పెండింగ్ ప్రాజెక్టులన్నీపూర్తి చేయాలి..
10 నెలల్లో 50 వేల పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం
4న లక్ష మందితో పెద్దపల్లిలో యువ శక్తి బహిరంగ సభ
నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులు, పౌరసరఫరాల విభాగంపై సమీక్ష
పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర నీటిపారుదల ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హరిహర వేణుగోపాల్ తో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌరసరఫరాల శాఖ విభాగం పై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ హెలిపాడ్ వద్దకు చేరుకున్న మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పుష్ప గుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.
ధాన్యం కొనుగోలు పై అధికారుల తీసుకోవాల్సిన చర్యల గురించి పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వ పనులు, కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టు, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం, రామగుండం ఎత్తిపోతల పథకం, ఎల్లంపల్లి కెనాల్ నెట్ వర్క్ ప్యాకేజ్ 2 పనులు, ధాన్యం సేకరణ, కస్టం మిల్లింగ్ రైస్ డెలివరీ తదితర అంశాల పై మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్రం వొచ్చిన తరువాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి తెలిపారు. గతంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని అన్నారు. రైతులకు ఎక్కడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులకు రికార్డు సమయంలో వడ్ల డబ్బులు పండున్నాయని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ధాన్యం సేకరణ సంతృప్తి కరంగా ఉందన్నారు.
డిసెంబర్ 4న సీఎం పర్యటన ఉన్న సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి రైస్ మిల్లులు/ ఇంటర్మీడియట్ గోదాములకు తరలించాలని, వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తే గంటల వ్యవధిలో రైతులకు మద్దతు ధర, బోనస్ చెల్లించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయానికి 100% ధాన్యం డబ్బులు చెల్లించి ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సన్న రకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అధికంగా కొనుగోలు చేయాలని, ప్రైవేట్ వ్యాపారులు ఎక్కడ 2800 కంటే తక్కువ ధరతో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయకుండా చూడాలని అన్నారు. రాబోయే సంవత్సరంలో రేషన్ లో సన్న బియ్యం ఇస్తున్నామని, దీనికి అనుగుణంగా కనీసం 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర గడిచిన నేపథ్యంలో డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తమ ప్రభుత్వం 10 నెలల కాలంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు.
తక్కువ ఖర్చుతో రైతులకు సాగు నీరు అందించే పనులు ప్రాధాన్యతతో చేపట్టాలని మంత్రి ఉత్తమ్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సమృద్దిగా నీరు అందుబాటులో ఉంటూ, కాస్ట్ బెనిఫిట్ నిష్పత్తి సానుకూలంగా ఉన్న పనులను సంబంధిత ఎమ్మెల్యే లతో కలిసి సమన్వయం చేసుకుంటూ ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.రోళ్ళ వాగు ప్రాజెక్టు సంబంధించి అటవీ భూముల సేకరణ ప్రక్రియ నీటి పారుదల శాఖ భూ సేకరణ, ఆర్ %•% ఆర్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన అధికారితో సమన్వయం చేస్తూ పూర్తి చేయాలని అన్నారు.
రోళ్ళ వాగు పై క్షేత్రస్థాయి నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. గౌరవెల్లి ప్రాజెక్టు సంబంధించి భూ సేకరణ కోసం అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామని, గౌరవెల్లి కాల్వ పనులు త్వరగా చేపట్టేలా స్థానిక రైతులతో మాట్లాడి కోర్టు కేసు విత్ డ్రా చేయించాలని మంత్రి ప్రజాప్రతినిధులను కోరారు. పత్తిపాక రిజర్వాయర్ 2950 కోట్లు 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు ప్రాథమిక అంచనాలు తయారు చేశామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు కాల్వల ఆపరేషన్, నిర్వహణ కు నిధులు కేటాయించలేదని, ప్రస్తుతం కాల్వల మరమ్మత్తు పనులు అవసరమైన చేపట్టి పూర్తి చేస్తామని అన్నారు. రామగుండం ఎత్తిపోతల పథకం 95 శాతం పూర్తయిందని, డిసెంబర్ నెలాఖరు వరకు పెండింగ్ పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నుంచి రైతులకు సాగు నీరు అందించాలని మంత్రి సూచించారు. పాలకుర్తి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు, నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు లోని ప్యాకేజ్ 9 పెండింగ్ పనులు, చిన్న కాళేశ్వరం పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న చెరువుల మరమ్మత్తు పనులు ప్రతిపాదనలు తయారు చేయాలని, వచ్చే వానకాలం నాటికి ఆ చెరువులను బాగు చేయాలని మంత్రి ఉత్తమ ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో రైతులకు అధికంగా లాభం చేకూరుతుందని, రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, 2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ పథకాల లబ్ధి పొందుతున్న రైతులతో వీడియోలు చేసి ప్రచారం చేయాలని , గ్రామాలలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా జరుగుతుందని అన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ పాలసీ అనుసరిస్తూ సహకారం అందిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ను కలెక్టర్, ఉన్నతాధికారులు రెగ్యులర్ గా తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని అన్నారు. మెస్ చార్జీల బిల్లులను గ్రీన్ చానేళ్ళ ద్వారా సరఫరా చేస్తామని అన్నారు. గౌరవెల్లి గండేపల్లి ప్రాజెక్టులను లింక్ చేసి సమాంతరంగా నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి బండ్ నిర్మాణం చివరి దశలో ఉందని, కాలువల పనులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని, భూ సేకరణ పై ఎటువంటి కోర్టు నిబంధనల లేనందున ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం మంత్రుల బృందం సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 4న పాల్గొనే యువ శక్తి సభా స్థలిని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి ముఖ్య మంత్రి సభ నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు, సన్న రకం వడ్లకు బోనస్ వంటి అంశాల పై తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్య నారాయణ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పామెలా సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ లు డి.వేణు, జే.అరుణ శ్రీ, అదనపు కలెక్టర్ , రెవెన్యూ డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.