– చట్టపరమైన రక్షణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూదిల్లీ, ఆగస్టు 11: భారత జాతీయ గీతం ‘జన గణ మన’ తరహాలోనే ‘వందేమాతరం’కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్టస్ టు నేషనల్ హానర్ బిల్లు’కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. 1971 నాటి బిల్లులోని సెక్షన్ 3ను సవరించడం ద్వారా ‘వందేమాతరం’ను కూడా చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. జాతీయ గీతాన్ని అడ్డుకోవడం లేదా దాని గౌరవాన్ని భంగపరిచేలా వ్యవహరించడంపై చట్టపరమైన చర్యలకు అవకాశం ఉంటుంది. అయితే అదే స్థాయిలో వందేమాతరానికి ఇప్పటివరకు ప్రత్యేక రక్షణ లేదు. తాజా సవరణ వందేమాతరానికి కూడా చట్ట పరమైన రక్షణ కల్పించింది.కొత్త చట్టం ప్రకారం ‘వందేమాతరం’గానం జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా ఆ గానం చేస్తున్న సమూహానికి అంతరాయం కలిగించడం శిక్షార్హమైన నేరం. దీనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించే సవరణ బిల్లును పార్లమెంట్ గత నెలలో ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. రాష్ట్రపతి ముర్ము సంతకం చేయడంతో బిల్లు ఇప్పుడు అధికారిక చట్టంగా అమల్లోకి వచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


