- ఏడుగురు దుర్మరణం.. పలువురికి గాయాలు
- పోటెత్తిన అభిమానులు… చేతులెత్తేసిన పోలీసులు
బెంగళూరు, ప్రజాతంత్ర, జూన్4: బెంగళూరు ఆర్సీబీ (RCB) విజయోత్సవ సంబరాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఈ సంబరాలను ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట (Stampede ) జరిగి ఏడుగురు మృతిచెందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరయ్యారు. పదుల సంఖ్యలో గాయపడటంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్స్‌కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషయమంగా వున్నట్టు తెలుస్తోంది. స్టేడియంలోకి ఒక్కసారిగా అభిమానులు దూసుకు రావడంతో తొక్కిసలాట ఏర్పడిందని చెబుతున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
స్టేడియం ముందు ఇంత గందరగోళం జరుగుతున్నా లోపల ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం యధావిధిగా జరగింది. ఇదిలావుండగా ఆర్సీబీ యాజమాన్యం ముందు ఓపెన్ టాప్ బస్సులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలనుకున్నా, పోలీసులు అందుకు అనుమతించలేదు. జూన్ 3న జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో 18 సంవత్సరాల విరామం తర్వాత ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఈ టైటిల్ కోసం ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా 18 సీజన్లు వేచి చూశాడు. నిన్నటి విజయంతో తీవ్ర భావో ద్వేగానికి గురైన కోహ్లీ కళ్లనీరు పెట్టుకోవడం గమనార్హం.