మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ఆంధ్రదేశంలో భక్తితత్వం పొంగి పొర్లుతూ డ్రైనేజీల్లో కూడా కుప్పలు తెప్పలుగా పారుతోంది. ఆంధ్రులకు భక్తి లేదా భావోద్వేగాలు ఏమి వొచ్చినా పట్టుకోవడం కష్టమే. తాజాగా పవిత్ర తిరుమల ఆలయంలో లడ్డూ కల్తీ అంశం దేశ వ్యాప్తంగా వివాదమైంది. దీని చుట్టూ రాజకీయాలు విశేషంగా ముదురుతున్నాయి. తిరుమల ఆలయంలో అపచారం జరిగిందనే అంశంపై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బజారున పడి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. భారత రాజకీయాల్లో మతం, సంస్కృతి అనేది ఒకరికి ఇష్టం ఉన్నా లేకున్నా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. మతం జోలికి వొస్తే మాత్రం బూడిద కావాల్సిందే. రాజకీయంగా ఉనికిని కోల్పోవాల్సిందే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనం కృత్రిమ మేధ ప్రపంచంలో ఉన్నా సరే. మతం, సంస్కృతికి బలమైన పునాదులు భారత్‌లో ఉన్నాయి. ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, ఆర్జికంగా సర్వం కల్తీ . రాజకీయ పార్టీల సిద్దాంతాలు కూడా కలుషితమయ్యాయి.
మతం మొదలుకుని, మనం తినే ఆహారం వరకు, సర్వం కల్తీమయమే. మన జీవన విధానం కూడా సంపూర్ణంగా కలుషితంగా మారింది. ప్రతీ అంశం వివాదమే. అందులో భాగంగా పవిత్రమైన తిరుమల ఆలయంలో లడ్డూను కూడా కల్తీ చేసి పబ్బం గడుపుకునే విధంగా రాజకీయ పార్టీలు దిగజారాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా రాజకీయాలు సాగుతున్నాయి. ప్రపంచంలో ప్రతి హిందువుకు తిరుమల సెంటిమెంట్. లడ్డూ సంగతి చెప్పాల్సిన లేదు. హిందువేతరులు కూడా ఎంతో భక్తితో తిరుపతి లడ్డూను స్వీకరిస్తారు. ఆంధ్రుల భావోద్వేగాలు కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంటే, ఆ ప్రవాహంలో తమకు రాజకీయంగా వొచ్చే లబ్ధికోసం అధికార, విపక్ష పార్టీలు గాలం వేస్తున్నాయి. అపచారం జరిగినందుకు బాధలో, డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించారు. జగన్ హయాంలో తిరుమలలో అపచారం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటన చేసి, ఆలయ సంప్రోక్షణకు నిర్ణయించారు.
మరో వైపు ఈ మొత్తం వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. మాజీ సీఎం జగన్ కూడా తమ హయాంలో అపచారం జరగలేదని, వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారంటూ లేఖలు వదులుతున్నారు. తిరుపతి ఆలయంలో అపచారం, లడ్డూ కల్తీ అంశం రాజకీయంగా దేశ వ్యాప్తంగా ప్రకంపనలు నృషించింది. వైఎస్ జగన్‌ను, వైకాపాను చావు దెబ్బ తీసేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వజ్రాయుధం లభించింది. ఈ ఆయుధాన్ని వాడుకోకుండా బాబు ఎందుకు ఊరికే ఉంటారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 11 సీట్లతో కుమిలిపోతున్న జగన్‌కు చంద్రబాబు దాడి నిజంగా రాజకీయ సమాధి చేస్తుందా ? జగన్ చుట్టూ సరైన సలహాదారులు లేరా? ఐదేళ్ల పాలనలో తిరుమలలో ఏమి జరిగిందనే అంశంపై జగన్‌కు అవగాహన లేదా? తిరుమల లడ్డూ వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకుంటే రాజకీయంగా భవిష్యత్తు ముగిసినట్లే. దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కోట్ల మంది హిందువుల మనోభావాలకు తూట్లు పొడిచే విధంగా రాజకీయాలు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు ఆ నేతలకు రాజకీయంగా సమాధి చేస్తారు.
తాజా వివాదం ద్వారా హిందూ సమాజానికి వైఎన్ కుటుంబం మరింత దూరమవుతుందని చంద్రబాబు కలలు కంటున్నారు. దేశ వ్యాప్తంగా తిరుమలలో అపచారం, లడ్డూపై త్మీవమైన చర్చ జరగాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. బాబు అనుకున్నట్లుగానే పెద్ద చర్చ , రభస జరిగింది. కేంద్రం కూడా నివేదిక అడిగింది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు, త్వరలో ల్యాబ్‌ను నెలకొల్పుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. కల్తీ నెయ్యిని పంపిన ఏఆర్ ల్యాబ్‌పై ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాలి.. సీబీఐ విచారణకు చంద్రబాబు అంగీకరించలేనట్లే, సిట్ ఏర్పాటును ప్రకటించారు.ఈ మొత్తం వ్యవహారంపై చర్చ జరిగి, రాజకీయంగా లబ్ధిచేకూరితే చాలనుకునే రీతిలోనే చంద్రబాబు వైఖరి కనపడుతోంది.
రాజకీయంగా ఇటువంటి సున్నితమైన అంశాలను ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సైంటిఫిక్ విచారణ జరిగితే తప్ప కల్తీ జరిగిందా లేదా అనేది తెలియదు. ఈ మొత్తం వ్యవహారంలో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆగ్రహానికి ఎవరు లోనవుతారు. ఆ దేవ దేవుడి శాపానికి ఎవరు గురవుతారనే ఆధ్యాత్మిక వాదుల ఆలోచనలకు ఎవరు సమాధానం చెప్పలేరు. ఈ కోణంలో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. చంద్రబాబు ఆరోపణల్లో నిజముందా? జగన్ చెప్పిన సమాధానాల్లో నిజాయితీ ఉందా ? ఇక్కడ దైవత్వమనే నమ్మకం నిజానిజాలు నిగ్గు తేలుస్తుందంటే అది కూడా ఎవరి నమ్మకాలు వారివి. తిరుమల లడ్డూ వివాదం యావత్తు భారతావనిని కుదిపేసింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దైవత్వం, దేవుడి, గుడి, చర్చి, మసీదు దేనినైనా రాజకీయ పార్టీలు వాడుకోవడానికి రాజకీయ పార్టీలు వెనకాడవని తాజా ఘటన రుజువుచేస్తోంది.