– ఉచితాల వెల్లువలో కొట్టుకుపోతున్న అభివృద్ధి
– ఖజానాను ఖాళీ చేస్తున్న ఉచితాలు!
– అభివృద్ధిలో పోటీతత్వానికి ప్రోత్సాహం
(ప్రజాతంత్ర, హైదరాబాద్)
భారత ఆర్థిక వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీని నిర్ణయించే అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థ 16వ ఆర్థిక సంఘం తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను, వాటి అవసరాలను, భవిష్యత్తు సవాళ్లను బేరీజు వేస్తూ రూపొందించిన ఈ నివేదిక, ప్రస్తుత రాజకీయ ముఖచిత్రంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఓట్ల వేటలో పడి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత నగదు బదిలీ పథకాలు రాష్ట్రాల ఖజానాలను ఎలా ఖాళీ చేస్తున్నాయో ఈ నివేదిక సవివరంగా ఎండగట్టింది. ఇది కేవలం అంకెల పట్టిక మాత్రమే కాదు, దారి తప్పుతున్న రాష్ట్రాల ఆర్థిక విధానాలకు ఒక హెచ్చరికగా నిలుస్తోంది. కేంద్ర పన్నుల ఆదాయం నుండి రాష్ట్రాలకు లభించే వాటాను 41 శాతంగానే కొనసాగించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అయితే, రాష్ట్రాల మధ్య ఈ నిధులను పంచే సూత్రాల్లో కొన్ని చారిత్రాత్మక మార్పులు చేసింది. గతంలో కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల జనాభా నియంత్రణలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనే వాదన బలంగా ఉంది. దీనిని గమనించిన కమిషన్, 1971 నుండి 2011 మధ్య కాలంలో జనాభా పెరుగుదల రేటును పరిగణనలోకి తీసుకుంటూ ఒక కొత్త కొలమానాన్ని రూపొందించింది. దీనివల్ల జనాభా నియంత్రణను సామాజిక బాధ్యతగా భావించి అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు లబ్ధి చేకూరనుంది. అలాగే, మొదటిసారిగా రాష్ట్రాల పనితీరు మరియు సామర్థ్యానికి పది శాతం ప్రాధాన్యతను ఇవ్వడం విశేషం. ఏ రాష్ట్రం అయితే దేశ సంపద సృష్టిలో చురుకైన పాత్ర పోషిస్తుందో, ఆ రాష్ట్రానికి అదనపు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పోటీతత్వ అభివృద్ధిని కమిషన్ ప్రోత్సహించింది.
తీవ్రంగా చర్చించాల్సిన ‘షరతులు లేని నగదు పంపిణీ’
ఈ నివేదికలో అత్యంత తీవ్రంగా చర్చించాల్సిన, ఆందోళన చెందాల్సిన అంశం ‘షరతులు లేని నగదు పంపిణీ’. రాజకీయాధికారం కోసం పాలక పక్షాలు ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. 2019లో డెబ్బై మూడు వేల కోట్లుగా ఉన్న ఇటువంటి పథకాల వ్యయం, 2026 నాటికి నాలుగు లక్షల కోట్లకు పైగా చేరుతుందని కమిషన్ అంచనా వేసింది. ఇది ఏటా 29 శాతం చొప్పున పెరుగుతోంది. అంటే రాష్ట్రాల ఆదాయం కంటే ఈ పథకాల ఖర్చే వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తమ మొత్తం రెవెన్యూ ఆదాయంలో పది శాతానికి పైగా కేవలం ఇలాంటి పథకాలకే వెచ్చిస్తున్నాయని కమిషన్ నివేదికలో కుండబద్దలు కొట్టింది. ఈ ఖర్చుల కోసం రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, ఆస్తుల కల్పనకు కేటాయించాల్సిన నిధులలో కోతలు విధించడం భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించింది. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కంటే నగదు పంపిణీకే ప్రాధాన్యత ఇస్తే, అది రాష్ట్రాల దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. అడవుల సంరక్షణకు కూడా కమిషన్ పెద్దపీట వేసింది. గతంలో కేవలం దట్టమైన అడవులనే లెక్కలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు తక్కువ సాంద్రత ఉన్న అడవులను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల పర్యావరణ పరిరక్షణకు పూనుకుంటున్న రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. పచ్చదనాన్ని కాపాడుతున్న రాష్ట్రాలకు పది శాతం వెయిటేజీ ఇవ్వడంతో పాటు, అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక నిధులను సూచించింది. ఇక స్థానిక సంస్థల విషయానికి వస్తే, పంచాయతీలు, పురపాలక సంఘాల అభివృద్ధి కోసం 7 లక్షల 91వేల కోట్ల భారీ నిధులను కేటాయించింది. ఈ నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని, 20శాతం నిధులు కేవలం ఆయా సంస్థల పనితీరు బాగుంటేనే అందుతాయని నిబంధన విధించింది. తాగునీరు, పారిశుధ్యం వంటి కనీస అవసరాలకే ఈ నిధులను అధికంగా ఖర్చు చేయాలని కమిషన్ మార్గదర్శకాలను ఇచ్చింది. అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం ‘ఉచిత పథకాల’తో ముందుకు వెళ్తే, భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సంక్షేభం తప్పదని స్పష్టం చేసింది. రాజకీయ లబ్ధి కంటే ఆర్థిక స్థిరత్వమే ముఖ్యం అనే సందేశాన్ని ఈ నివేదిక బలంగా వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరిచి, సంక్షేమం మరియు అభివృద్ధి మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో అప్పుల ఊబిలో కూరుకుపోయి, రాబోయే తరాలకు అభివృద్ధి లేని భారమైన భవిష్యత్తును అందించాల్సి వస్తుందని ఆర్థిక సంఘం హెచ్చరించింది. బాధ్యతాయుతమైన పాలన, పారదర్శకమైన ఆర్థిక నిర్వహణే రాష్ట్రాల ప్రగతికి అసలైన సోపానాలని ఈ నివేదిక సారాంశం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





