ఇది రైతు పక్షపాత ప్రభుత్వం

నీటిపారుదల రంగానికి పెద్దపీట
రూ.23,373 కోట్లతో పటిష్టం కానున్న నీటిపారుదల రంగం
సంక్షేమ రంగానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు
పౌరసరఫరాల శాఖకు 5,734 కోట్ల కేటాయింపు
నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి రుజువు అయిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రైతాంగం అభివృద్ధి ప్రజల సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి రూపొందించిన బడ్జెట్  ఇది అని ఆయన అభివర్ణించారు. బుధవారం రాష్ట్ర శాసనసభలో ఆర్థిక,విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతించారు. బడ్జెట్ ప్రసంగంపై ఆయన ఒక ప్రకటనలో స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ సాధికారత, ఆహార భద్రత, స్థిరమైన అభివృద్ధితో పాటు నీటిపారుదల, పౌర సరఫరాలను పటిష్టంగా మార్చేందుకు ఈ బడ్జెట్ ప్రతిబింబింప చేస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రైతాంగం పై మక్కువ ఎక్కువ అని చెప్పడానికి నీటి పారుదల రంగానికి 23 వేల 373 కోట్ల కేటాయింపు నిదర్శనమన్నారు. నల్గొండ జిల్లాలో లక్ష ఎకరాలకు నీరందించేందుకు  గాను ఉదయ సముద్రం నుంచి బ్రహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను పూర్తి చేయడంతో పాటు నల్లగొండ,యాదాద్రి భువనగిరి జిల్లాలోని 107 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు ఫ్లోరోసిస్ రహిత తాగునీరు అందించే ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తామన్నారు అంతే కాకుండా మూసి ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని బునాదిగాని కాలువ పునరుద్ధరణ కోసం 266.65 కోట్లు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ తద్వారా యాదాద్రి జిల్లాలో పంటలు సస్యశ్యామలంగా మారనున్నాయన్నారు. కృష్ణా గోదావరి నదుల నీటి వాటాను తెలంగాణాకు సాధించేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూనే బిఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమ కేటాయింపులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూనే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర హక్కులను బలంగా వాదించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు నీటి వనరుల వినియోగాన్ని గుర్తించేందుకు వీలుగా టెలిమెట్రి పరికరాలను అమర్చడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా నీటి కేటాయింపులలో పారదర్శకంగా ఉండొచ్చన్నారు.  నీటిపారుదల రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రైతాంగానికి వెన్ను దన్నుగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో సంక్షేమ రంగానికి సైతం బడ్జెట్ కేటాయింపులలో సముచిత స్థానం కల్పించిందని అన్నారు. అందులో ముఖ్యంగా పేద ప్రజలకు నేరుగా కనెక్టివిటీ ఉన్న పౌరసరఫరాల శాఖకు ఏకంగా 5,734 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. తద్వారా లక్షలాది కుటుంబాలకు ఆహార భద్రత కల్పించినట్లైందన్నారు. అంతే కాకుండా ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా గృహ జ్యోతి పథకంలో 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు 1,775.15 కోట్లు కేటాయింపు ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనమన్నారు.  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పెట్టుకున్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాలకు 22,500 కేటాయించిన ప్రభుత్వం పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న మక్కువను చాటుకుందన్నారు. అభయహస్తం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్ ప్రయాణం, మహాలక్ష్మి పథకం కింద 500 కే గ్యాస్ సిలిండర్లతో పాటు కొత్తగా తెల్ల రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు ఆర్థికంగా బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

అన్నింటికీ మించి సన్నాల ప్రోత్సాహానికి గాను ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ అద్భుతమైన ఫలితాలు నమోదు చేసిందన్నారు.బోనస్ ప్రకటనతో సన్నాల సాగు 25 లక్షల నుంచి 40 లక్షలకు చేరుకోవడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత గా ఆయన అభివర్ణించారు రైతు భరోసా పథకం క్రింద రైతాంగానికి ప్రతి సంవత్సరం ఎకరానికి 12,000 అందించేందుకు గాను బడ్జెట్ లో 18,000 కోట్లు కేటాయించడాన్ని ఆయన స్వాగతిస్తూ తద్వారా రైతాంగం ఆర్థిక స్థిరత్వం సాధించడంతో పాటు ధాన్యం దిగుబడి పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు ఉండడాన్ని ఆయన బలంగా సమర్ధించారు. దళిత సంక్షేమానికి రూ.40,232 కోట్లు, గిరిజన సంక్షేమానికి 17,169 కోట్లు, బిసి సంక్షేమానికి రూ.11,405 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.31,605 కోట్లు, ప్రజా ఆరోగ్యానికి రూ.12,393 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.3,591 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మొత్తంగా 3.04 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన విజనరీ రోడ్ మ్యాప్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page