రాజకీయ సాహిత్య సవ్యసాచి బూర్గుల

నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి

అపరచాణక్యునిగా పేరెన్నిక గన్న దివంగత ప్రధాని పివి నరసిం హారావుకు ఆయన గురువు. ఆయన న్యాయవాది, బహుభాషావేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ నీతిజ్ఞుడు. హైద రాబాద్‌ ‌రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవస్థాపకుల్లో ఒకరు. సాహితీ వేత్త. బహు భాషా కోవిదులు. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పని చేసిన తొలితరం కాంగ్రెస్‌ ‌నాయకులు. ఆయనే హైదరాబాద్‌ ‌రాష్ట్రానికి ప్రజల ద్వారా ఎన్నికైన మొట్టమొదటి, చిట్టచివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్‌ ‌రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ ‌బూర్గుల రామకృష్ణారావుతో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉండేది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు గురువు ఆయన. బూర్గుల న్యాయవాదిగా పనిచేసే రోజుల్లో ఆయన వద్ద పి.వి. సహాయకునిగా పనిచేయడమే కాకుండా రాజకీయాల్లో ఆయన వారసునిగా ఎదిగారు.

రామకృష్ణరావు విళంబి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ విదియ  1899 మార్చి 13 న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తి తాలూకా పడకల్లు గ్రామంలో తమ మాతామహులైన వెల్దండ శేషారావు గారి ఇంట జన్మించారు. ఇంటి పేరు పుల్లం రాజు.  అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే ఇంటి పేరుగా మారింది. ధర్మపంత్‌ ‌స్కూలు (హైదరాబాద్‌) ‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1915లో మెట్రిక్‌ ‌పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పూణె లోని ఫెర్గూసన్‌ ‌కళాశాలలో బీఏ (హానర్స్) ‌డిగ్రీ చదివారు.

బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించి ఎల్‌.ఎల్‌.‌బి. పట్టాను పొందారు. న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు ఇండియన్‌ ‌సోషల్‌ ‌రీఫార్మర్‌ ‌పత్రికలో వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ ఆంగ్లంలో వ్యాసాలు రాసి పాఠకులు, సంపాదకుల మన్ననలు పొందారు.1922లో ఆంగ్ల ప్రభుత్వం వారు బీరార్‌ ‌ను నిజాంకు ఇచ్చివేయాలని కూడా పై పత్రికల్లోనూ, ఉర్దూ పత్రికల్లోనూ వ్యాసాలు రాశారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ (లా డిగ్రీ) పూర్తిచేసి, హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బూర్గుల దగ్గర పివి నరసింహారావు జూనియర్‌ ‌లాయర్‌గా పనిచేశారు. 1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరారు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నారు.

ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసారు. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసారు. హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖులు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ఆంధ్రమహా సభకు బూర్గుల అధ్యక్షత వహించారు. శాసనోల్లంఘన ఉద్యమం లోను, క్విట్‌ ఇం‌డియా ఉద్యమం లోను పాల్గొని కారాగార వాసం అనుభవించారు. 1948లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు అయి, వెల్లోడి ముఖ్య మంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యారు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించారు.

1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగిపుడు, మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలోని షాద్‌నగర్‌ ‌నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌ ‌శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలో సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్య మంత్రిగా పేరుగాంచారు. 1956లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు అయినపుడు, కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాగా, బూర్గుల, కేరళ రాష్ట్రానికి గవర్నరుగా నియుక్తులై, 1960 వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత 1962 వరకు ఉత్తర ప్రదేశ్‌ ‌గవర్నరుగా కొనసాగారు. 1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్‌ ‌జనరల్‌గా హైదరాబాద్‌ ‌వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు.

ఆ సంవత్సరంలోనే హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించారు. హైదరాబాద్‌ ‌సంస్థానం భారత దేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, మధ్యప్రదేశ్‌ ‌విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్‌ ‌భారత్‌ ‌సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నారు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు ఉర్దూ అకాడమీ, భారతీయ విద్యాభవన్‌, ‌ప్రశాంతి విద్వత్‌ ‌పరిషత్‌ అధ్యక్షులుగా విశేష సాంస్కృతిక సేవలందించారు. క్లాసికల్‌ ‌లాంగ్వేజి కమిషన్‌ ‌సభ్యులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, సంస్కృత పరిషత్‌ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించారు.

ఆయన అనేక భాషలలో నిష్ణాతులు. అవన్నీ  ఆయన సొంతంగా, ఆసక్తితో నేర్చుకున్నవే. అర్ధరాత్రి వరకు ఫైళ్లలో నిమగ్నమై, తర్వాత  బూర్గుల సంస్కృతంలో మునిగి తేలేవారు. బూర్గుల బహు భాషావేత్త, సాహితీవేత్త. తెలుగు, హిందీ, ఆంగ్లం, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు,   సానెట్లు, వ్యాసాలు రాసి కాలేజీ సంచికలో ప్రచురించారు. థామస్‌ ‌గ్రే ఎలిజీని ‘మృత సంస్కృతి’ పేరుతో స్వతంత్ర రచన అనిపించే విధంగా అనువదించారు. ఆంగ్ల భాషలో ఆయన స్వయంగా రచించిన భావగీతాలు ‘ద డ్రీమ్‌ ఆఫ్‌ ‌పొయెట్రీస్‌ అం‌డ్‌ అదర్‌ ‌పోయెమ్స్’ ‌పేరుతో వెలువడ్డాయి.

పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీ పంచకమును, శంకరాచార్యుల సౌందర్య లహరి, కనకధారా స్తవమును తెలుగులోకి అనువదించారు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం, రెడ్డి రాజుల కాలం-మత సంస్కృతులు (పరిశోధనా వ్యాసం) మొదలైనవి ఆయన ఇతర రచనలు. అయన రచించిన వ్యాసాలు ‘సారస్వత వ్యాస ముక్తావళి’ పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, కృష్ణశతకం, వేంకటేశ్వర సుప్రభాతం, నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వ్మాయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశారు. అనువాద రచనలు కూడా చేశారు. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో ‘తెలంగాణ రచయితల సంఘం’ ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధులైనారు. ఆయనకు1953లో ఆంధ్ర విశ్వ విద్యాలయం అయనకు డాక్టర్‌ ఆఫ్‌ ‌లిటరేచర్‌ ‌గౌరవపట్టాను ప్రదానం చేసింది.1956లో ఉస్మానియా విశ్వ విద్యాలయం డాక్టర్‌ ఆఫ్‌ ‌లాస్‌ అనే పట్టాను ఇచ్చింది. బూర్గుల 1967, సెప్టెంబర్‌ 14 ‌న గుండె పోటుతో మరణించారు.
 – రామ కిష్టయ్య సంగన భట్ల…
   9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page