ర సమరయోధులు’’ అని రెండు భాగాలున్నాయి. ‘‘జీవన సౌరభాలు’’ లోని ‘‘సుఖం మరిగిన మనిషి’’ కవితను గమనిస్తే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘ఆధునికత’ పేరుతో మనిషి సుఖాలకు అలవాటుపడుతూ యాంత్రికంగా మారుతున్న విషయాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. మనిషి సుఖాలకు అలవాటుపడి, శారీరక శ్రమ లేక రోగాల పాలవుతున్నాడు. సమాజంలో మార్పు రావాలి. కానీ, ఆ మార్పు వలన మనిషికి ప్రయోజనం కలగాలి తప్ప పరాభవం, పతనం కాకూడదన్న విషయాన్నీ కవిత రూపంలో చెప్పడమనేది చాల గొప్ప విషయం. ‘‘కాయకష్టం మరిచాడు మనిషి సోమరిగా మారిపోయాడు మనిషి’’ అని అయన వాపోవడం ముమ్మాటికీ వాస్తవమే కదా!
‘‘ఛిద్రమవుతున్న బతుకు చిత్రం’’ కవితలో, ‘కరోనా’ నేపథ్యంలో బడుగుల బతుకు కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ రచయిత ఇలా అన్నారు, ‘‘ఛిద్రమవుతున్నాయి బడుగుల బతుకులు/ మానలేదింకా కరోనా రేపిన గాయాలు’’/‘‘అంతలోనే విరుచుకుపడ్డ ధరల శరాఘాతాలు. ఆకాశాన్నంటే ధరలతో తప్పట్లేదు వెతలు’’
కరోనా ప్రభావంతో సామాన్యుడు చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తోంటే, ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు పెను భారాన్ని మోపుతున్నాయని, అరకొర సంపాదనతో జీవితాలు కుదేలవుతున్నాయని అయినా బడుగు జీవులు సంసారసాగరమీదడానికి భగీరథప్రయత్నాలు చేస్తున్నారని ఈ కవిత ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘స్నేహం’’ ఈ కవితలో అవసరానికి ఆదుకునే ఆపన్న హస్తమే స్నేహం. చెమర్చిన కన్నులలో చెదిరిపోని జ్ఞాపకమే స్నేహం అంటూ, ఈ సృష్టిలో స్నేహానికి మించిన గొప్ప వరం మరొకటి లేదంటాడు రచయిత. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి మనిషికి కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. అందుకే మంచి స్నేహితున్ని మించిన ఆస్తి లేదంటారు.
రెండవభాగం ‘‘స్వాతంత్య్ర సమరయోధులు’’లో 37 కవితలు చరిత్రలో అట్టడుగు పుటలలో శిధిలావస్థలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల గురించి రాశారు. వారిలో చాలా మంది గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. చరిత్ర మరిచిన అలాంటి మహనీయుల గాధలను భవిష్యత్ తరాలు స్ఫూర్తిగా తీసుకునేలా, ఆ యోధుల త్యాగాలను విశ్లేషిస్తూ క్లుప్తంగా వివరించారు.
‘‘కవన చంద్రికలు’’ లోని ప్రతి కవిత దేనికది ప్రత్యేకమే. ప్రతి కవిత కూడా పాఠకుడిని భావుకతకు గురిచేసేలా రాయడం ఆయన రచనాశైలికి కలికితురాయిగా నిలుస్తాయి. చదివిన ప్రతి పాఠకుడు, కలం చేతబట్టి తన హృదయంతరాలాల్లో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోయాలనే ప్రేరణ కలిగించేలా సాగింది యేచెన్ చంద్రశేఖర్ ‘‘కవన చంద్రికలు’’.