భూపాలపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి
భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి ఘోరి మండలం చెన్నాపూర్‌లో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ మంగళవారం పారంబోత్సవం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభోత్సవం చేశారు. జిల్లాలో రూ.8.70 కోట్ల విలువైన సబ్ స్టేషన్‌లను ప్రారంభించిన అనంతరం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో ఇల్లు లేని, ఆదాయం లేని కుటుంబాలు ఉండొద్దు.. ఆకలితో ఏ ఒక్కరూ బాధపడొద్దు అనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని వెనుకబడనివ్వం, అభివృద్ధిని ఆగనివ్వం.. గతంతో పోలిస్తే రెండు వేల మెగావాట్ల అదనపు డిమాండ్ వచ్చినా రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని వివరించారు. ఉచిత విద్యుత్ పథకాల కోసం రాష్ట్ర ప్రజల పక్షాన ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.13,992 కోట్లు ఖర్చు చేస్తున్నదని భట్టి చెప్పారు.
బీఆర్‌ఎస్ నాయకులు కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్ము దోపిడీ చేసి సిగ్గు లేకుండా బ్రహ్మాండమని చెబుతున్నారంటూ విమర్శించారు. ఈ ప్రాజెక్టు అత్యంత ప్రమాదకరమని, డిజైన్‌కు, కట్టిన దానికి పొంతనలేదని జాతీయ ప్రాజెక్టుల భదత్రా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) చెప్పిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులకు చిన్న పగులు కూడా రాలేదని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు, సీఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.