కాలతత్వం…

కాలం మహాశక్తి. మనిషిని జోకొట్టి, జేకొట్టి, నిశ్శబ్దంలోకి నెట్టేదీ కాలమే. కాల తత్వాన్ని తెలుసుకునేందుకు ఎంతో కాలంగా మనిషి ప్రయత్నిస్తూనే ముందుకు సాగుతున్నాడు. కాలంలో పుట్టి, జీవించి, అందులోనే కలిసిపోయే మనిషికి ఆ అవినాభావ సంబంధం విడదీయరానిది. మనిషికి కలిగే భావన, సుఖం, దుఃఖం, మంచీ చెడూ, మహోన్నత జ్ఞాన పరిజ్ఞానాలు కాల సంబంధంతో పుట్టినవే, మనిషి జీవితానికి, కాలానికి ఉన్న సంబంధం ఎంతో దగ్గరిది. కాల ప్రభావంలేని జన జీవితాన్ని ఊహించలేం. కాలం ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చించుకుని తీరాల్సిన అంశమే. కాలగతిని అనుసరించి సాగే మనిషి కాలాతీతుడుగా ఎదగడానికి ప్రయత్నాల పరంపర ఆగకుండా సాగుతూనే ఉంది. కాలాన్ని పలవరించి, పరవశించి, వివేచించే మనిషి దానితో తన అనుభవాలను, ఆలోచనలను విశ్లేషించుకుంటూ జీవనపథంలో సాగిపోతూనే ఉంటాడు. ఎంతో శక్తివంతమైన ఎన్నెన్నో శక్తి యుక్తులున్న కాలాన్ని మనిషి జీవితంతో అనుసంధానం చేసి బహుముఖ కాల దర్శనానికి అక్షరాకృతి తొడుగుతూ సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య ఎన్‌ ఆర్‌ వెంకటేశం కాలగీతి అన్న పేరుతో దీర్ఘ కవితను వెలువరించారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి అంకితమిచ్చిన ఈ దీర్ఘకవిత కాలం పట్ల జ్ఞానాన్ని పెంపొందిం చుకున ేందుకు ఎంతో తోడ్పడుతుంది. స్వరాం జలి, ఆలాపన, పల్లవి, ఒకటో, రెండో, మూడో, నాల్గొ, ఐదో చరణాలతో ఆచార్య వెంకటేశం కాలగీతిని విరచించారు.

చలనమే కాలానికి జననమని, గమనమే జీవనమని నక్షత్రాలు గ్రహాల కిచ్చిన నిరంతర గమనాపేక్ష కాలా నికి జన్మనిచ్చిందంటూ ఈ దీర్ఘ కవిత ఆరంభమౌతుంది. అనంత విశ్వంలో, అగణిత గ్రహాల్లో అజ్ఞానంగా ఉండిపో యిన కాలాన్ని మనిషే గుర్తించి నిర్వచించి లక్షణాలను చెప్పి ఉనికిని చాటాడని చెప్పారు. మనిషి మేధస్సు వికసించి వెలు గులెన్నో ఆవిష్కృతమయ్యాయని అన్నారు. చరిత్రను కాలానికి ఆపాదించి ప్రకృతిని పరిణామ శక్తిగా కాలానికి ప్రతిపాది ంచిన మనిషి ఆ కాలాన్ని కొలమా నంగా వాడుకోవడానికి కాలమానాన్ని సృష్టించాడని తెలిపారు. అనంత తత్వంగా, నిత్య చైతన్య శక్తిగా కాలాన్ని అర్థం చేసుకొని కాలజ్ఞానం అనే మాటకు అపూర్వ విలువను ఆపాదించాడు మనిషి అని వివరించారు. భగవంతుడిని కాలస్వరూపుడిగా నిర్వచించాడని చెప్పారు. కాలపు లోతుల్ని సిద్ధాంతంగా సూచించి విశ్లేషించిన మనిషి మజిలీలను చరిత్రగా సూచించి కాలం ధరించిన పాత్రగా అభివర్ణించాడని చెప్పారు. చరిత్రలో కాల ప్రాధాన్యతను మనిషి గమనించాడన్నారు. అనంతమైన కాలరూపాన్ని అంచలంచలుగా చూడడమే కాక విభాగాలుగా విభజించి సూక్ష్మాతి స్మూక్షంగా చూసి గమనించగలిగిన శక్తిని మనిషి పెంచుకున్నాడని అన్నారు. అనంత కాలం మీద పెరిగిన అవగాహనతో మనిషి జ్ఞానార్జన సాధ్యం అయిందని చెప్పారు. అద్భుత జ్ఞానం మనిషి సొంతం అవడానికి కాలమే గీటురాయిగా మారనుందని చెప్పారు. కాలధర్మం ప్రకారం పుట్టి పెరిగి గిట్టడం జరుగుతుందని అన్నారు. త్రికరణ శుద్ధిగా కాలాన్ని నమ్మిన మనిషి అన్ని జీవిత దశలలో తనను కాలంతో సమన్వయించుకొంటాడని చెప్పారు. కాల గమనాన్ని పరిశోధన చేసిన మనిషి ఫలితాలను నివేదిస్తాడని చెప్పారు. కాలాన్ని దర్శించిన కవి అనేక చరణాలుగా కాలగీతిని గానం చేసి ఆ జ్ఞానాన్ని మననం చేసుకున్నారని తెలిపారు.

కాలం కన్నుగప్పే ఏకాంతం ఎక్కడుంటుంది అని ప్రశ్నిస్తూ ఒంటరిగా విడిచిపెట్టని కాలంతో ఎవరైనా కలిసి ఉండక తప్పదని చెప్పారు. మనుషులకు సంబంధించినవే కాలం తనకు ముడివేసిన బంధాలని అన్నారు. దృశ్యాలను కళ్ల తెరమీద కాలం ప్రదర్శిస్తుందని చెప్పారు. హృదయ శిఖరాలు ఎదల లోతుల్లో తేలిపోయే మనిషి ఉవ్వెత్తున లేచి ఉక్కిరిబిక్కిరి చేసే సమస్యలతో సతమతమౌతూ పరిష్కార సూచికలను పరిశీలిస్తుంటాడని తెలిపారు. నిర్ణయాల మెరుపులను మెదడులో నిలుపుకునే మనిషిలోని నిజా నిజాలను నిగ్గు తేల్చడానికి కాలం నిర్విరామంగా పని చేస్తుందని తెలిపారు. మనోవేగాన్ని మించింది ఏమీ లేదని అన్నారు. మౌనంగా చూస్తున్న మనిషిలో మూగ భాషల ఘర్షణలు, రౌద్ర సముద్రాలు దాగి ఉన్నాయని చెప్పారు. మానవ స్వభావాలు కాల ప్రభావాలే అని తేల్చారు. అణుసంపుటమైన మనిషి అనంతంలో పరి వ్యాప్తమై సృష్టితత్వ జిజ్ఞాసు డవుతాడని చెప్పారు. కాలం హృదయాన్ని స్పర్శిస్తే అనుభూతులు విస్త రించి నూతనా విష్కర ణాలు జరుగు తాయని అన్నారు. సద్వివేక నిత్య పరిణామ సత్య రూపం మనిషికి పెద్దదిక్కవు తుందని చెప్పారు. కాలం కన్నీటిని తుడిచి గుండె బరువును దింపుతుందని అన్నారు. మనిషిని ప్రకృతి అర్థం చేసుకొని విజయ రహస్యాలను పట్టుకున్నాడని తెలిపారు. అమ్మకు, బిడ్డకు ఉన్న సంబంధమే అనాదిగా కాలానికి మనిషికి ఉన్న సంబంధం అన్నారు. కాలానుబంధంలో అనిర్వ చనీయమైన వాత్స ల్యాన్ని మనిషి అనుభవించాడని చెప్పారు. హృదయానికి ఊపిరికీ ఉన్న సంబంధం కాలానికీ మనిషికీ ఉన్న అనుబంధంగా భావించారు. పరిణామ క్రమంలోని పరిపరి విధాల దశలను మనిషి దాటి పరిణామం చెంది కొత్త అన్వేషణలకు కది లాడని తెలిపారు. జిజ్ఞా సువుగా, అన్వే షిగా మనిషి కాలం సన్ని ధిలోనే ఎదిగాడని చెప్పారు. అయస్కాంత సూత్రం సృష్టి గమన నియమాల కొలమాన పాత్రమని తెలిపారు. మానవుని మేధస్సును ప్రయోగశాలగా అభి వర్ణించారు. సూర్యు ణ్ని కూడా కాలం నిద్రపోనివ్వదని అన్నా రు. నిద్ర లేకుండా నిరంతరంగా భూమి పరిభ్రమనం చేస్తూ నియమ పాలనకు నిదర్శనంగా మారిం దని చెప్పారు. కాలం కరుణించి మనిషికి ఇచ్చిన వరమే నిద్ర అని అంటారు.

కాల ప్రోత్సాహంతో ఉత్సాహం పొందిన మనిషి ప్రకృతిని పరిశీలించి ప్రతికృతిని ఆవిష్కరించాడని తెలిపారు. నిద్రలేమికి ఎంత శిక్షో, అతి నిద్రకు అంతే శిక్ష అంటూ కాలంలోని నిర్దయను ఎత్తి చూపారు. ఉదాత్త భావాలే ఆదర్శనందనాలుగా నిలుస్తాయని స్పష్టం చేశారు. అలుపు లేకుండా శ్రమిస్తే మలుపు దాటి మజిలీని చేరుకొని మరో యుగాన్ని ప్రారంభించవచ్చునని తెలిపారు. కలలు కంటేనే ఘనకార్యాలకు రూపకల్పన జరిగి లోకకళ్యాణం సాధ్యమవుతుందని చెప్పారు. అగణిత ప్రాణకోటిలో అసలు ఈ మనిషి ఎంత అని ప్రశ్నిస్తారు. కాల రేఖపై మనిషికి మూడు బిందువులు కనిపించి భావ చిత్రం దృశ్యమాన మవుతుందని చెప్పారు. కాలం అడుగు పడగానే అదృశ్యాలన్నీ సుదృశ్యాలవుతాయని చెప్పారు. తరానికీ తరానికీ అంతరాలు సృష్టించేది కాలమేనని చెప్పారు. కాలం ఒడ్డు మీద మనిషి కీర్తి అనే పిచ్చుక గూడును కట్టుకుం టాడని చెబుతూ అల వచ్చేంత వరకే అది నిలుస్తుందని తరువాత అభ్ధిలో కలుస్తుందని వివరిస్తారు. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలలను ప్రస్తావించి వాటి ప్రత్యే కతలను కాలమాన పరిభాషలో చెప్పారు. శిఖరాలకు ఎగిరే ఆనందాలు, అగాధాలకు చేరే ఆవేదనలు మస్తిష్కంలో మైలు రాళ్లుగా నిలుస్తాయని చెప్పారు. ఓదార్పు ఉత్సాహం, విశ్వాసం, వివేకం గురించి వివరించారు. పొరపాట్లను చక్కదిద్దుకునేందుకు ఇంకొక అవకాశం ఇచ్చే నిక్కమైన కాలమే భవిష్యత్తు అని చెప్పారు. ప్రాంతదర్శుల కాలదర్శ నాన్ని వివరిస్తూ అది బుద్ధితో దర్శించే కాలమని చెప్పారు. కాలవిస్తరణతో జీవితం మీద పడే చక్రముద్రను ప్రస్తావిం చారు. కాలాన్ని జయించడానికి మనిషి ప్రయత్నిస్తూనే ఉంటాడని చెప్పారు.

నవరసాల వైవిధ్యం నరుడు అనుభవిస్తాడని అన్నారు. కాలానిది ఎన్ని యుగాలు దాటినా ఎప్పుడూ ఆగిపోని అవిశ్రాంత గమనమని, అలసట లేని పయనమని చెప్పారు. నిరంతర కాలగమనంలో మనిషి జీవనంలో శీతల, మలయ పవనాల స్పర్శలు, గ్రీష్మం ఎర్రటెండల సెగలు ఉన్నాయని తెలిపారు. అనాదిగా నడుస్తున్న కాలానికి పునాది ఎక్కడో అని అంటారు. ఆద్యంతరహితంగా కాలం నడుస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కాలప్రభావంతో పెరిగే జీవులే కాలగమనాన్ని చూపే సంకేతాలని అన్నారు. ఆకులు రాలి, మోడులు చిగిరించి ఎండిన కాలువలే ఏరులై ప్రవహిస్తాయని చెప్పారు. మబ్బు మెరిసి వెన్నెల విరబూస్తుందని చెప్పారు. ఆరు ఋతువులు, కాలగమనానికి అలంకారాలు, అందాల హారాలని అంటూ వాతావరణ ప్రకారాలు ప్రకృతి విలక్షణ స్వరూపాలని తెలిపారు. సృష్టి స్థితి లయలు కాలం చేసే ప్రయోగాలే అన్నారు. కాలజ్ఞాన ప్రదాతగా, విలువల్ని తేల్చే విజ్ఞానిగా చరిత్రను అభివర్ణించారు. కాలం, మనుషుల కలయిక ఉంటేనే చరిత్ర కలయిక ఉంటుందని తెలిపారు. కాలానికి నీడలా, గతానికి మేడలా చరిత్ర నిలుస్తుందని అన్నారు. గతమంతా భద్రపరిచే అంశమని, నిలిచిన వాళ్లు కొందరు చరిత్ర సృష్టించిన వాళ్లని చెప్పారు. తెలివితేటల్ని ఆవిష్కరించి వెలుగుబాటలు చూపే వారిని కాలం ఫాలం మీద తిలకంలా ధరిస్తుందని అన్నారు. అసాధారణ వ్యక్తులు, అసామాన్య వ్యక్తులు కాలాన్ని జయించి కలకాలం వెలుగుతుంటారని చెప్పారు. కాలాతీత వ్యక్తులుగా నిలబడతారని అన్నారు. మానవతా గుణం కలిగి సామాజిక నియమాలను తప్పనివాళ్లు కాలజ్ఞానులని చెప్పారు.

లోక కంఠకులు కాలగర్భంలో కలుస్తారని కాలం ముందుకు నడుస్తూనే ఉంటుందని భరోసాగా చెప్పారు. పరిమళాలకూ, పవనాలకు అవినాభావ సంబంధాన్ని అనేక అంశాలతో ఉదాహరించారు. ఆటవిక దశ నుంచి ఆధునికానికి వచ్చిన మనిషిని విశ్లేషించి చూపారు. నిజం, నిష్కర్శలోనే సహజం ఉంటుందని మనిషి గమనించాలని అన్నారు. ఆలోచనలను ఆవిరి చేసి అనంత దుఃఖంలోకి అలవోకగా కాలం నెట్టేస్తుందని చెప్పారు. కొండంత బరువును దూదిపింజలా మార్చేసేది కాలమేనని అన్నారు. మనిషి ఎప్పటికీ కాలం చేతిలో కీలుబొమ్మేనా అని ప్రశ్నించారు. కాలం అనుకూలిస్తే, కలిసొస్తే జయం లభించి కలలు నిజాలవుతాయని చెప్పారు. అర్థం కాకుండా కాలం నడుస్తూ అద్భుతాలను మనిషికి చూపిస్తుందని అన్నారు. మానవుని జీవన యాత్రను నియంత్రించేది కాలసూచికేనని చెప్పారు. కాలజ్ఞాన అవగాహనతోనే జీవితాన్ని మనిషి నడిపిస్తాడని చెప్పారు. మనిషి ఆకులా రాలిపోతే కాలం మహావృక్షంలా జీవ చలనంతో పచ్చగా నిలుస్తుందని చెప్పారు. ప్రశాంతి గతి తప్పి ఆరాచకాలు పెరిగితే అదిమివేయడానికి కాలం ప్రత్యక్షమై కావాలసిన మార్పులు చేస్తుందని అన్నారు. కాలిపోతున్న పూలగుండెల్ని చూసి జాలిపడి కాలం కలవరపడుతుందని చెప్పారు. ప్రకృతినే వంశీగా మలచి జగదానంత గీతాలు పాడుతూ జాగృతిని కలిగిస్తుందని అన్నారు.

మనిషికి కాలం ఇచ్చిన వరాలు నేర్పు, ఓర్పు అంటారు. జ్ఞాన పుష్పాలను పూయడానికి కాలం అవగా హనల మొగ్గలు తొడుగుతుందని తెలిపారు. మనిషి వెలుగు లను పట్టుకుంటూ చీకట్లను పోగొట్టుకుంటూ నవజీవన విన్యాసాలతో నవీన యుగంలోకి అడుగు పెట్టాడని చెప్పారు. ప్రకృతిని జయించాలనే పట్టుదలతో ఎదిగిన మనిషిని గూర్చి చెప్పారు. సముచిత, సంక్లిష్ట పరిణామాల ప్రభావాలను వివరించారు. మళ్ళీ మొదటికొచ్చే మనిషి పరిస్థితిని తెలిపారు. కాలం అన్నింటినీ నిశ్శబ్దంగా గమనించి సమాధానం ఇస్తుందని అంటూ అధికారాంతంలో కాలం శక్తిని మరచిపోతే మనిషి ఒంటరివాడై కన్నీరే మిగులు తుందని చెప్పారు. పదవి అశాశ్వతమని కాలం మనిషికి గుర్తు చేస్తుందని అన్నారు. సర్వాధిపత్యం నాదేనని గర్వపడితే సునామీగా జలవిలయం కప్పేస్తే మనిషికి తన బలహీన తలెలాంటివో తెలిసిపోతుందని అన్నారు. అపజయాల అనుభవాలే విజయానికి సోపానాలని తెలిపారు. ప్రకృతిని బేరీజు వేసుకునే మనిషి కాలాన్ని అర్థం చేసుకుంటాడని చెప్పారు. కాలం వైపరీత్యాలలోనే మనిషి సత్యాలు తెలుసుకుంటాడని తెలిపారు. దృఢ సంకల్ప దీక్షతో మనిషి అడుగు ముందుకు వేసి వివేచనను పెంచి పెనుశక్తిగా మారి విజయం సాధిస్తాడని అన్నారు. మానవుని విజయాల వెనుక కాలమే ఒక మహాశక్తి అని స్పష్టం చేస్తూ కాలగీతికి ముగింపు పలికారు. కాలాన్ని అర్థం చేసుకునేందుకు బహుముఖ దారుల్ని ఆవిష్కరించిన గొప్ప సృజన ప్రయత్నం ఈ దీర్ఘ కవిత.
 – డా. తిరునగరి శ్రీనివాస్‌
9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page