– ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆలోచన చేస్తున్నాం
– రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి తెచ్చాం
– మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు కొదువే లేదు
– ప్రజా ప్రభుత్వంలో ప్రశాంత వాతావరణం
– మధిరలో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వడివడిగా ముందుకు సాగడానికి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చేరడానికి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విజ్ఞప్తి చేశారు. మధిరలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్, విద్యా శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయని, ఈ శాఖలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. మురుగు నీటిని శుద్ధి చేసేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్టీపీలు మంజూరు చేశారని, పట్టణాల్లో హాస్పిటల్స్, విద్య, విద్యుత్ రంగాల్లో ప్రపంచంలో వస్తున్న పరిణామాలÅ£నుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు 15వ తేదీ తర్వాతే వచ్చేవని, కానీ తాము అధికారంలోకి రాగానే ప్రతి నెలా మొదటి తేదీనే జమ చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారి సంక్షేమం కోసం రూ.కోటి ప్రమాద బీమా కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నామని, ఇవన్నీ నిరంతరం కొనసాగాలంటే ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ వర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం కోరారు. గ్లోబల్ సమ్మిట్‌లో 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశామని, మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి రాష్ట్రం చేరుకుందని తెలిపారు. పదేళ్లు పరిపాలించిన వారు పట్టణాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు అన్ని రంగాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలన్న ఆలోచనలను గత ప్రభుత్వం చేయలేదన్నారు. అలాంటి వారికి ఓట్లు వేస్తే సన్న బియ్యం పోయి తిరిగి మొద్దు బియ్యం వస్తాయని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదని, ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా అందుతాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలకులు పట్టణ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, శాంతిభద్రతలు లేకుండా పోయాయని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, శాంతియుత వాతావరణంలో పట్టణాలు అభివృద్ధి చెందాలని అధికారులను ఆదేశించామని, అంతటా ప్రశాంత వాతావరణం నెలకొందని తెలిపారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, మెరుగైన వసతులు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ ముందుకు పోతోందన్నారు. అర్హత కలిగిన పేద, బలహీనవర్గాల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామని, మేలు రకం బియ్యం పంపిణీ చేస్తున్నామని, డబ్బులు ఆదా అయితే కుటుంబ సభ్యుల అవసరాలు తీరుతాయన్న ఆలోచనతో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు.
రూ.27 వేల కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు
వడ్డీ లేని రుణాల కింద రాష్ట్రంలోని మహిళలకు రూ.27 వేల కోట్ల విలువైన చెక్కులను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. ఎన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్నా, ఎన్ని వేల కోట్లయినా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారితో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పెట్రోల్ బంకుల నిర్వహణ, కుటీర పరిశ్రమలు పెట్టించడం, బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ రుణాలు ఇప్పించడం వంటి పనులు చేపట్టామన్నారు. ఉత్పత్తి రంగానికి కావలసిన నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరాకు అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకున్నందున రాష్ట్రంలో కుటుంబ జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే స్కిల్స్ ఉన్న కోర్సులు నేర్పించాలని, అందుకే రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాబోయే యాభయ్యేళ్లకు సరిపడ మధిర పట్టంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు. వరద నీరు పట్టణంలోకి రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని, వైరా నదిని టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, ఫుడ్ కోర్ట్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భారీ వర్షాలు, వరదలు వచ్చినా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మురుగునీటిని శుద్ధి చేసి బయటకు వదిలేందుకు ఎస్టీపీ నిర్మిస్తున్నట్టు తెలిపారు. పట్టణంలోకి ప్రవేశించే మార్గాల్లో ఆహ్లాదకర వాతావరణ ఉండేందుకు పార్కులు నిర్మిస్తున్నామని తెలిపారు. మై మధిర క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





