గత ప్రభుత్వ అప్పులతో గంటకు మూడు కోట్ల వడ్డీ..

కాస్మోటిక్‌, ‌డైట్‌ ‌చార్జీల పంపుపై హర్షం..
గిరిజన విద్యార్థులను ఆణిముత్యాల్లా తీర్చిదిద్దాలి
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌గత ప్రభుత్వం అప్పుల కారణంగా గంటకు మూడు కోట్ల వడ్డీ చెల్లించాల్సి వొస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా.. తమ ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు సాధ్యమైనంత వరకు మేలు చేస్తోందన్నారు. హైదరాబాద్‌ ‌బంజారాహిల్స్ ‌లోని కొమరం భీమ్‌ ఆదివాసీ భవన్లో గిరిజన సంక్షేమ శాఖపై విసృత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అంతకుముందు కొమరం భీం విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాల్లో విద్యార్థుల కోసం హెల్త్ ‌మానిటరింగ్‌ ‌యాప్‌ ‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కాస్మోటిక్‌, ‌డైట్‌ ‌చార్జీలు భారీగా పెంచిన సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. చార్జీల పంపునకు కృషి చేసినందుకు గాను  మంత్రి సీతక్కను గిరిజన గురుకులాలు ఆశ్రమ పాఠశాలల టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు ఘనంగా సన్మానించాయి. ఈ సంద్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్షాన్ని నిర్దేశించుకునేందుకు, ఫలితాలను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి సమీక్ష సమావేశాలు ఉపయోగపడతాయని తెలిపారు. తాను ఏ శాఖలో ఉన్నా తన మనసు గిరిజన సంక్షేమంపై ఉంటుందన్నారు.

సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌ ‌లో ఉన్న టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేశారని దీనివల్ల 5వేల మంది ఆశ్రమ పాఠశాల టీచర్లకు ప్రయోజనం జరిగిందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఉద్యోగులు, టీచర్లు వారధులని, టీచర్లు మనసుపెట్టి పని చేయాలన్నారు. విద్యార్థులను సొంత పిల్లల్లాగా చూసుకోవాలి వారిని సొంత పిల్లల్లాగానే తీర్చిదిద్దాలని కోరారు. అందరిలో కెల్లా గిరిజనవిద్యార్థులను ముందంజలో నిలిపేలా పనిచేయాలని కోరారు. తనది కూడా హాస్టల్‌ ‌జీవితమేనని.. చిన్నప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. హాస్టల్‌ ‌పిల్లలంటే చులకన భావం ఉంటుందని, మనల్ని అవహేళన చేసేవారికి గుణపాఠం చెప్పేలా కసితో కష్టపడాలని అప్పుడే ఎదుగుతామని వివరించారు. గూడేలు, తండాల నుంచి వొచ్చిన పిల్లలు జాతీయ, అంతర్జాతీయ క్రీడ పోటీల్లో పథకాలు సాధిస్తున్నారని తెలిపారు. గిరిజన విద్యార్థులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. మంచిగా పనిచేసిన అధికారులను దేవుడిలా కొలుస్తారని తెలిపారు. ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉంటుందో అక్కడే అధికారులు పనిచేయాలని, వేయిలో ఒకరిగా కాకుండా సమాజం గుర్తు పెట్టుకునేలా పనిచేయాలని ఉద్భోదించారు. 16 ఇళ్ల తర్వాత కాస్మోటిక్‌ ‌చార్జీలను మూడు రేట్లు పెంచామని, ఏడేళ్ల తర్వాత డైట్‌ ‌చార్జీలను 40 శాతం పెంచామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థకు చేసిందేమీలేదని, హాస్టళ్ల కోసం గతంలో కొనుగోలు చేసిన వస్తువులు నాసిరకంగా ఉన్నాయని, దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. హాస్టల్‌ ‌సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, చిన్న చిన్న సమస్యలు సృష్టించి బయట శక్తులు మనకు అపఖ్యాతి తెచ్చే కుట్రలు చేస్తున్నారని, వారిని తిట్టుకొట్టే విధంగా వ్యవహరించాలని సూచించారు.
ఐటీడీఏ పనితనాన్ని మెరుగుపరచాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. 17 వేల కోట్లు కేటాయించారని,

సమగ్రంగా బడ్జెట్‌ ‌ను వినియోగించుకోవాలన్నారు. వొచ్చే నిధులను సక్రమంగా ఖర్చు చేసి విద్యార్థులను ఆణిముత్యాల్లా తీర్చదిద్దాలని కోరారు. ఐటీడీఏ పీవోలు చాలా పవర్‌ ‌ఫుల్‌ అని, విస్తృతంగా పర్యటిస్తేనే ప్రజల సమస్యలు అధికారులకు తెలుస్తాయన్నారు. కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలను తీర్చే విధంగా పనిచేయాలని సూచించారు. మానవతా హృదయంతో పనిచేయాలని, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేయడాన్ని అదృష్టంగా భావించాలని చెప్పారు.  డిమాండ్‌ ‌వున్న కోర్సుల వైపు పిల్లల్ని మళ్లించాలని, ఇతరులతో కలిసిపోయేలా గిరిజన సమాజంలో అవగాహన పెంచాలన్నారు. హెల్త్ ‌మానిటరింగ్‌ ‌యాప్‌ ‌ను తీసుకు రావడం అభినందనీయమని కొనియాడారు. కాగా ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల సంపాదించిన పలువురు విద్యార్థులకు మంత్రి  సీతక్క లాప్‌టాప్‌ ‌లను బహూకరించారు.  సమావేశంలో జిసీసీ చైర్మన్‌ ‌కొట్నక్‌ ‌తిరుపతి, గిరిజన శాఖ సెక్రెటరీ శరత్‌, ఐటిడిఏ పీవోలు, డీడీలు, గిరిజన పాఠశాలలు, గురుకులాల ప్రిన్సిపాల్స్, ‌వార్టెన్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page