నీట్‌పై పార్లమెంట్‌లో ఆగని ఆందోళన

– వరుసగా ఐదో రోజూ కొనసాగని సభ
– లోక్‌సభ సోమవారానికి వాయిదా
-రాజ్యసభలో వందేమాతరం బిల్లు పెట్టిన నిత్యానందరాయ్‌

‌న్యూదిల్లీ,జూలై24:లోక్‌సభ, రాజ్యసభల్లో పేపర్‌ ‌లీక్‌లపై చర్చ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12:00 గంటల వరకు వాయిదా పడింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగింది. నీట్‌ ‌యూజీ సహా దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పరీక్షల పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారం పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయడం సహా ప్రధాని నరేంద్ర మోదీ సభాముఖంగా క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్‌ ‌చేసింది. మరోవైపు.. పరీక్షల పేపర్‌ ‌లీకేజీలను అరికట్టేందుకు కఠిన శిక్షలు విధించేలా కొత్త బిల్లును తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తుది రూపుదిద్దిన తర్వాత ఆ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామన్నారు. ఈ విషయమై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ ‌రిజిజు మాట్లాడుతూ.. నీట్‌ అం‌శంపై సభలో చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. మరోవైపు.. విద్యార్థులపై జులై 20న జరిగిన పోలీస్‌ ‌చర్యలో పెల్లెట్‌ ‌గన్స్ ‌వినియోగించారని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ అంశాన్నీ పార్లమెంట్‌లో లేవనెత్తనున్నట్లు పార్టీ రాజ్యసభ ఉపనేత సాగరికా ఘోష్‌ ‌వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ ‌షా బాధ్యత వహించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో స్పీకర్‌.. ‌లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇదిలావుంటే వందేమాతరం గేయానికి చట్టబద్ధ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో ’వందేమాతరం బిల్లు’ను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించే వారికి జైలుశిక్ష సహా ఇతర శిక్షలు విధించేలా, అలాగే గేయాన్ని పూర్తిగా ఆలపించాల్సిందేననే నిబంధనలనూ ఇందులో పొందుపరిచారు. అయితే.. ఈ బిల్లుపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ సభలోనే ఆందోళనకు దిగారు. బిల్లు వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రాజ్యసభ కార్యకలాపాలను సభాపతి సోమవారానికి వాయిదా వేశారు.

మకరధ్వజ్‌ ‌గేట్‌ ‌వద్ద విపక్ష ఎంపిల ఆందోళన

-ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాకు విపక్షాల డిమాండ్‌

నీట్‌ పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారం పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయడం సహా ప్రధాని నరేంద్ర మోదీ సభాముఖంగా క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్‌ ‌చేసింది. ఈ అంశంపై చర్చకు ముందుగా మంత్రి ప్రధాన్‌ ‌తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ పట్టుబట్టారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్‌ ‌ప్రాంగణంలోని మకర్‌ ‌ద్వార్‌ ‌వద్ద కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. ’ప్రధాన్‌ను తొలగించాలి’ అనే బ్యానర్లతో నినాదాలు చేశారు.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌  ‌ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. వరుసగా ఐదో రోజు శుక్రవారం  పార్లమెంట్‌లోని ’మకర్‌ ‌ద్వార్‌’ ‌వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన కొనసాగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తక్షణమే రాజీనామా చేయాలని, లేదా ఆయనను పదవి నుంచి బర్తరఫ్‌ ‌చేయాలని విపక్ష ఎంపీలు ప్లకార్డులు చేతబూని నినాదాలతో హోరెత్తించారు. గురువారం మకర్‌ ‌ద్వార్‌ ‌వద్ద అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు పరస్పర నిరసనలతో ఎదురెదురుగా నిలబడి ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. చర్చను ప్రతిపక్షాలే అడ్డుకుంటున్నాయని ఎన్డీఏ ఆరోపిస్తుండగా, విద్యాశాఖ మంత్రి రాజీనామాకే విపక్షాలు పట్టుబడుతున్నాయి. నీట్‌ ‌వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ అర్థరాత్రి వీడియో సందేశం విడుదల చేయడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. ’పార్లమెంట్‌ ‌సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధాని తన వ్యాఖ్యలను సభలోనే వినిపించాలి తప్ప, బయట రాత్రివేళల్లో రికార్డ్ ‌చేసిన వీడియోలతో ఒంటెద్దు పోకడ ’మన్‌ ‌కీ బాత్‌’ ‌చెప్పడం సరికాదు. ప్రధాని మోదీ.. ఈరోజు పార్లమెంట్‌కు వచ్చేముందు ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించి రండి. ఆందోళనకారులపై లాఠీఛార్జ్, ‌ప్లలెట్‌ ‌గన్ల ప్రయోగానికి ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోండి. ఆ తర్వాతే విద్యావ్యవస్థపై సమగ్ర చర్చకు మేం సిద్ధం’ అని ఖర్గే అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *