తెలుగు సాహిత్య సాంస్కృతిక సృజనకారులను, విమర్శకులను, పాఠకలోకాన్ని ఒక దగ్గరకు సమీకరించే సంబురాలు తెలుగు నేలమీద జరపటానికి ఛాయ ప్రచురణ సంస్థ బాధ్యత తీసుకొనటం బాగుంది. వర్తమాన తెలుగు సాహిత్య సాంస్కృతికరంగాలలో గర్వించదగిన రచనా ప్రదర్శన సంప్రదాయాలను గుర్తించి చర్చించటం, కొత్తతరం రచయితలు ముందుతరం సాహిత్యంతో సంభాషిస్తున్నారా, ఎంత వరకు ఏకీభవిస్తున్నారు.
ఎక్కడ విభేదిస్తున్నారు, ఏ నూతన విలువల స్థాపనకు తపిస్తున్నారు? వంటి ప్రశ్నలతో యువతరం ఆంతర్యం ఆవిష్కరించటం, రెండుతరాల రచయితల మధ్య సంభాషణకు వేదిక కల్పించటం ప్రయోజనకరం. చరిత్రలో విస్మృతికి గురైన రచయితల రచనల పరిచయానికి ఉత్సవంలో భాగం కల్పించటం సాహిత్యచరిత్రలో ఖాళీలు పూరించుకొనటానికి ఉపయోగపడుతుంది. సాహిత్య అభివృద్ధికి సరైన సాహిత్యవిమర్శ అవసరం అంటాడు కొడవటిగంటి కుటుంబరావు. అందువల్ల సాహిత్య ఉత్సవాలలో సమకాలిక సాహిత్య విమర్శ ధోరణులపై ప్రత్యేక చర్చ ఉండాలని భావిస్తున్నా.
-కాత్యాయనీ విద్మహే





