కన్నుపొడుచుకున్నా కానరాని కాంతిరేఖ

“కెసిఆర్‌ క్రియాశీలత, రాష్ట్ర రాజకీయాలను ప్రజాసమస్యల వైపు మళ్లిస్తుందని, గట్టి ప్రతిపక్షం ఉండడం ప్రజాస్వామికతను పెంచుతుందని ఆశించినవాళ్లకు, అనంతర సన్నివేశం నిరాశనే కలిగించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, తీవ్రంగా మాట్లాడడమే తగిన స్పందన అనుకున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అయితే, తన పదవికి ఏ మాత్రం తగని భాషను, వ్యక్తీకరణను ఎంచుకున్నారు. అటువంటి దుర్భాషను విని ప్రత్యర్థులు భయపడతారా? పోనీ, స్వపక్షీయులు శెహబాస్‌ అని మెచ్చుకుంటారా? కాంగ్రెస్‌ వాదులు కూడా తలదించుకునేటట్టు ఉన్నాయి వారి నాయకుడి మాటలు!..”

k srinivas sannivesam article

కొత్త సంవత్సరం, తెలంగాణ రాజకీయాలు వేడిగా ఉండబోతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద అసంతృప్తి, అసమ్మతి- వ్యతిరేకతగా రూపుదిద్దుకోకుండా ఉన్న స్తబ్ద వాతావరణం, ఇప్పుడు మారబోతున్నది.

కొందరు ఆశించినట్టు, కొందరు ఊహించినట్టు, కొందరు సూచించినట్టు- తెరచాటు నుంచి కెసిఆర్‌ మళ్లీ వేదిక మీదికి వచ్చారు. రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకోవాలి, పార్టీ లోపల చక్కబరచుకోవాలి, ఈ రెండు కర్తవ్యాలను ఆయన గుర్తించే ఉంటారు. ఆయనలో వాడి, వేడి తగ్గాయా? మనిషి ఉత్తేజంగా కనిపించడం లేదా? అన్నచర్చలు చాలా మంది చేస్తున్నారు కానీ, రాజకీయమైన పదును, సందర్భశుద్ధి ఆయనలో ఏమాత్రం తగ్గలేదు. తన పరాజయానికి ప్రధానకారణమైన దక్షిణ తెలంగాణ సమస్యను, ఆంధ్రప్రదేశ్‌తో ముడిపడిన సమస్యలను అంశాలను ఎత్తుకోవడంలో ఆయనదైన వ్యూహం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద ఇప్పటికే ప్రచారంలో ఉన్న ‘ఆంధ్రా- అనుకూలత’ వాదనలను మరింత గట్టిపరిచి, పడావు పడిన పాలమూరు-రంగారెడ్డిని దానితో మేళవించడం- కెసిఆర్‌ ఆలోచన. ఆయన ఎంతో నిగ్రహంగా, ఆచితూచి, ముఖ్యమంత్రి పేరుకూడా తీయకుండా మాట్లాడినా, ఒకచోట స్వభావసిద్ధమైన దూకుడుమాట రానే వచ్చింది. పాపం, కెసిఆర్‌ కంఠశోష అంతా పక్కకుపోయి, ‘తోలుతీస్తా’ అన్న మాటే మీడియాకు కొబ్బరికాయలాగా దొరికింది.

తన రాజకీయ కార్యాచరణకు ఎంచుకున్న అంశాలు సందర్భానికి తగినవే కావచ్చును కానీ, వాటిని ఉద్యమాంశాలుగా చేయడంలో ఉన్న పరిమితులను కెసిఆర్‌ గుర్తించినట్టు లేదు. కాళేశ్వరం మీద దృష్టి పెట్టి, రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ జిల్లా సాగునీటి అవసరాల మీద బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం చిన్నదేమీ కాదు. పొరుగురాష్ట్రంతో జలవివాదంలో కెసిఆర్‌ ప్రదర్శించిన తెలంగాణ అనుకూల చొరవ ప్రశంసించ దగ్గ స్థాయిలో లేదు. ఈ అంశాల మీద ఆయన గట్టిగా నిలబడతారని నమ్మడానికి కావలసిన నైతికతా లేదు, పూర్వ ఉదాహరణలూ లేవు. మునుపటి వైఖరిలో లోపాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ అంశాలను చేపట్టకూడదని లేదు. కానీ, అందుకు ప్రత్యర్థుల నుంచి, తెలంగాణ వాదుల నుంచి వచ్చే నిలదీతలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

కెసిఆర్‌ క్రియాశీలత, రాష్ట్ర రాజకీయాలను ప్రజాసమస్యల వైపు మళ్లిస్తుందని, గట్టి ప్రతిపక్షం ఉండడం ప్రజాస్వామికతను పెంచుతుందని ఆశించినవాళ్లకు, అనంతర సన్నివేశం నిరాశనే కలిగించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, తీవ్రంగా మాట్లాడడమే తగిన స్పందన అనుకున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అయితే, తన పదవికి ఏ మాత్రం తగని భాషను, వ్యక్తీకరణను ఎంచుకున్నారు. అటువంటి దుర్భాషను విని ప్రత్యర్థులు భయపడతారా? పోనీ, స్వపక్షీయులు శెహబాస్‌ అని మెచ్చుకుంటారా? కాంగ్రెస్‌ వాదులు కూడా తలదించుకునేటట్టు ఉన్నాయి వారి నాయకుడి మాటలు! నీయవ్వ, బాత్‌రూములు కడిగెటోడు, పేడిమొహం బోడిగాడు, లాగుల్లో తొండలు విడవడం- ఈ పదజాలం ఒక రాష్ట్రాధినేత నోటి నుంచి రాదగిన మాటలు కావని ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కరలేదు. స్త్రీలను, ఎల్జీబీటీక్యూలను అవమానపరిచే, శ్రమను కించపరిచే, భూస్వామ్య హింసను ధ్వనింపజేసే ఇటువంటి భాషను వాడడం ఏరకంగా వీరత్వం అవుతుంది? ఇటువంటి రాజకీయ సంవాదాన్నా, తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ సంస్కారం ఆశించింది?

‌”కొత్త సంవత్సరం జాతీయస్థాయిలో అనేక కీలకమైన పరీక్షాఘట్టాలను అనుభవించబోతున్నది. అప్రతిహతంగా దూసుకుపోతున్న భారతీయజనతాపార్టీ-  బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ ఎన్నికలలో తన ప్రతాపాన్ని చూపించబోతున్నది. కేరళ రాజధాని తిరువనంతపురంలో నగరపాలిక ను చేజిక్కించుకోగలిగిన బిజెపి, ఆ రాష్ట్ర ఎన్నికలలో తన సత్తాను బాగానే చాటగలదు! మరోవైపు తమిళనాడులో కూడా తన బలాన్ని పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వాన్ని గెలవకపోవచ్చును కానీ, పరిస్థితిని గుణాత్మకంగా మార్చగలిగే ఫలితాలు రావచ్చును…”

కొత్త సంవత్సరం జాతీయస్థాయిలో అనేక కీలకమైన పరీక్షాఘట్టాలను అనుభవించబోతున్నది. అప్రతిహతంగా దూసుకుపోతున్న భారతీయజనతాపార్టీ- బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ ఎన్నికలలో తన ప్రతాపాన్ని చూపించబోతున్నది. కేరళ రాజధాని తిరువనంతపురంలో నగరపాలిక ను చేజిక్కించుకోగలిగిన బిజెపి, ఆ రాష్ట్ర ఎన్నికలలో తన సత్తాను బాగానే చాటగలదు! మరోవైపు తమిళనాడులో కూడా తన బలాన్ని పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వాన్ని గెలవకపోవచ్చును కానీ, పరిస్థితిని గుణాత్మకంగా మార్చగలిగే ఫలితాలు రావచ్చును. మదురైలో ఒక అయోధ్యతరహా వివాదం ఆరంభదశలో ఉన్నది. కొత్తపార్టీ పెట్టిన విజయ్‌, తొక్కిసలాట సంఘటన తరువాత, బిజెపి మీద గురి విరమించి, కేవలం డిఎంకెనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు.

ఇక బెంగాల్‌ ఎన్నికల్లో బిజెపి విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నది. అందుకు సానుకూలతను కల్పించే అంశాలు రాష్ట్రంలోనే కాదు, బయట కూడా సమకూరుతున్నాయి. బంగ్లాదేశ్‌లో మార్చిలో జరగనున్న ఎన్నికల సందర్భంలో తీవ్రమైన హింసాకాండ చెలరేగుతున్నది. షేక్‌హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన నాయకులు ఒకరొకరుగా హత్యలకు గురి అవుతున్నారు. అవామీలీగ్ కు అనుకూలురని పేరు పడిన హిందూ మైనారిటీల మీద, పత్రికల మీద దుండగులు దాడులు చేస్తున్నారు. దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఆ హింసాకాండ ప్రతిఫలనాలు బెంగాల్‌ లో కనిపిస్తున్నాయి. సహజంగానే అవి బిజెపికి అనుకూలంగా, తృణమూల్‌ కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అసోం ఎట్లాగూ బిజెపి ప్రాబల్యం లోనే ఉంది. బంగ్లాదేశ్‌ పరిణామాలు దాన్నిమరింత పటిష్టం చేస్తాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నికల జాబితా శీఘ్ర సవరణ ప్రక్రియ, ప్రతిపక్ష పార్టీలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొత్త ఓటర్ల చేర్పులు, పాత ఓటర్ల తొలగింపులు- పర్యవేక్షణకు, పౌరనిఘాకు అందనంత చాకచక్యంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

కేంద్రప్రభుత్వం దూకుడుకు కళ్లెం వేయగలవని ఆశించిన బిహార్‌ జనతాదళ్‌(యు) అసెంబ్లీ ఎన్నికల తరువాత తానే పరాధీనతలో పడిపోయింది, ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం తానే స్వయంగా బిజెపి భావజాలాన్ని ప్రకటించుకుంటూ, ‘సనాతన’ జనసేనతో పోటీపడుతున్నది.

దేశవ్యాప్తంగా, కాంగ్రెస్‌ దయనీయ స్థితి కొనసాగుతున్నది, మరింతగా దిగజారుతున్నది.

అనేక ప్రతికూల వాతావరణాల మధ్య, బలహీనతల మధ్య జాతీయ ప్రతిపక్షాలు, తమకు చేతనైనంత ప్రతిఘటన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. మమతాబెనర్జీ, స్టాలిన్‌ సర్వశక్తులు కూడగట్టుకుంటున్నారు. ఇద్దరిలో ఒకరికి నియంతృత్వలక్షణాలు, మరొకరికి అవినీతిపాలన అన్న ముద్రలు ఉన్నాయి. బొంబాయిలో కాంగ్రెస్‌ను పక్కనబెట్టి శివసేన రెండు వర్గాలు కలసికట్టుగా బిజెపికి పోటీ ఇవ్వాలనుకుంటున్నాయి.

“కొత్త సంవత్సరంలో మీడియా నైతికత, ముఖ్యంగా జాతీయ మీడియా నైతికత, సంక్షోభస్థాయికి చేరుకుంటుంది. ఉన్నావ్‌ ‌రేపిస్టుకు ఊరట కల్పించి, న్యాయవ్యవస్థ పెద్ద అవిశ్వసనీయతను ఎదుర్కొంటున్నది. అత్యున్నత న్యాయస్థానమే, భావప్రకటనా స్వేచ్ఛకు కొత్తనిర్వచనాలు చెబుతున్నది. ఎన్నికల సంఘం విశ్వసనీయత సరే సరి. మొత్తంగా సకల వ్యవస్థలు ప్రజల దృష్టిలో అపఖ్యాతి పాలైన స్థితిలో, ఉన్మాద రాజకీయాలు విజృంభించడమో, ఎక్కడో ఒక బలహీనంగానైనా ప్రజాస్వామిక వ్యక్తీకరణ పుంజుకోవడమో జరగడం అనివార్యం. అంతర్జాతీయ రాజకీయాలలో కూడా ఏర్పడిన ఒక దివాలాకోరు, జులాయి సరళి, జాతీయవాదమితవాద పాలనలన్నిటికీ అదే తరహా బరితెగింపులను విస్తరింపజేస్తున్నది…”

2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని గడువు పెట్టుకున్న కేంద్రప్రభుత్వం, ఆ దిశగా నిర్మూలనాయుద్ధాన్ని కొనసాగిస్తున్నది. అగ్రశ్రేణి నాయకత్వాన్ని భౌతికంగా తుదముట్టించడం, అనంతర శ్రేణులను లొంగదీసుకోవడం అనే వ్యూహంలో కొనసాగుతున్న చర్యలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మావోయిస్టు సానుభూతిపరులను కూడా నియంత్రించే చర్యలు కూడా మొదలయ్యాయని, గాదె ఇన్నయ్య అరెస్టు, ఆయన మాటలను ప్రసారం చేసిన విడియో జర్నలిస్టు సంస్థకు నోటీసులివ్వడం వంటి చర్యలు సూచిస్తున్నాయి. వీటిపై పౌరసమాజం నుంచి అరకొర స్పందనలు మాత్రమే వెలువడడం, మారుతున్న వాతావరణాన్ని సూచిస్తున్నది. మావోయిస్టుల సంగతేమో కానీ, ప్రజాస్వామిక వాతావరణం మీద ఈ నిర్బంధాల ప్రభావం గణనీయంగా ఉండబోతున్నదన్న భయం వ్యాపించింది. కొత్త సంవత్సరంలో ఈ ఉద్రిక్తతలు మరింతగా విస్తరించే అవకాశం ఉన్నది.

ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పుడు, బిజెపి కొత్త మార్గాలలో దానిని ఎదుర్కొంటున్నది. ఇండిగో సంక్షోభాన్ని తెలుగుదేశం మంత్రిమీద, లేదా, ఆ విమానయాన సంస్థ మీద నెట్టివేయగలిగింది. ఆరావళి మైనింగ్‌ విషయంలో వ్యక్తమైన వ్యతిరేకతను పట్టించుకుని వెనక్కితగ్గింది. ఈ రెండు విషయాల్లోను, ఢిల్లీ కాలుష్యం విషయంలోను అనుకూల మీడియా నాయకుడైన అర్ణబ్‌ గోస్వామి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి, తన ఒత్తిడి వల్లనే దిద్దుబాటు చర్యలు జరిగాయని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతలోనే విశ్వసనీయత ఉన్నదన్నగుర్తింపు తెచ్చుకుని, దానిని కూడా పెద్దగొంతుక సాయంతో ప్రయోజనకరం చేసుకుంటున్న ఘనత అర్ణబ్‌ టీవీకి దక్కుతుంది.

కొత్త సంవత్సరంలో మీడియా నైతికత, ముఖ్యంగా జాతీయ మీడియా నైతికత, సంక్షోభస్థాయికి చేరుకుంటుంది. ఉన్నావ్ రేపిస్టుకు ఊరట కల్పించి, న్యాయవ్యవస్థ పెద్ద అవిశ్వసనీయతను ఎదుర్కొంటున్నది. అత్యున్నత న్యాయస్థానమే, భావప్రకటనా స్వేచ్ఛకు కొత్తనిర్వచనాలు చెబుతున్నది. ఎన్నికల సంఘం విశ్వసనీయత సరే సరి. మొత్తంగా సకల వ్యవస్థలు ప్రజల దృష్టిలో అపఖ్యాతి పాలైన స్థితిలో, ఉన్మాద రాజకీయాలు విజృంభించడమో, ఎక్కడో ఒక బలహీనంగానైనా ప్రజాస్వామిక వ్యక్తీకరణ పుంజుకోవడమో జరగడం అనివార్యం. అంతర్జాతీయ రాజకీయాలలో కూడా ఏర్పడిన ఒక దివాళాకోరు, జులాయి సరళి, జాతీయవాదమితవాద పాలనలన్నిటికీ అదే తరహా బరితెగింపులను విస్తరింపజేస్తున్నది.

***

ఈ అతి నిరాశాపూరిత సన్నివేశంలో, ఈ ‘సన్నివేశం’ కాలమ్‌ ముగుస్తున్నది. దాదాపు పదకొండు నెలల పాటు సాగిన ఈ సంభాషణకు విరామం ఇస్తున్నాను. నా రచనను ఎప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ‘ప్రజాతంత్ర’ సంపాదకులకు, మిత్ర పాఠకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page