బిఆర్‌ఎస్ క్యాడర్‌ను బలహీనపర్చేందుకా ? క చర్చకు దారితీస్తున్న బండి సంజయ్ వ్యాఖ్యలు
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి): నిత్యం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే రాజకీయ పార్టీలు అకస్మాత్తుగా ఎదుటి పార్టీ నాయకుడిపై ప్రశంసలు కురిపించడమేంటి? దాని వెనుక రాజకీయ ఎత్తుగడ ఏద్కెనా ఉందా? లేక ప్రత్యర్థి పార్టీలో వైషమ్యాలను కలిగించేందుకా అన్నదిప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది మొదలు ఈ పదకొండు ఏండ్ల కాలంగా భారతీయ జనతాపార్టీ (బిజెపి) భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)పై నిత్యం దిమ్మెత్తిపోస్తూనే ఉంది. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన పదేళ్ల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై కేవలం బిజెపి రాష్ట్ర నాయకత్వమే కాదు.. సాక్షాత్తు ప్రధాని లాంటివారు కూడా నేటికీ తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న విషయం తెలియంది కాదు. కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులు బిఆర్‌ఎస్‌కు ఏటిఎంగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించినప్పుడల్లా ఆరోపిస్తూనే వొచ్చారు. అసలు తెలంగాణ విభజనే సరైంది కాదంటూ పలుసార్లు పలు వేదికలపై ఆయన పేర్కొనడాన్నిబట్టి, తెలంగాణపై ఆయన అయిష్టత స్పష్టమైంది. అది మొదలు తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాడన్న అపవాదను ఆయన మూటకట్టుకున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న బిఆర్‌ఎస్, బిజెపితో నేటికీ ఉప్పులో నిప్పుగానే మసలుతున్నది.
ఈ క్రమంలో బిఆర్‌ఎస్ పార్టీలోని ఓ ముఖ్యనేతపై బిజెపి ప్రశంసలు కురిపించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. బిజెపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, సిద్దిపేట బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావును మెచ్చుకోవడం బిఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో అయోమయానికి దారితీసింది. బిఆర్‌ఎస్‌లో క్రెడిబులిటీ ఉన్న నాయకుడు హరీష్‌రావు మాత్రమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. అదే సమయంలో బిఆర్‌ఎస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కె.టి. రామారావును ఆయన తీవ్రంగా విమర్శించడం చూస్తే ఆ పార్టీలో విబేధాలు సృష్టించి బలహీనపర్చే యత్నంలో భాగమా అన్న అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.
ఇటీవల ఆయన మీడియా చిట్‌చాట్‌లో కెటిఆర్‌ను అహంకారి అని, అక్రమ సంపాదన వల్లే ఆయనకు అహంకారం పెరిగిందని విమర్శిస్తూనే, హరీష్‌ను బిజెపిలోకి ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు అవునని స్పష్టంగా చెప్పకుండా, ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే నిర్ణయం తానొక్కడిని తీసుకునేదికాదని, పార్టీ వర్గాలందరు కలిసి తీసుకోవాల్సి ఉందంటూ నర్మగర్భంగా చెప్పడం వెనుకున్న అర్థాన్ని వెతుకుంటున్నారు. వాస్తవంగా గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటమిపాల్కెనప్పటి నుంచి హరీష్ విషయం తరచూ చర్చకు వొస్తూనే ఉంది. ఆయన పార్టీ వీడుతారని, బిజెపిలో చేరుతాడంటూ అనేక వదంతులు వొచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ప్రధాన భూమిక (ఖీ2వ పేజీలో…)
పోషిస్తూ వొచ్చిన హరీష్‌రావుకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కేవలం పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల నాయకులతో కూడా ఆయన స్నేహపూర్వకంగా ఉంటాడన్న పేరుంది. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌లో ఎప్పుడు ఎలాంటి సంక్షోభం వొచ్చినా ‘ట్రబుల్ షూటర్’గా సమస్యలను చాకచక్యంగా పరిష్కరించే నేర్పరిగా ఆయన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. అన్నిటికీ మించి మాస్ లీడర్‌గా, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుండడంతో ఆయన ఇల్లు ఎప్పుడు చూసినా కార్యకర్తలు, అభిమానులతో కోలాహలంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని బిఆర్‌ఎస్ పార్టీకి దూరం చేయడానికి బండి సంజయ్ వేసిన ఎత్తుగడ అయి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెసిఆర్‌ను, కెటిఆర్‌ను ఏదో ఒక అంశంవైన విమర్శించే బండి సంజయ్ క్రెడిబులిటీ ఉన్న నాయకుడిగా హరీష్‌ను అనాలోచితంగా మెచ్చుకున్నదేమీ కాదు. వ్యూహాత్మకంగానే అని ఉంటారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదిలాఉంటే బిజెపిలాగా కాంగ్రెస్ కూడా హరీష్‌కు గాలం వేసేపనిలో ఉందా అన్న అనుమానానికి ఇటీవల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మాటలు అదే ధోరణిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కెసిఆర్ పని అయిపోయిందంటున్న రేవంత్‌రెడ్డి, కెటిఆర్‌తో కెసిఆర్‌ను ఫినిష్ చేశామని, ఇక బావతో బావమరిదిని అంటే హరీష్‌రావుతో కెటిఆర్‌ను ఫినిష్ చేయనున్నామని, అ తర్వాత హరీష్‌రావును ఎలా మలుచుకోవాలో తమకు తెలుసంటూ చేసిన వ్యాఖ్యల వెనుక అర్థాన్ని ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. మొత్తానికి ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావుకు వీరిద్దరి మాటలు పెద్ద ట్రబుల్‌ల్లోనే పడేసినట్లు కనిపిస్తున్నాయి.