బీజేపీ రాష్ట్ర సారథిగా రామచందర్‌రావు ఏకగ్రీవం

~ ఏడాదిన్నర ఉత్కంఠకు తెర
~ అంతకుముందు పలువురి నిరసనలు
~ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్‌ రాజీనామా

(మండువ రవీందర్‌రావు)

ఏడాదిన్నర కాలంగా బిజెపి అధ్యక్షుడి ఎన్నిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడిరది. పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్‌రావు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆయన ఎన్నికకు ముందు పార్టీలో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయనను అధ్యక్ష పదవికి ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ గోషామహల్‌ ఎంఎల్‌ఏ రాజాసింగ్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ రెండు పేజీల లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అందజేయడంతో పార్టీలో కలకలం రేగింది. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కు తెలపాల్సిందిగా కూడా ఆయన ఆ లేఖలో సూచించారు. అంతటితో ఆగకుండా పార్టీ అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు సిద్దపడడంతో కొద్దిసేపు వాతావరణం వేడెక్కింది. రాజాసింగ్‌ పార్టీ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను తీసుకున్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు జిల్లా అధ్యక్షుడితోపాటు పదిమంది సంతకాలు కావాల్సి ఉండగా ముగ్గురి సంతకాలు మాత్రం ఆయనకు లభించాయి. తనవెంట వచ్చిన మిగతా ఏడుగురిని పార్టీ నేతలు బెదిరించడంతో వారు సంతకాలు చేయలేకపోయారంటూ ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మరికొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ఎవరన్నది అధిష్టానం ముందే నిర్ణయించి కేవలం ఫార్మాలిటీగా ఎన్నికల తంతు జరుపుతున్నదని ఆరోపించారు. వాస్తవానికి చాలాకాలంగా రాజాసింగ్‌ పార్టీ అధినేతలపై గుర్రుగా ఉన్నారు. పార్టీ నాయకత్వంపైన గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు అప్పుడే సస్పెండ్‌ చేస్తారనుకున్నారు కానీ ఆయనకున్న ప్రజల మద్దతు, కరుడుగట్టిన హిందుత్వవాది కావడంతో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సంక్లిష్ట పరిస్థితిల్లో కూడా ఆయన గోషామహల్‌నుండి ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికైన వ్యక్తి. 2014లో పార్టీ నుండి గలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది. వాస్తవానికి రాజాసింగ్‌తోపాటు నిజామాబాద్‌ పార్లమెంటు ఎంపీ ధర్మపురి అరవింద్‌కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీరిద్దరూ అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ పదవి కోసం పోటీపడుతున్న పలువురిని కాదని అధిష్ఠానం కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపర్చింది.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలను సోమవారం నిర్వహించాలని ఆదేశించిన అధిష్టానం ఒక్కరు మాత్రమే నామినేషన్‌ వేయాలనికూడా సూచించింది. ఆమేరకు ఆంధ్రలో పార్టీ సీనియర్‌ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్‌ మాధవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రకటించింది. తెలంగాణ విషయానికొచ్చేటప్పటికీ చివరిదాకా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వాస్తవంగా తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవిని ఆశించినవారి జాబితా పెద్దదిగానే ఉంది. అనేక ఊహాగానాలు, సామాజిక వర్గాలను బేరీజు వేసుకోవడంద్వారా ఫలానావారికే ఈసారి అధ్యక్షపదవి దక్కుతుందన్న చర్చలు జరిగాయి. ప్రధానంగా వినిపించిన పేర్లలో ఆపార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్‌, డికె అరుణ, ఈటెల రాజేందర్‌లతోపాటు బండి రమేష్‌. డాక్టర్‌ లక్ష్మణ్‌ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కాగా రఘనందన్‌రావు, రాజాసింగ్‌లుకూడా పోటీపడినవారిలో ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఇటీవల కాలంలో వెనుకబడిన(బిసీ) తరగతులవారి సంఖ్యాబలాన్నిబట్టి వివిధ పదవుల్లో దాదాపు అన్ని రాజకీయపార్టీలు వారికి ప్రాధాన్యతను కలిపిస్తున్న విషయం తెలిసిందే. దానికి తగినట్లు బిజెపికూడా బీసీ నినాదం ఎత్తుకున్నదృష్ట్యా, అధ్యక్షుడిగా బిసీ వ్యక్తికే అవకాశం లభిస్తుందనుకున్నారు. ఆవిధంగా ధర్మపురి అరవింద్‌తో పాటు ఈటెల రాజేందర్‌. డాక్టర్‌ లక్ష్మణ్‌, బండి సంజయ్‌కుమార్‌ పేర్లు ముందుకు వచ్చాయి. బండి సంజయ్‌ మొదట్లోనే తాను ఆపదవిని ఆశించడంలేదని స్పష్టంచేసిన విషయం తెలిసిందే. కాగా అధిష్టానం పలుసార్లు రాష్ట్రనాయకులతో కలిసి జల్లడపట్టి ఈటెల రాజేందర్‌ పేరును ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆదివారం రాత్రి ఆయనకు అధిష్టానంనుండి ఆ మేరకు సమాచారం అందినట్లు తెలుస్తున్నది. దీంతో రాజేందర్‌ ఖాయమనుకుంటున్నదశలో అనూహ్యంగా అధిష్టానం రామ్‌చందర్‌రావు పేరును తెరపైకి తీసుకువచ్చింది. ఒకపక్క రాష్ట్రంలో బిసీ నినాదం ప్రభలంగా ఉన్నతరుణంలో బ్రాహ్మణుడైన రామ్‌చందర్‌రావును అధిష్టానం అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని పార్టీలోని పలువురు బిసీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి వీరవిధేయుడిగా, సౌమ్యుడిగా పేరున్న రామ్‌చందర్‌రావును సోమవారం నామినేషన్‌ వేయాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. దానిపై ఆయన సోమవారం నామినేషన్‌ దాఖలు చేసేవరకు కూడా ఉత్కంఠ నెలకొంది. ఆయన నామినేషన్‌ వేస్తే తాము పోటీచేస్తామంటూ నిజామాబాద్‌ ఎంపి ధర్మపురి అరవింద్‌, గోషామహల్‌ ఎంఎల్‌ఏ రాజాసింగ్‌లు ప్రకటించడం పార్టీలో గందరగోళానికి దారితీసింది. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే బిసీకే అధ్యక్షపదవివ్వటం సమంజసమని ఆరవింద్‌ అంటే, బూత్‌స్థాయి కార్యకర్తలనుంచి ఎంపిక ప్రక్రియ జరుపాలన్న తనవ్యక్తిగత అభిప్రాయాన్ని రాజాసింగ్‌ వెల్లడిరచారు. దానివల్ల పార్టీ అధ్యక్షుడు ఎదో ఒకగ్రూప్‌కు లేదా ఒకవ్యక్తికి సంబందించినవాడుగా ముద్రపడే అవకాశం ఉండదంటున్న ఆయన బిసీ వ్యక్తిగా తనను అధ్యక్షపదవికి ఎంపిక చేయకపోవడంపట్ల తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. బిజెపిలో ఉండటంవల్ల తాను ఉగ్రవాదులకు టార్గెట్‌ అయ్యానని, ఇక మీ బిజెపికో దండం అంటూ, తనకిక పార్టీతో సంబంధంలేదని పేర్కొన్నారు. ఇదిలాఉంటే రామ్‌చందర్‌రావు ఎంపిక వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశిస్సులు ఉన్నట్లు తెలుస్తున్నది. వాస్తవంగా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం నుంచి వచ్చినవ్యక్తిగా రామ్‌చందర్‌రావుకు పేరుంది. 2015లో పట్టభద్రుల ఎంఎల్‌సిగా ఎన్నికైన రామ్‌చందర్‌రావు గతంలో పార్టీలో అనేక పదవులు చేపట్టిన వ్యక్తి. 1980-82 మద్య భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర కార్యదర్శిగా, 1999-2003 వరకు బిజెపి లీగల్‌సెల్‌ జాయింట్‌ కన్వీనర్‌గా, 2003-2006 వరకు లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా, 2007-2009 వరకు బిజెపి అధికార ప్రతినిధిగా పనిచేసిన రావు హైదారాబాద్‌ బిజెపి అధ్యక్షుడిగాకూడా కొద్దికాలం పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page