స్వాతంత్య్రం అనంతరం 78 సంవత్సరాలలో దాదాపు 58 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారానికి దూరమై మళ్ళీ పార్టీ పునర్ వైభవం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు రెండు రోజులు కొనసాగాయి . ఆరు దశాబ్ధాల తరువాత గుజరాత్‌లో ఏఐసీసీ అత్యున్నత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 2000 మంది ప్రముఖ నేతలు పాల్గొన్నారు. సమావేశాల్లో అగ్రనాయకులు కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ అవలంభిస్తున్న విధానాలను దేశ ఐక్యతకు విఘాతం కలిగించేవిగా అభివర్ణించగా .. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గాంధేయవాద సిద్ధాంతాలకు కట్టుబడి ఉందని అన్నారు.
ఆయన రాష్ట్రానికి ఆర్ధిక మంత్రి కూడా ..! ప్రజల సంక్షేమం ..అభివృద్ధి కి కావలసిన ఆర్ధిక నిధులు, వనరుల సేకరణ …వారి ప్రధాన బాధ్యత. భట్టి విక్రమార్క అహ్మదాబాద్ లో చేసిన వ్యాఖ్యకు ఒక రోజు ముందు రాష్ట్రంలో పెరిగిన మద్యం ఆదాయం వార్త వొచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు 34 వేల ఆరు వందల కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత సంవత్సరం కంటే 7 శాతం అధికం అని సంబంధిత శాఖ అధికారుల అంచనా ..! ఏ గాంధేయవాద సిద్ధాంతాలకు లోబడి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందో అర్థం కావడం లేదు. గాంధీ మహాత్ముడు ‘‘ఒక్క గంట పాటు నాకు భారతదేశానికి నియంత పదవి ఇస్తే , నేను చేయబోయే మొదటి పని నష్టపరిహారం లేకుండానే దేశంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేసి, అన్ని తాటి చెట్లను ధ్వంసం చేయడమే…మద్యం మరియు మత్తు పదార్థాలు అలవాటైన వ్యక్తుల ఆరోగ్యాన్ని, నైతిక విలువలను నశింపజేస్తాయి.ఒకప్పుడు ఆనందకర వాతావరణంలో, సుసంపన్నంగా ఉన్న గృహాలను మద్యం ఎలా భ్రష్టుపట్టిస్తుందో మద్యానికి బానిసలయిన భర్తల భార్యలకు తెలుస్తుంది.. అని అన్నారు. కానీ గాంధీ మహాత్ముని సిద్ధాంతాలను వల్లెవేస్తున్న పాలకులు మద్యాన్ని ఒక ప్రధాన ఆదాయ వనరుగా నే పరిగణలోకి తీసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ , ఎక్సైజ్ విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రం రూ. 37,000 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకుంది . ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 20 శాతం వృద్ధి. బీరు, బ్రాండీ , విస్కీ లాంటి పానీయాల అమ్మకాలలో 2021 తో పోలిస్తే 2023 నాటికి 30 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు సంఖ్య సుమారు 2,500 కి పైగా, అలాగే బార్ , రెస్టారెంట్లు 800 పైగా ఉన్నాయి.ప్రతి నెలకు సగటున రూ. 3,000 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్య నిషేధాన్ని ఏనాడో విస్మరించిన పాలకులు ..కనీసం నియంత్రించక పోగా మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం సమకూర్చుకోవడానికి మద్యం లైసెన్సుల వేలం పద్ధతిని ప్రవేశపెట్టింది. ఒక్కో లైసెన్స్ వేలం కోట్ల రూపాయలకు చేరుకోవడం, లైసెన్సుల కోసం పోటీ తీవ్రత పెరిగింది, దీన్ని ఆర్థిక వనరుగా మార్చారు. మద్యం అమ్మకాల ద్వారా వొచ్చే ఆదాయాన్నే ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ మద్యం వినియోగాన్ని నియంత్రించాలన్న ఆలోచనలు తక్కువగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి పరోక్షంగా మద్యం కంపెనీలను ప్రోత్సహించే విధంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ..సంక్షేమ పథకాలు నిర్వహించేందుకు మద్యం ఆదాయాన్ని వినియోగించుకోవడమే కాదు, దానిని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నది.మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలను .. అధిక మద్యం సేవించిన వారు అనారోగ్యం పాలుకావడం దాని ప్రభావం కుటుంబాల పై పడడం పై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. యువత పెడ ధోరణులకు కారణం మద్యం కూడా ఒక కారణం అని గ్రహించడం లేదు. మద్యం అధిక వినియోగం వల్ల కాలేయ వ్యాధులు, హృదయ సంబంధిత సమస్యలు, మానసిక ఆందోళన, మరియు ఆయుష్షు పై ప్రభావం పడుతోంది. ప్రజా ఆరోగ్య వ్యయాలు పెరుగుతున్నాయి, ప్రభుత్వ దవాఖాన లపై భారం పడుతోంది.కుటుంబ సంపద మద్యంలో ఖర్చవడం వల్ల పేదరికం పెరుగుతోంది. గృహ హింస, విడాకులు, పిల్లల చదువులపై ప్రభావం వంటి అంశాలు పెరుగుతున్నాయి. మహిళలు ఎక్కువగా బాధితులు అవుతున్నారు. మద్యం వల్ల భర్తల అగౌరవ ప్రవర్తన, ఆర్థిక అసమర్థత ఎక్కువగా గుర్తించబడింది. మద్యం మత్తులో డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు, మరణాలు, నేరాలు పెరిగాయి. పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే గొడవలలో అధిక శాతం మద్యం సంబంధితవే అన్నది ఒక విశ్లేషణ. ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వ ఆదాయం మద్యం లాంటి ఆరోగ్య హానికరమైన అంశాలపై ఆధారపడటం అనైతికం ..మద్యం అమ్మకాల ఆదాయం ప్రజలకు పథకాలుగా తిరిగి వొస్తుందని చెప్పినా, అదే మద్యం వల్ల వారి జీవన ప్రమాణాలను నశింపజేస్తుంది అన్నది నిజం .
పౌర సమాజం నుండి ‘‘సంపూర్ణ మద్య నిషేధం విఫలమైనపుడు కనీసం నియంత్రణ అవసరం’’ అనే వాదనలు బలపడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం మద్యం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నా, దీని వెనుక ఉన్న మానవీయ నష్టం గుర్తించాలి. మద్యం విక్రయాలను నియంత్రించడంలో మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధానాలను అమలు చేయడంలో కూడా ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చాలి.