ఈ నేల
రాడికల్స్ కాలాన్ని తొవ్వుకొంటోంది
రక్త మాంస భరితమైన కాలం
పురిటి బిడ్డను
పున:ర్మూల్యాంకనం చేసుకుంటోంది
దుఃఖదారుల్ని మూసి వేసి
చీకటి కోణాల్లో దీపం వెలిగించిన
సూర్యుల్లను గీసుకుంటోంది
విరిగిన రెక్కలకు చికిత్స చేసి
నెత్తుటి గాయాల్ని తుడిచి
కడగొట్టు గుడిసెల్లో జీవం పోసుకున్న
కొత్త మాటల్తో కొత్త పాటల్తో
ఊళ్ళు పల్లెలు నిప్పుల వసంత మాడి
కొండమీది నుంచి
కొత్త ఋతువును దింపుకున్న కాలం
నిర్భంధ మూగ నాగళ్ళ చదివి
బంధిత చెమట చుక్కల గుండెల కద్దుకొని
క్రూర మృగాల గడుల్లో చిక్కుబడ్డ జీవితాల్లో
కొత్త ఉదయాల్ని నిర్మించిన కాలం
గాజులు మెత్తబడి
గన్ పౌడరు దారులైన కాలం
ఆడవుల్లోకి మైదానాల్ని
మైదానాల్లోకి అడవుల్ని
ప్రవహించి
కొత్త వాకిల్ల పచ్చదనం తో
పొలాలు చెలకలు
కత్తుల కోలాట మాడిన కాలం
కలగంటున్న భూముల మధ్య
చెమట మేఘాల్ని
నిలబెట్టి
ఆకలి నోళ్ళ వరిగొల్సుల నుదుటి కద్దిన
కాలాన్ని దేశానికిచ్చి
వెలుగు దారుల రెక్కల్ని ఎగరేసి
త్యాగాలకు పాదులు వేసిన కాలం
కాలం చేతుల్లో ఎర్రజెండా పెట్టి
కాళ్లకు గజ్జెలు కట్టి
ఈ నేలను
నదిలా పారించారు
– వడ్డెబోయిన శ్రీనివాస్
9885756071