టెలిమెట్రిల ఏర్పాటులో ఎందుకింత నిర్ల‌క్ష్యం?

– ఇందుకు కేటాయించిన రూ.4.18 కోట్ల దారిమ‌ళ్లింపు
-ఉద్దేశ‌పూర్వ‌కంగానే టెలిమెట్రిల ఏర్పాటులో జాప్యం
-ఏపీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌రు?
-ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రిల కోసం కేటాయించిన రూ.4.18 కోట్లను కేఆర్ ఎంబీ దారి మళ్లిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటన్నారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రిల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గం. జూన్ 2016లో జరిగిన కేఆర్ఎంబీ  సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో ఇంకా 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాకపోవడం దురదృష్టకరమ‌న్నారు. కేఆర్ ఎంబీ  నిర్ణ‌యాన్ని ధిక్కరిస్తూ టెలీమెట్రి ఏర్పాటు కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? ఎందుకు ఏపీ మీద ఒత్తిడి చేయకుండా మౌనంగా ఉన్నట్లు? కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన కేఆర్ ఎంబీ , రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్ర‌శ్నించారు. తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ.. మూడు కలిసి టెలీమెట్రిల ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తూ, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయ‌న్నారు. ఏర్పాటు చేస్తున్నాం అని ప్రచారం చేసుకోవడమే తప్ప రెండేళ్ల నుండి కేంద్రం చేసింది ఏం లేదన్నారు. సబ్ జ్యూడిస్ అని సాకులు చెప్పే కేంద్రానికి సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పటికీ కేసీఆర్ 18చోట్ల టెలీమెట్రిలు ఏర్పాటు చేసిన విషయం గుర్తు లేదా? పోలవరం నల్లమల సాగర్ విషయంలో మొద్దు నిద్ర ప్రదర్శించినట్లుగానే టెలిమెట్రిల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమ‌న్నారు. రూ.4.18 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెంటనే రికవరి అయ్యేలా చేసి టెలిమెట్రిల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయ‌న డిమాండ్ చేశారు. కేవలం లేఖలు రాస్తూ కాలయాపన చేయకుండా, నిధులు మళ్లించిన కేఆర్ ఎంబీ పై కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు చేయాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *