నిబంధనల ఉల్లంఘన

– కాలపరిమితి ముగిసినా కొత్త సంస్థకు డేటా బదిలీ చేయక అడ్డంకులు
– ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ పై సీసీఎస్‌లో కేసు, దర్యాప్తు వేగవంతం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నమ్మక ద్రోహం, డిజిటల్ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్టు అప్పగింతకు అడ్డంకులు సృష్టించినందుకు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్(ఇండియా) పైవేట్ లిమిటెడ్‌తోపాటు దాని ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరిపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) విభాగం ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్(ఇండియా) పైవేట్ లిమిటెడ్‌పై సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్‌కు చెందిన ఏసీపీ ఎ.రామ్‌రెడ్డి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, చట్టబద్ధ ప్రాజెక్టు హ్యాండోవర్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వంటి తీవ్ర ఆరోపణలపై నమోదు చేశారు. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) పైవేట్ లిమిటెడ్ సంస్థను 2017 జనవరిలో జారీ చేసిన వర్క్ ఆర్డర్ ద్వారా రాష్ట్రానికి చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, నిర్వహణ కోసం నియమించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు రూ.70 లక్షలు అభివృద్ధి, అమలు ఖర్చులుగా చెల్లించడంతోపాటు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతినెలా నిర్వహణ చార్జీలు కూడా చెల్లించింది. ఒప్పంద నిబంధనల ప్రకారం కాలపరిమితి ముగిసిన తరువాత ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం డేటా, సోర్స్ కోడ్‌తోపాటు డిజిటల్ ఆస్తులపై పూర్తి హక్కులు ప్రభుత్వానికి చెందాలి. అయితే మూడుసార్లు (2018 నుంచి 25 వరకు) అవే నిబంధనలతో పొడగింపు పొందిన ఈ సంస్థ కాలపరిమితి మే 31, 2025తో ముగిసింది. కొత్త సంస్థ ఎంపిక కోసం పారదర్శక టెండర్ ప్రక్రియను ప్రభుత్వం పిలిచింది. దీనిలో పర్వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్సీసెస్ కంపెనీ ఎల్ -1గా ఎంపికైంది. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ కూడా ఈ టెండర్‌లో పాల్గొని నిబంధనలను అంగీకరించింది. అయితే టెండర్‌లో విఫలమైన తర్వాత సంస్థ తన వైఖరిని మార్చుకుని సహకరించకుండా వ్యవహరిస్తోంది. తప్పుడు యాజమాన్య పత్రాలతో ప్రభుత్వానికి చెందిన డేటాను తమదిగా చెప్పే ప్రయత్నం చేసింది. కొత్త సంస్థకు హ్యాండోవర్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ పదేపదే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించింది. అలాగే నిధుల దుర్వినియోగంతోపాటు, యూజర్ డేటాను తమ ప్రైవేట్ అప్లికేషన్‌కు మళ్లించే ప్రయత్నం చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం కొత్త సంస్థకు డేటా అందిస్తామని ముందుగా ఒప్పుకున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదు. వీటిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ ప్రజా ఆస్తులను రక్షించేందుకు, చట్టపరమైన చర్యలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి సీసీఎస్‌లో కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా ట్రాన్సాక్షన్స్ సంస్థకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులందరికీ చట్టపరమైన నోటీసులు జారీ చేశారు. సంస్థలో చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసులును మే 25న పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర నిందితులైన సంస్థ ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరి, ప్రాజెక్ట్టు మేనేజర్ కిరణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని సమాచారం. వారిని కూడా పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని ఐటీ శాఖ ప్రభుత్వానికి నివేదించగా ఒప్పంద నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడం, భవిష్యత్ టెండర్ల నుంచి బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం, నష్టపరిహారం వసూలు చేయడం వంటి చర్యలు ట్సాన్సాక్షన్స్ సంస్థపై పరిశీలనలో ఉన్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *