పైన ముంబై, కింద చెన్నై, మధ్యలో మనమెక్కడ ?

తమిళ ఆధిపత్యాన్నివ్యతిరేకించడంగా, తెలుగు ఆత్మాభిమానాన్ని, చారిత్రక గర్వాన్ని చాటి చెప్పడంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వ్యక్తం అయింది. ఒకే భాషా సమాజంలో అసమానతలను తెలంగాణ ఉద్యమాలు సూచించాయి. ప్రాంతీయ అంతరాలకు తెలంగాణ తెలుగును తక్కువ చూడడం కూడా ఒక సూచిక అయింది. జాతీయోద్యమంలో ఉత్తరాది ఆధిపత్యం, హిందీ ని జాతీయతాసాధనంగా కాంగ్రెస్‌ ప్రచారం చేయడాన్ని దక్షిణాదిన, ముఖ్యంగా ద్రవిడ ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ నాయకత్వం ఆ నాడే కనుక, మరింతగా సమ్మిశ్రిత విధానాలను అనుసరించగలిగి ఉంటే, అనంతరకాలంలో వారు కోరుకునే ‘సమైక్యత’ సాధ్యమయ్యే అవకాశం ఉండేది. స్వాతంత్ర్యానంతర భారత దేశంలో, కమ్యూనిస్టుల కేరళ విజయాలు మినహాయిస్తే, కాంగ్రెస్ ఏకఛత్రాన్ని మొదట బద్దలు కొట్టింది ద్రవిడ రాజకీయపార్టీలే.

పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ..
ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే.. (వెలుగునీడలు)

స్వాతంత్ర్యం వచ్చిన పద్నాలుగేళ్లకే ఒక సినిమా పాటలో ‘ ఈ దేశం ఎటు దిగజారు’? అంటూ శ్రీశ్రీ ఆవేదన చెందిన సమస్యల్లో భాషాద్వేషాలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యోద్యమంతో పాటే, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం కూడా ఆందోళనలు జరిగాయని గుర్తుపెట్టుకుంటే, దేశప్రజల్లో అసమానతలకు, ఆకాంక్షలకు భాషలు కూడా ప్రాతిపదికలుగా ఉండడం ఆశ్చర్యం అనిపించదు. అనేక మతాలు, జాతులు, కులాలు, నైసర్గిక భేదాలు, భాషాసమాజాలు, సంస్కృతులు ఉన్న దేశాన్ని ఒక్క జాతిగా నిర్వచించి, ఒకే ఆశయం దిశగా నడిపించడమంటే అది ఎంతో జటిలమైన, దుస్సాధ్యమైన కార్యక్రమం. ప్రత్యేక జనశ్రేణుల ఉద్యమాల వల్ల ప్రజల్లో అనైక్యత, ఘర్షణ,ద్వేషం ఏర్పడతాయనడం విషయాన్ని తలకిందులుగా అర్థం చేసుకోవడమే. విభేదాలు, అసమానతలు,వివక్షలు ఉన్నందువల్లనే ప్రజలలో ఐక్యమత్యం ఏర్పడదు. ప్రయోజనాల పోటీ, వారిని పరస్పర ప్రత్యర్థులుగా నిలబెడుతుంది.

భాషల మీద ప్రేమ కానీ, ఇతర భాషల మీద వ్యతిరేకత కానీ, ఆ భాషలోని వర్ణమాల కారణంగానో, పదజాలం వల్లనో, మాధుర్యం వల్లనో, కఠోరత వల్లనో ఏర్పడవు. భాషను ప్రేమించడమంటే, అక్షరాలను, ధ్వనులను ప్రేమించడం కానేకాదు. భాష ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నామంటే, ఆ భాష మాట్లాడేవారి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నట్టు. అది ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ఆధిపత్యాలలో ఏదైనా కావచ్చు, అన్నీ కావచ్చు. గుంటూరుజిల్లాలో ఒక చిన్న ఉద్యోగానికి కూడా తమిళుడిని ఎంపిక చేయడం ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఆంధ్రుల ప్రత్యేక ఉద్యమానికి ఆజ్యం పలికింది. తమిళ ఆధిపత్యాన్నివ్యతిరేకించడంగా, తెలుగు ఆత్మాభిమానాన్ని, చారిత్రక గర్వాన్ని చాటి చెప్పడంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వ్యక్తం అయింది. ఒకే భాషా సమాజంలో అసమానతలను తెలంగాణ ఉద్యమాలు సూచించాయి. ప్రాంతీయ అంతరాలకు తెలంగాణ తెలుగును తక్కువ చూడడం కూడా ఒక సూచిక అయింది. జాతీయోద్యమంలో ఉత్తరాది ఆధిపత్యం, హిందీ ని జాతీయతాసాధనంగా కాంగ్రెస్‌ ప్రచారం చేయడాన్ని దక్షిణాదిన, ముఖ్యంగా ద్రవిడ ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ నాయకత్వం ఆ నాడే కనుక, మరింతగా సమ్మిశ్రిత విధానాలను అనుసరించగలిగి ఉంటే, అనంతరకాలంలో వారు కోరుకునే ‘సమైక్యత’ సాధ్యమయ్యే అవకాశం ఉండేది. స్వాతంత్ర్యానంతర భారత దేశంలో, కమ్యూనిస్టుల కేరళ విజయాలు మినహాయిస్తే, కాంగ్రెస్ ఏకఛత్రాన్ని మొదట బద్దలు కొట్టింది ద్రవిడ రాజకీయపార్టీలే.

బొంబాయి ప్రెసిడెన్సీలో మరాఠీ, కన్నడ, గుజరాతీ భాషలు మాట్లాడేవారుండేవారు. మరాఠీ ప్రజలకోసం బొంబాయి రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం కావాలని సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం నడిచింది. బొంబాయి మీద ఆర్థిక ఆధిపత్యం కలిగిన గుజరాతీలు బొంబాయి తమకే కావాలని పట్టుపట్టారు. అన్ని రకాలుగా పైచేయిగా ఉన్న గుజరాతీల నుంచి విడిపోవడమే కాక, దేశ ఆర్థికరాజధానిని కూడా మహారాష్ట్రులు దక్కించుకోగలిగారు. ఆ నాటి పోరాటం ఒక ప్రత్యేక, స్థానిక చైతన్యాన్ని తీసుకువచ్చింది. అందులో గుజరాతీ వ్యతిరేకత కూడా భాగమే. బొంబాయిని ఇతరుల వలసల నుంచి రక్షించే పేరుతో ప్రాంతీయ, భాషా ప్రత్యేకవాదంతో శివసేన 1960 దశాబ్దంలో హింసాత్మక చర్యలకు పాల్పడింది. దక్షిణాదివారి మీద దౌర్జన్యాలు చేసింది. మరాఠా చైతన్యాన్ని ముస్లిం వ్యతిరేక, హిందూమతవాద ధోరణులతో ముడిపెట్టడం శివసేన ప్రయాణంలో పెద్ద తప్పిదం. ఫలితంగా, దేశమంతా హిందూత్వ ఆవరించినప్పుడు, శివసేన అందులో అప్రధాన భాగస్వామి కావడమో, సంలీనం కావడమో జరగవలసి వచ్చింది. జాతీయవాద మత అస్తిత్వ వాదంలో తన ప్రత్యేక అస్తిత్వానికి గుర్తింపులేని గ్రహించిన తరువాత, మార్గాన్ని మార్చుకోవలసి వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన అలనాటి చీలికవర్గాలు ఇప్పుడు కొత్తగా చేయి చేయి కలుపుతున్నాయంటే , అది తీవ్ర జాతీయవాద బుల్‌డోజర్‌ను ప్రాంతీయతా అస్త్రంతో ఎదుర్కొనే ప్రయత్నమే. హిందీని మూడో నిర్బంధ భాషగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన వెంటనే శివసేన బాలఠాక్రే వర్గం, రాజ్‌ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణసేన దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. రెండు వర్గాలూ దగ్గర కావడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. జులై5 నాడు జమిలిగా బ్రహ్మాండమైన సభ పెట్టాయి. రాజకీయంగా కలసి పనిచేయాలని సంకేతాలిస్తున్నాయి. బాలాసాహెబ్‌ కూడా సాధించలేకపోయిన ఇద్దరు ఠాక్రేల ఐక్యతను, హిందీ ఆధిపత్య విధానాలు సాధించాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు, తీవ్రజాతీయవాదపార్టీకి పెద్దసమస్య వచ్చిపడింది. అందరినీ హిందీతో కట్టిపడేయడం ద్వారా, ఒకే సందేశం వినిపించే సౌలభ్యంతో పాటు, కార్పొరేట్లకు ఒకే పెద్దమార్కెట్‌ సమకూర్చడంతో పాటు, వైవిధ్యాన్ని కనీసస్థాయికి కుదించగలిగే వీలుండేది. పైగా, ప్రాంతీయభాషలను సామంతభాషలుగా మార్చవచ్చు. ప్రాంతీయ నాయకులను ప్రాంతాలకే పరిమితం చేసి ఉంచవచ్చు. అటువంటి రాజకీయశక్తి కలిగిన హిందీని ప్రాంతీయపార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ద్రావిడ ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తున్నదంటే అర్థం చేసుకోవచ్చు, హిందీ సోదర భాషా ప్రాంతాలైన మహారాష్ట్ర, బెంగాల్‌ నుంచి కూడా వస్తుంటే ఎట్లా? ఒక పక్క నుంచి దేశాన్నంతటినీ ఏకతాటి మీదికి తీసుకువస్తుంటే, ఈ పేలికలు చీలికలు ఏమిటి? ఇది అమిత్‌ షా కు నచ్చని పరిణామం.

ఇంకా భాషా వివాదాలను పట్టుకుని వేలాడడమేమిటని రాజదీప్‌సర్దేశాయి లాంటివారు ఆశ్చర్యపోతున్నారు. తమిళనాడులో శిష్టవర్గాల వారందరూ ప్రైవేటు స్కూళ్లలో పిల్లలకు హిందీ ఆప్షన్‌ లో చదువు చెప్పిస్తున్నారు, ముంబై లో అందరూ ఇంగ్లీషులోనే చదువుకుంటున్నారు, పేరుకు మాత్రమే, కలహాలకు మాత్రమే మరాఠీ, హిందీ వాదాలు అంటూ ఆయన భాషావాదాన్ని తేలికగా కొట్టిపారేస్తున్నారు. కార్పొరేట్ మేధావులైతే, ముంబై ఒక భాషది కాదు, ఒక సంస్కృతిది కాదు అంటూ సూక్తులు వల్లిస్తున్నారు. నేను మరాఠీ నేర్చుకోనే నేర్చుకోను- అంటూ ఒక స్టాక్‌ బ్రోకర్‌ ‘ఎక్స’లో పోస్ట్‌ చేశారు, అతని కార్యాలయాన్ని నవనిర్మాణ సేన వారు ధ్వంసం చేశారు. మరాఠీలో మాట్లాడలేదని ఒక షాపుయజమాని మీద కూడా అంతకు ముందు దాడిచేశారు. ఇటువంటి దాడులు, దౌర్జన్యాలు ఎంత మాత్రం ఆమోదనీయం కావు నిజమే కానీ, ఈ పరిణామాల వెనుక కేవలం భాషల మీద ప్రేమోపిచ్చో మాత్రమే లేవు అని, హిందీ విధింపును, హిందీ వ్యవహర్తలను వ్యతిరేకించడం ద్వారా, తమకు రాజకీయ ప్రత్యర్థులైన తీవ్రజాతీయవాదులకు శివసేన శ్రేణులు,ఎంఎన్ఎస్‌ కార్యకర్తలు ఒక బలమైన సంకేతం పంపుతున్నారు. మతవాదం ద్వారా చేస్తున్న సమీకరణను, తాము భాషావాదం ద్వారా చెదరగొట్టగలమని చెబుతున్నారు.

మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం జాతీయవిద్యావిధానానికి అనుగుణంగా హిందీ మూడోభాషగా నిర్బంధం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆ విధానాన్ని అమలుచేయబోనని బాహాటంగా ప్రకటించడమే కాకుండా, అందుకు కేంద్రం నుంచి ప్రతీకారచర్యలను కూడా ఎదుర్కొంటున్నది. నిజంగా, తమిళనాడు ప్రజలలో హిందీ వ్యతిరేకత మునుపటి మాదిరిగా ఉన్నదా? లక్షలాది మంది ఉత్తరాది కార్మికులు ఆ రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నారు. తమిళులు అనేకులు స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటున్నారు. దేశంలోని అనేక ఆర్థిక ప్రక్రియలు రాష్ట్రాల మధ్య సంబంధాలను అనివార్యం, సన్నిహితం చేస్తున్నాయి. అయినంత మాత్రాన, భాషా వ్యతిరేకతలోని రాజకీయాంశాల ప్రాసంగికత తొలగిపోదు. మోదీ మీద, షా మీద వ్యతిరేకతే ఇప్పుడు తమిళనాడులో హిందీ వ్యతిరేకతగా ముందుకువస్తున్నది.

ఇప్పుడొక ధర్మసందేహం వస్తే తప్పేమీ లేదు. అటుపైన మహారాష్ట్ర, కింద తమిళనాడు, హిందీ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తుంటే, ద్రావిడభాషాకుటుంబానికి చెందిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు, జాతీయ విద్యావిధానానికి, మూడుభాషల విధానానికి జోహుజూర్‌ అనడం ఏమిటి? భాషాధిపత్యం ద్వారా రాజకీయాధిపత్యం కూడా పొందడానికి ప్రయత్నిస్తున్న ప్రత్యర్థిపార్టీ దూరదృష్టిని తెలంగాణ అధికారపార్టీ ఎట్లా ఉపేక్షిస్తున్నది? హిందీ అంటే పెదవి విరిచే ఆంధ్రప్రదేశ్‌ ఎట్లా ఈ చేదుమందు మింగుతున్నది? ఎప్పటి నుంచో ఉన్నదే కదా అన్న ఉదాసీన భావమా? పోనీ, జాతీయవిద్యావిధానంలో, మాతృభాషలలో ఇంజనీరింగ్‌, వైద్యవిద్యలు బోధించాలని చెప్పారు కదా, హిందీవాళ్లు ఆ పనిలో వేగంగా ముందుకు వెడుతున్నారు కదా? తెలుగు భాషలో వృత్తివిద్యాకోర్సుల పాఠ్యపుస్తకాలను రూపొందించడానికి రెండురాష్ట్రప్రభుత్వాలు ఇప్పటివరకు చేసిందేమిటి?

అందుకని, ఇంగ్లీషును స్థానిక, ప్రాంతీయ భాషలకు శత్రువుగా చూపిస్తున్నారు. మనంమనం, భారతీయ భాషీయులం అంటున్నారు. ఇటువంటి జాతీయతతోనే ఆనాటి కాంగ్రెస్‌ లోని అధికసంఖ్యాకులు హిందీని జాతీయ అధికార భాష చేసే ప్రయత్నం చేసి భంగపడ్డారు. మన దేశంలో సహజ వ్యవహర్తలు లేని ఇంగ్లీషును జాతీయభాష చేయడం వల్ల ఏ ఒక్క వర్గం ఆధిపత్యం ఏర్పడదని గుర్తించి, అనుసంధానభాషగా అదే సరైనదని తాత్కాలిక అంగీకారానికి వచ్చి, ఆ అవగాహననే కొనసాగించుకుంటున్నాము. ప్రాథమిక,మాధ్యమిక స్థాయిలలో అయినా తెలుగు మీడియం లో చదువులు చెప్పాలని కోరితే, అది ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని వాదించిన వారు, అమిత్‌ షా వలసవాద ఆంగ్లభాషా సిద్ధాంతాన్ని ఏమాత్రం వ్యతిరేకించకపోవడం ఆశ్చర్యం.

రేవంత్‌రెడ్డికి, చంద్రబాబు నాయుడికి తెలుగుభాష మీద ప్రేమ లేదంటే, అర్థం యాభైయ్యారు అక్షరాల మీద, గుణింతాల మీద, వత్తులమీద ప్రేమ లేదని కాదు. తెలుగువారి స్వాభిమాన పురోగతి మీద పట్టింపు లేదని, భాషాభివృద్ధికి, ఆ భాషా సమాజాభివృద్ధికి ఉన్న సంబంధం వారికి తెలియదని భావం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page