- శాస్త్రీయంగా కుల గణన సర్వే
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: బీసీల పట్ల చిత్తశుద్ధితో వారికి న్యాయం చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ఉపముఖ్యమంత్రి భట్ట విక్రమార్క అన్నారు. బిసి రిజర్వేషన్ బిల్లు కోసం ఏడాదిగా సుదీర్ఘంగా కసరత్తు చేశామని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో కుల గణన సర్వే చేయించి బీసీల లెక్కలు తేల్చి సభలో తీర్మానానికి పెట్టామన్నారు. అసెంబ్లీలో బిసి బిల్లు చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని శాసనసభలో పెట్టిన తీర్మానాన్ని సాదరంగా స్వాగతిస్తూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ప్రతి సభ్యుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా ఏడాది కాలం పాటు కసరత్తు చేసిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిన వెంటనే కులగణన సర్వే జరిపించి జనాభా దామాషా ప్రకారం అన్ని వనరులు, అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మండలి కులగణన సర్వే కు శ్రీకారం చుట్టిందని తెలిపారు. 2024 ఫిబ్రవరిలో క్యాబినెట్లో తీర్మానం చేసి, అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేశామని తెలిపారు. కులగణన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని శాస్త్రీయంగా పగడ్బందీగా 50 రోజుల్లో పూర్తి చేసింది. కొంతమంది సర్వేలో పాల్గొనకపోవడంతో వారి కోసం రెండోసారి కూడా సభ్యుల కోరిక మేరకు అవకాశం కల్పించాం. ప్లానింగ్ శాఖ ద్వారా శాస్త్రీయంగా జరిగిన కులగణన సర్వే ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్లానింగ్ శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రిగా తాను ప్రతిరోజు పర్యవేక్షించాం. భారతదేశంలో కులగణన శాస్త్రీయంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కులగణన చేయాల్సిన సమయంలో మనం చేసిన సర్వే ను మోడల్ గా తీసుకునేంత శాస్త్రీయంగా చేయించాం. గతంలో కేంద్రానికి పంపిన అనేక తీర్మానాలు శాస్త్రీయంగా లేకపోవడం వల్ల కోర్టుల్లో వీగిపోయేవి. అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా సర్వే చేయించడంతో పాటు సర్వే సంఖ్యని అసెంబ్లీలో తీర్మానానికి పెట్టామని తెలిపారు.
శాస్త్రీయంగా జరిగిన కుల గణన సర్వేలో బీసీలు 50.36 శాతం ఉన్నారు. ఈ సంఖ్య ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సభలో తీర్మానాన్ని పెట్టాం. అసెంబ్లీలో చేసిన బీసీ తీర్మానాన్ని వచ్చే పార్లమెంటు తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణలో కులగణన జరిగినట్టే దేశ వ్యాప్తంగా జరగాలి. సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ బిల్లు తీర్మానాన్ని కేంద్రానికి పంపించడమే కాకుండా ఆ బిల్లు అమలు కోసం ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడి ఒప్పించడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని సీఎం ఆదేశించారని భట్టి విక్రమార్క తెలిపారు. పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమయం తీసుకుని రాష్ట్రంలో ఉన్న అఖిలపక్ష పార్టీల నాయకులను దిల్లీకి తీసుకువెళ్లి 42 శాతం బిసి రిజర్వేషన్ అమలుకు ప్రధానమంత్రి మోదీని కలిసి పార్లమెంట్లో ఏకగ్రీవంగా బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఆహ్వానిస్తూ వారు చేసిన కృషిని అభినందిస్తూ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.