- దేశ ప్రగతిలో రైల్వేలు ఎంతో కీలకం
- హైదరాబాద్ -బందర్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సహకరించండి..
- రాష్ట్రంలో 370 కి.మీ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం
- చర్లపల్లిలో కొత్త టెర్మినల్ అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6 : దేశ ప్రగతిలో రైల్వే అభివృద్ధి ఎంతో కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో కొత్త టెర్మినల్, స్టేషన్‌ను పూర్తి చేసినందుకు కేంద్రానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వంటి రాష్ట్రాల అభివృద్ధి కూడా రైల్వేల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందన్నారు. ఒక ట్రిలియన్ డాలర్ జిడిపి ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని తాము సంకల్పించామని తెలిపారు.
భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, డైరెక్ట్ రైల్వే నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణలో 370 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ ను నిర్మించబోతున్నామని, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ నిర్మాణంలో కేంద్రం పూర్తిగా సహకరించాలన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2కు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 కు పూర్తి సహకారం అందించాలన్నారు. వికారాబాద్ నుంచి కృష్ణా రైలు మార్గాన్ని, కల్వకుర్తి నుంచి మాచర్ల మధ్య కొత్త రైల్వే లైన్లు, డోర్నకల్ నుంచి రెండు లైన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.