– వాటిని విచారించకుండా తిరస్కరించారని ఎలా రాస్తారు
– మీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్
న్యూదిల్లీ,జూలై24:‘చలో పార్లమెంట్’ నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై అత్యవసర పిటిషన్ దాఖలు కాగా.. విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించిందన్న వార్తలను సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు కథనాలని పేర్కొన్నారు. కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) ఆందోళనలపై అసలు పిటిషనే దాఖలు కాలేదని అన్నారు. గత రెండు రోజులుగా మీడియా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అత్యవసర పిటిషన్‌ను సీజేఐ విచారణకు స్వీకరించలేదని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందన్నారు. శుక్రవారం కోర్టు విచారణ ప్రారంభమైన తర్వాత న్యాయవాదులు తమ కేసులను అత్యవసరంగా స్వీకరించాలని విజ్ఞప్తి చేసిన సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు సీజేపీ ఆందోళనలకు సంబంధించి ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని ఎవరో ఒక లాయర్ మాత్రం విజ్ఞప్తి చేశారు. ఓ అభ్యర్థనను పిటిషన్‌గా ఎలా స్వీకరిస్తాం అని సీజేఐ అన్నారు. జులై 20న సీజేపీ చేపట్టిన చలో పార్లమెంట్ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయవాది నరేంద్ర మిశ్రా బుధవారం సుప్రీం కోర్టును అభ్యర్థించారు. పోలీసు దాడులకు సంబంధించి తన వద్ద వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని, వారి కోసమైనా అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అయితే, సుప్రీం కోర్టు అందుకు తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని, అలాగే పిటిషనర్ కూడా సమయం వృథా చేసుకోవద్దని సీజేఐ హితవు పలికినట్లు రాసుకొచ్చాయి. నిరసనకారులపై పోలీసు చర్యకు సంబంధించిన వీడియోల గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించగా..‘ మాకు వీడియోలు చూసే సమయం లేదు‘ అని సీజేఐ అన్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. మరోవైపు, కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. ఒక వేళ పోస్టు చేయాలనుకుంటే సుప్రీం కోర్టు లేదా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్స్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు కార్యకలాపాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వల్ల దుర్వినియోగమవు తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అంగీకరించారు. నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





