‘వైద్యో నారాయణః’ నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం

శత్రువుల నుండి దేశాన్ని కాపాడే సైనికుల్లాగే రోగాల బారి నుండి మన శరీరాన్ని రక్షించేవారు వైద్యులు. ‘వైద్యో నారాయణః’ అన్న మాట వారి గొప్పదనాన్ని చాటి చెబుతుంది. మందులు రోగాలను నయం చేస్తే వైద్యులు మాత్రమే రోగులను స్వయంగా నయం చేస్తారు. తమ వ్యక్తిగత జీవితాలను సైతం పక్కనబెట్టి ఎన్నో బాధలున్నా నవ్వుతూ రోగుల కష్టాలను విని వారికి ఉపశమనం కలిగించే వైద్యులు నిజంగా దైవ సమానులు. వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనం చేయడం మన కనీస ధర్మం. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రోగి బంధువులు కూడా దగ్గరకు రాని పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాది మంది జీవితాలను కాపాడిన వైద్యుల త్యాగం అద్వితీయం. దురదృష్టవశాత్తు, ఈ మహత్తర సేవలో చాలా మంది వైద్యులు తమ ప్రాణాలను కోల్పోయారు.
జాతీయ వైద్యుల దినోత్సవం-డా. బి.సి. రాయ్ వారసత్వం:
వైద్యుల నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవించుకోవడానికి ప్రతి సంవత్సరం జూలై 1న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. ఇది ప్రఖ్యాత వైద్యులు, విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి. 1882 జూలై 1న బీహార్‌లోని పాట్నాలో జన్మించిన డా. బి.సి. రాయ్, కలకత్తాలో తన వైద్య విద్యను పూర్తి చేసి, లండన్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. 1911లో భారతదేశంలో వైద్య వృత్తిని ప్రారంభించి, తర్వాత కలకత్తా మెడికల్ కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. మహాత్మా గాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన ఆయన, సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీతో కలిసి పనిచేశారు. చిత్తరంజన్ క్యాన్సర్ ఆసుపత్రి, కమలా నెహ్రూ మెమోరియల్ ఆసుపత్రి, జాదవ్‌పూర్‌లో టి.బి. ఆసుపత్రి, అలాగే 1926లో మహిళలు, పిల్లల కోసం చిత్తరంజన్ సేవాసదన్ నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. దేశానికి 80 ఏళ్లు చేసిన గొప్ప సేవలను నమోదు చేసుకున్న ఆయన 1962 జూలై 1న కన్నుమూశారు. ఆయన స్మారకార్థం 1962లో డాక్టర్ బి.సి. రాయ్ నేషనల్ అవార్డును, 1976లో డాక్టర్ బి.సి. రాయ్ జాతీయ అవార్డును ఏర్పాటు చేశారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన “భారతరత్న”తో దేశం ఆయన్ని సత్కరించింది.
డా. బి.సి. రాయ్ వంటి అంకితభావం కలిగిన వైద్యులు ఎంతో మంది ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్నప్పటికీ కొద్దిమంది వైద్యుల అనైతిక కార్యకలాపాలు మొత్తం వైద్య వృత్తికే కళంకాన్ని తెస్తున్నాయి. వైద్య రంగం కార్పొరేటీకరణ అయినప్పటి నుండి వైద్యం ఖరీదైనదిగా మారింది. అవసరం ఉన్నా లేకపోయినా వ్యాధి నిర్ధారణా పరీక్షల పేరుతో, ల్యాబ్‌ల నుండి మెడికల్ స్టోర్‌ల వరకు కమీషన్లకు కక్కుర్తిపడి రోగుల నుండి డబ్బును దోచుకోవడం బహిరంగ రహస్యంగా మారింది. గర్భిణులకు సాధారణ ప్రసవానికి అవకాశం ఇవ్వకుండా సిజేరియన్‌లకే ప్రాధాన్యత ఇవ్వడం ఆందోళనకరం. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో జీతం తీసుకుంటూ అక్కడ నాణ్యమైన సేవలు అందించకుండా వ్యక్తిగత ఆసుపత్రులను నిర్వహించడం, కమీషన్ల కోసం ఆరాటపడటం వంటి విమర్శలు వైద్య రంగానికి చెడ్డపేరు తెస్తున్నాయి.
భారతదేశ ఆరోగ్య సవాళ్లు- ఒక పరిష్కారం దిశగా:
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అనారోగ్యాలతో బాధపడుతున్న వారిలో అధిక శాతం మన దేశంలోనే ఉన్నారు. ఊబకాయం, క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, వివిధ అవయవ సంబంధిత వ్యాధులు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. క్రమరహిత ఆహారపు అలవాట్లు, మాంసాహారం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చొని చేసే ఉద్యోగాలు వంటివి దీనికి ప్రధాన కారణాలు. యువతలో పొగాకు, మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసి, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది. నిర్మాణ కార్యకలాపాలు, కర్మాగారాలు, వాహనాల సంఖ్య పెరుగుదల వలన గాలి కాలుష్యం పెరిగి, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. నీటి కాలుష్యం, శుద్ధి చేయని నీరు త్రాగడం వలన పొట్టకు సంబంధించిన వ్యాధులు కూడా వృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వాలు తమ పరిధిలో ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి కృషి చేస్తున్నప్పటికీ, మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక సేవలను అందించడానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) టెలిమెడిసిన్ ప్రాజెక్టును ప్రారంభించింది.
ప్రస్తుతం, భారతదేశంలో మొత్తం 74,306 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు, 1,18,190 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం, 13,86,150 మంది అల్లోపతిక్ డాక్టర్లు నమోదు కాగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ 7,51,768 మంది ఆయుష్ ప్రాక్టీషనర్లు ఉన్నట్లు తెలిపింది. వీరిలో 80% మంది అందుబాటులో ఉన్నారని అంచనా వేస్తే, దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి 1:811 గా ఉంది. ఈ నిష్పత్తిని మెరుగుపరచడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు (157 ఆమోదిత కళాశాలల్లో 131 కార్యాచరణలో), ప్రస్తుత కళాశాలల్లో ఎంబిబిఎస్, పీజీ సీట్ల పెంపు, ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్షా యోజన  కింద సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ల నిర్మాణం (75 ప్రాజెక్టులకు 71 పూర్తి), కొత్త ఎయిమ్స్‌ల ఏర్పాటు (22 ఎయిమ్స్‌లకు ఆమోదం రాగా, 19లో కోర్సులు ప్రారంభం) వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల లభ్యతను పెంచడానికి ప్రభుత్వం దృష్టి సారించింది.
ఎంబిబిఎస్ సిలబస్‌లో కుటుంబ దత్తత కార్యక్రమం  చేర్చబడింది, దీని ద్వారా విద్యార్థులు గ్రామాలను దత్తత తీసుకుని సేవలందిస్తారు. ఎన్ఎంసి యొక్క జిల్లా రెసిడెన్సీ కార్యక్రమం కింద పీజీ విద్యార్థులను జిల్లా ఆసుపత్రులలో నియమిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే నిపుణులైన డాక్టర్లకు హార్డ్ ఏరియా అలవెన్స్, నివాస వసతులు కల్పిస్తున్నారు. సిజేరియన్ సెక్షన్ల కోసం నిపుణులైన డాక్టర్లకు (గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, అనస్థీషియన్లు) గౌరవ వేతనం ఇస్తున్నారు. డాక్టర్లు, ఏఎన్‌ఎంలకు సకాలంలో ఏఎన్‌సి  చెకప్‌లు, టీనేజర్ల లైంగిక ఆరోగ్య కార్యక్రమాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉన్నాయి. నిపుణులను ఆకర్షించడానికి రాష్ట్రాలకు కట్టుబాటు లేని జీతం  అందించే వెసులుబాటు కల్పించారు. ఎన్హెచ్ఎం కింద, కఠిన ప్రాంతాల్లో పనిచేసే వారికి పీజీ కోర్సులలో ప్రాధాన్యత ప్రవేశం, గ్రామీణ వసతి మెరుగుదల వంటి ఆర్థికేతర ప్రోత్సాహకాలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. నిపుణుల కొరతను అధిగమించడానికి డాక్టర్ల బహుళ-నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు.
ఆరోగ్యకరమైన భారతదేశానికి పరిష్కారాలు:
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి, వ్యక్తిగత స్థాయిలో వేళకు భోజనం చేయడం, మాంసాహారాన్ని తగ్గించడం, మద్యం మానడం, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, శ్వాస వ్యాయామాలు పాటించాలి. అభివృద్ధి చెందిన దేశాల వలె, మన దేశంలో కూడా ఆరోగ్య బీమాలను తీసుకోవడం అత్యవసర సమయాల్లో ప్రజలకు అమూల్యమైన మద్దతును అందిస్తుంది. ఇది వ్యక్తిగత ఆరోగ్య భద్రతకు, దేశ ఆరోగ్య వ్యవస్థకు బలమైన పునాది అవుతుంది.
జనక మోహన రావు దుంగ
8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page