“గతంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికుండిన రాజకీయ సాన్నిహిత్యాన్ని ప్రయోగించి బిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ నీళ్లన్నీ ఆంధ్ర ప్రదేశ్ కు ధారాదత్తం చేస్తున్నారని పదే పదే ఆరోపించుతుంటారు. గాని వాస్తవంలో ఇటీవల కాలంలో అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో రేవంత్ రెడ్డి పై చేయి సంపాదించుతున్నారు. అద్దో పులి ఇద్దో తోక అంటున్నారు. గాని పోలవరం బనకచర్ల అనుసంధానానికి కూడా పీట ముడి పడింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ నది మీద ఒక్క డిపిఆర్ ను కేంద్ర జల సంఘం వద్ద ఆమోదం పొంద లేదు. కాని అదే సమయంలో తెలంగాణ కొన్ని డిపిఆర్ లు ఆమోదం పొందింది..”
ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెంది పై చేయి సాధిస్తున్నారు. ఇటీవల రెండు అంశాల్లో కేంద్ర జల శక్తి శాఖ తెలంగాణకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. అయితే బిఆర్ఎస్ పార్టీ నేతలు గతంలో రేవంత్ రెడ్డి నేపధ్యం దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చేసే ఆరోపణల్లో అంత పస లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే ఇరువురు మధ్య ఉప్పు నిప్పుగా వుంది. పట్టిసీమ ఎత్తిపోతలు కోసం మేడి గడ్డ బరాజ్ పడావు పెట్టాడనేది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమే. బిఆర్ఎస్ పార్టీ నేతలే డెబ్బయ్ వేలు క్యూసెక్కులు గోదావరిలో ప్రవాహముందని చెబుతుండగా తాజాగా లక్షల క్యూసెక్కులలోనికి ప్రవాహం చేరింది. పట్టిసీమ ఎత్తిపోతల్లో కేవలం ఆరేడు వేల క్యూసెక్కులే.పైగా మేడిగడ్డ బరాజ్ కింద ఇంద్రావతి శబరి నదులు వున్నాయి. సమస్యల్లా ఒకటే. కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ లను నిర్మాణ లోపంతో రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ నిలిపివేసింది. ఆపరేషన్ నిలిపి వేయ వలసినంత లోపాలు లేవని బిఆర్ఎస్ పార్టీ నేతల వాదన. కేంద్ర జల శక్తి శాఖకు చెందిన నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ ఆపరేషన్ నిలిపి వేయమన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై ఉత్తర దక్షిణ ధృవాలుగా ఇరువురు వున్నారు. ఈ ప్రభావం రాష్ట్రంలో ప్రతి అంశంపైన తన ప్రతాపం చూపుతోంది ఇక అసలు విషయానికొద్దాం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుండి గత పది సంవత్సరాలుగా గోదావరి నదిలో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వాటాలపై వాద వివాదాలు సాగుతున్నాయి. ఇరువురూ వేర్వేరు గణాంకాలు చెబుతూ వస్తున్నారు. తెలంగాణ తన వాటా 968 టియంసిలని ఆంధ్ర ప్రదేశ్ వాటా 515 లని చెబుతూ వచ్చింది.ఈ గణాంకాలను ఆంధ్ర ప్రదేశ్ వ్యతిరేకించి తమ వాటా 738 టియంసిలని చెబుతూ వస్తోంది. తీరా గత నెలలో కేంద్ర జల సంఘం వర్చువల్ గా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ చెబుతున్న గణాంకాలనే ఖరారు చేసింది. కేంద్ర జల సంఘం ఈ గణాంకాలనే ఖరారు చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ అధికారులు ఊహించ లేదని చెబుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అధికారులు ఇందుకు అభ్యంతరం పెడితే వచ్చే సమావేశంలో చర్చించుదామని కేంద్ర జల సంఘం అధికారులు సమావేశం ముగించినట్లు చెబుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రెడిట్టే. మరో వేపు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం వద్ద చక్రం తిప్పతున్నాడనే ప్రచారం వున్నా ఆ పప్పు లేమీ ఉడక లేదు. ఇదిలా ఉండగా పులి మీద పుట్ర అన్నట్లు మరో సంఘటన తెలంగాణకు అనుకూలంగా జరిగింది. కెసిఆర్ హయాంలో 2020 లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణ నదీ జలాలు మొత్తంగా తిరిగి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీకి 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం క్రింద ట్రిబ్యునల్ నియామకానికి తీర్మానం చేశారు. అదే సమావేశంలోనే గోదావరి నదీ జలాలు రెండు రాష్ట్రాల మధ్య పంపిణీకి ట్రిబ్యునల్ నియమించాలని తీర్మానం చేశారు. అయితే తదుపరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పట్టించుకోలేదు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కీలక మైన ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు జల వనరులు శాఖ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వున్నా దిల్లీ పర్యటనకు వెళ్లినా పోలవరం బనకచర్ల అనుసంధానం తప్ప మరో ధ్యాస లేక పోయింది.
తుదకు బనకచర్ల అనుసంధానానికి పీట ముడి పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జలాలపై ట్రిబ్యునల్ వేయాలని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కోరారు. ఈ సందర్భంగా పలు వేదికల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అంతిమంగా ఈ నెల 7 వతేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ లేఖ రాస్తూ గోదావరి ట్రిబ్యునల్ అవసరం లేదని తేల్చి వేశారు.. ఈ పరిణామం ఆంధ్ర ప్రదేశ్ కు అశని పాతమే. ఈ లేఖ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎట్టి స్పందన లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం బయట పెట్టలేదు. అంతా గుంభనంగా వున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో మరో విజయం జమ అయింది. కాగా ఇటీవల జరిగిన గోదావరి యాజమాన్య బోర్డు సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ అధికారులు గోదావరి నదీ జలాలపై ట్రిబ్యునల్ వేయాలని గట్టిగా కోరారు. యాజమాన్యం బోర్డు పోస్టాఫీసు పని చేస్తుంది తప్ప అంతకు మించి జరిగేదేమీ వుండదు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ఒక దఫా ట్రిబ్యునల్ అవసరం లేదని నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పు చేసే అవకాశం వుండదు.
బోర్డు సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ మరి కొంత దూరం వెళ్లింది. గోదావరి నదిపై తెలంగాణకు చెంది ఆమోదించిన ప్రాజెక్టుల డిపిఆర్ పున: పరిశీలించాలని కోరింది. ఇందుకు తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటీవల జరిగిన గోదావరి యాజమాన్య బోర్డు సమావేశంతో తిరిగి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉప్పునిప్పుగా తయారైంది. ఈ రగడను పక్క దారి పట్టించేందుకు బోర్డు చైర్మన్ వాస్తవంలో గొదావరిలో ఎన్ని నీళ్లు ఉన్నాయో అధ్యయనం చేసేందుకు నిర్ణయం తీసుకొన్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికుండిన రాజకీయ సాన్నిహిత్యాన్ని ప్రయోగించి బిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ నీళ్లన్నీ ఆంధ్ర ప్రదేశ్ కు ధారాదత్తం చేస్తున్నారని పదే పదే ఆరోపించుతున్నారు. . గాని వాస్తవంలో ఇటీవల కాలంలో అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో రేవంత్ రెడ్డి పై చేయి సంపాదించుతున్నారు. అద్దో పులి ఇద్దో తోక అంటున్నారు. గాని పోలవరం బనకచర్ల అనుసంధానానికి కూడా పీట ముడి పడింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ నది మీద ఒక్క డిపిఆర్ ను కేంద్ర జల సంఘం వద్ద ఆమోదం పొంద లేదు. కాని అదే సమయంలో తెలంగాణ కొన్ని డిపిఆర్ లు ఆమోదం పొందింది.





