భూమి ప్రభుత్వానిది ఎలా అవుతుంది?

హైదరాబాద్‌ ‌విశ్వవిద్యాలయ భూవివాదంలో ఆర్టిఫిషియల్‌ ఇం‌టిలిజెన్స్ ‌ద్వారా తయారుచేసిన చిత్రం తప్పు అని ప్రభుత్వం పెద్ద ఎత్తున యాగీ చేస్తున్నది, తప్పుడు కేసులూ, అక్రమ నిర్బంధాలూ కూడా అమలు చేస్తున్నది. కాని ఆ చిత్రానికి దారి తీసిన పరిణామాలన్నీ పరిశీలిస్తే, ప్రభుత్వం చేసిన తప్పులూ, ఆడుతున్న అబద్ధాలూ, వాస్తవాలను తారుమారు చేయడమూ వంటి అనేక అంశాల ముందు ఆ చిత్రం తప్పు చాలా చిన్నది. అసలు ‘భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు’ అన్నాడు వేమన. కాని అంధకారపు మధ్యయుగాలని పేరు తెచ్చుకున్న ఆ సత్యకాలపు ప్రాచీన వివేకాన్ని దాటి సత్యానంతర యుగంలోకి వడివడిగా పరుగెడుతున్నాం గనుక, ఇవాళ భూమి ఎవరిది అనే వివాదాలే ప్రధానమైపోయాయి.

హైదరాబాద్‌ ‌యూనివర్సిటీ భూములు ఎవరివి అనే చర్చ ఇప్పుడు తర్క వితర్క కుతర్కాలతో, చర్చోపచర్చలతో వివాదాల మయంగా మారిపోయింది. ఈ గందరగోళంలో సత్యమే అసత్యంగా, అసత్యమే సత్యంగా చలామణీ అయిపోతూ హేతుబద్ధమైన, వస్తుగతమైన, ప్రజానుకూలమైన చర్చకు ఆస్కారమే లేకుండా పోతున్నది. నిజానికి ఏ విషయంలోనైనా ఆమోదిం చవలసినదీ ఆచరించవలసినదీ ఏమిటనే ప్రశ్నకు ఈ మూడు గీటురాళ్లు – హేతుబద్ధత, వస్తుగత పరిశీలన, ప్రజానుకూలత – మాత్రమే ప్రమాణం కావలసి ఉంటుంది. కాని ఇప్పుడు ఎంత నిర్హేతుకంగా, ఎంత వ్యక్తిగత సంకుచిత దృష్టితో, ఎంత ప్రజా వ్యతిరేకంగా వాదిస్తే అంత వాస్తవమని భ్రమింపజేసే వాతావరణం ఉంది.
హైదరాబాద్‌ ‌యూనివర్సిటీ అధీనంలో డెబ్బై సంవత్సరాలుగా ఉన్న భూమి ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వ భూమి అని ఒక కొత్త సత్యానంతర యుగపు అసత్యం వీర విహారం చేస్తున్నది. ప్రభుత్వానికి భూమి ఎలా ఉంటుంది,  అసలు ప్రభుత్వమంటే ఆస్తి యజమాని అవుతుందా, ఒకవేళ చట్టపరిభాషలో అవుతుందని అనుకున్నా, ఆ భూమి చరిత్ర ఏమిటి అనే ప్రశ్నలు చర్చకే రావడం లేదు.

ఇప్పుడు వివాదంలో ఉన్న భూమి 1948 సెప్టెంబర్‌ 17‌కు ముందు సర్ఫ్-ఎ-‌ఖాస్‌ ఆస్తి, లేదా జాగీర్‌ ఆస్తి. నిజానికి అప్పుడు కూడా రాజ్యంలో భూమి అంతా రాజుదే అనే గత రాచరిక సమాజపు విలువల వల్ల ఆ భూమిని సర్ఫ్-ఎ-‌ఖాస్‌ ‌గా తన సొంత ఖర్చుల భూమిగా పెట్టుకోవడానికో, జాగీరుగా ఎవరికో అప్పగించడానికో రాజుకు అధికారం ఉందేమో గాని, ప్రకృతి సహజంగా, సమాజానికి వారసత్వంగా వచ్చిన, సమాజానికి చెందవలసిన భూమి ఎవరో ఒక వ్యక్తికి చెందినదిగా చూపడమే తప్పు. ఎక్కువలో ఎక్కువ ఒక భూఖండాన్ని సమాజ అవసరాల కోసం నిర్వహించవలసిందిగా ఒక ధర్మకర్తకో, నిర్వాహక సంస్థకో ఇవ్వవచ్చు గాని, అప్పుడు కూడా ఆ వ్యక్తికీ, సంస్థకూ అది తన భూమి అని చెప్పుకునే వీలు లేదు. సమాజంలో వ్యక్తిగత ఆస్తి, సామాజిక ఆస్తి మాత్రమే ఉంటాయి. సామాజిక ఆస్తిలో కొంత భాగాన్ని నిర్వహించే, దాని బాగోగులు, లావాదేవీలు చూసే అధికారాన్ని సమాజం తాను ఎంచుకున్న సంస్థలకు ఇవ్వవచ్చు. సమాజమే శాశ్వతం. ఆ నిర్వహణ సంస్థలు కావు. ఆ నిర్వహణ సంస్థలు తమకు అప్పగించిన పని చేయకపోయినా, ఆ పనిని ఉల్లంఘించినా వాటికి ఆ భూమిని నిర్వహించే అధికారమే పోతుంది, పోవాలి.

ఇక్కడ హైదరాబాద్‌ ‌రాజ్యంలో భూవివాదాలకు మూలకారణమైన చరిత్ర కొంచెం చెప్పుకోవాలి. మధ్య యుగాల రాచరిక పాలనలో భూమే ప్రధాన ఉత్పత్తి వనరూ, ఆదాయ వనరూ గనుక భూమి మీద అధికారమే మొత్తం సామాజిక అధికారానికి కీలకంగా ఉండేది. అందువల్ల రాజులందరూ తాము పాలించిన భూభాగం మొత్తం తమ సొంత ఆస్తిగా చెప్పుకోవడం ప్రారంభించారు. పృథ్వీపతి, ధరణీపతి వంటి పేర్లు, గుర్రం తిరిగినంత నేల స్వాధీనం చేసుకోవడం, లేదా దానం ఇవ్వడం, రాజ్యం అంటే నాలుగు దిక్కుల సరిహద్దులు చెప్పి, మధ్యలో ఉన్న భూమి అంతా ఆ రాజ్యమే, ఆ రాజుదే అనడం అందువల్లనే. కాని ఆ రాజులలో ఏ ఒక్కరూ పుట్టుకతో ఆ భూమి తీసుకురాలేదు. ఆ భూమిలో ఎన్నడూ తమ చెమట చిందించలేదు. చాలా మంది రాజులకు తమదని చెప్పుకునే భూమి ఎక్కడెక్కడ, ఎలా ఉందో కూడా తెలియదు. ఆ భూమి ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఆ నేలలో తమ నెత్తుటిని చెమట చేసుకుని రాజనాలు పండించిన రైతుల అధీనంలోనే ఉంది. లేదా అప్పటికి వినియోగంలోకి రాకుండా భవిష్యత్‌ అవసరాల కోసం అలాగే సామూహిక, సామాజిక ఆస్తిగా ఉండిపో యింది. అంటే భూమి దున్నే రైతులదీ, సమాజానిదీ మాత్రమే అనేది చారిత్రక సత్యం. రాజులదీ, పాలకులదీ, ప్రభుత్వా నిదీ అనేది అసత్యం.

అసత్యాలే సత్యాలుగా చలామణీ అయ్యే రాచరికపు సంప్రదాయంలోనిదే హైదరాబాద్‌ అసఫ్‌ ‌జాహీ రాజ్యం కూడా. ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాల హైదరాబాద్‌ ‌రాజ్య విస్తీర్ణంలో యాబై రెండు లక్షల ఎకరాలను రాజు తన సొంత ఖర్చుల, సాదర ఖర్చుల అవసరాల కోసం అట్టి పెట్టుకున్న సొంత భూమి (సర్ఫ్-ఎ-‌ఖాస్‌) ‌గా ప్రకటించుకున్నాడు. సర్ఫ్-ఎ-‌ఖాస్‌ ‌తో పాటు, మొత్తం రాజ్యంలో కనీసం మూడో వంతు భూమి, దాదాపు రెండు కోట్ల ఎకరాలు పాయెగాలు, ఉమ్రాలు, జాగీర్లు, సంస్థానాలు, ఎస్టేట్లు, మక్తాలు, ఇనాముల పేరుతో ప్రభువర్గంలో భాగమైన వారి సొంత ఆస్తిగా ఉండేది. ప్రతి గ్రామంలోనూ అంగబలం, కులబలం, అర్థబలం, ప్రభుత్వ ప్రాపకం ఉన్న భూస్వాముల కింద వందలాది, వేలాది ఎకరాలు ఉండేవి.

హైదరాబాద్‌ ‌రాజ్యం మీద 1948 సెప్టెంబర్‌ 17‌న సైనిక చర్య జరిగి, రాజ్యంలో సైనిక పాలన ప్రారంభమయిన తర్వాత ఇంత విస్తారమైన భూమి రాజు సొంత పేరు మీద, ప్రభువర్గీయుల దగ్గర ఉండడం చూసి సైనిక ప్రభుత్వమూ, కేంద్ర ప్రభుత్వమూ కూడా ఆశ్చర్యపోయాయి. పదవీచ్యుతుడైన రాజు పేరు మీద, రాజు ఆశ్రయంలో వేలాది ఎకరాలు భూమి సంపాదించిన ప్రభు వర్గీయుల పేరు మీదనో ఈ భూమి ఉండడం అనుచితమని కేంద్ర ప్రభుత్వం అనుకుంది. సైనిక ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలకు 1949 ఫిబ్రవరి 22న సర్ఫ్-ఎ-‌ఖాస్‌ ‌రద్దు ఫర్మానా విడుదల అయి, ఒక్క కలం పోటుతో యాబై రెండు లక్షల ఎకరాల భూమి హైదరాబాద్‌ ‌ప్రభుత్వానికి, అంటే అప్పటి సైనిక ప్రభుత్వానికి, లేదా దాన్ని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వానికి దక్కింది. సర్ఫ్-ఎ-‌ఖాస్‌ ‌భూమి మొత్తం రాజ్యంలో 1961 గ్రామాల్లో ఉండగా, అందులో 789 గ్రామాలు తెలంగాణలోవే. అందులో మళ్లీ 573 గ్రామాలు అప్పటి అత్రఫ్‌ ‌బల్దా జిల్లా (హైదరాబాద్‌ ‌చుట్టుపట్ల) లోవే. అలాగే 1949 ఆగస్ట్ ‌లో జారీ చేసిన ది హైదరాబాద్‌ (అబాలిషన్‌ ఆఫ్‌ ‌జాగీర్స్) ‌రెగ్యులేషన్‌ 1356 ‌ఫస్లీ అనే చట్టం ద్వారా 967 జాగీర్లకు చెందిన ఒక కోటీ అరవై నాలుగు లక్షల ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఆ వివరాల లోకి పోవడానికి ఇక్కడ అవకాశం లేదు గాని, రాష్ట్ర రాజధానిలోనూ, రాష్ట్రంలోనూ వేలాది, లక్షలాది ఎకరాల భూమికి మొదట హైదరాబాద్‌ ‌ప్రభుత్వమూ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వమూ హఠాత్తుగా యజమాని అయిపోయాయనేది ఇక్కడ గుర్తించాలి. ఈ కొత్త నడమంతరపు సిరి యజమాని సమాజపు ఆస్తి అయిన భూమిని సమాజం కోసం పరిరక్షించవలసిన, నిర్వహించవలసిన బాధ్యత విస్మరించి, దాన్ని అడ్డగోలుగా తన ఆశ్రితులకు అప్పగించిన సుదీర్ఘ విషాద చరిత్ర ఎంతో ఉంది. ఆ క్రమంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికీ, సామాజిక అవసరాలకూ కేటాయించిన భూములు కూడా ఉన్నాయి. అందులో ఒకటే హైదరాబాద్‌ ‌విశ్వవిద్యాలయం. 1969 జై తెలంగాణ ఉద్యమం తర్వాత, ఆ ఉద్యమపు మూలాలు తెలంగాణ విద్యార్థుల విద్యావకాశాల కొరతలో ఉన్నాయనే గుర్తింపుతో ఆరు సూత్రాల పథకంలో హైదరాబాద్‌ ‌లో కేంద్ర విశ్వవిద్యాలయం స్థాపిస్తామని ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు.

అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ విశ్వవిద్యాలయం కోసం 2324 ఎకరాలు కేటాయించింది. అదేమీ ప్రభుత్వం తన సొంత ఆస్తిని ఇవ్వడం కాదు, సమాజపు ఆస్తికి నిర్వాహకురాలిగా ఉండిన ప్రభుత్వం ఆ ఆస్తిలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇచ్చింది. విశ్వవిద్యాలయం అనేది ఎప్పటికప్పుడు విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతూ ఉంటుంది గనుక, విద్యార్థుల విజ్ఞాన, సమతౌల్య అభివృద్ధికి ఆహ్లాదకరమైన వాతావరణం అవసరం గనుక, ప్రపంచవ్యాప్తంగానే విశ్వవిద్యా లయాలకు విశాల స్థలాలు కేటాయించడం ఆనవాయితీ. ప్రభుత్వానికి సాధారణంగా అలవాటయిన అలసత్వంతో, విశ్వవిద్యాలయ అధికారులు కూడా జాగరూకంగా ఉండకపో వడంతో ఆ భూమిని విశ్వవిద్యాలయం పేరు మీదికి బదిలీ చేయ లేదు. నిజానికి ఆ భూమి ప్రభుత్వానిదీ కాదు, కచ్చితంగా చెప్పా లంటే విశ్వవిద్యాలయానిది కూడా కాదు, సమాజానిది. సమాజానికి అవసరమైన భవిష్యత్తరాల అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయంగా కేటాయించిన భూమి అది. కాని ఇప్పుడు అది ఎవరి పేరు మీద పట్టా అయింది అనే అనవసరమైన విషయాన్నే పాలకులు వివా దంగా మారుస్తున్నారు.

గడిచిన యాబై ఏళ్లలో ఆ భూమి లోంచి ప్రభుత్వం అప్పుడు కొంతా, అప్పుడు కొంతా కొన్ని వందల ఎకరాల భూమిని చిలక కొట్టుడు కొట్టి ఇతరులకు ఇస్తూ వచ్చింది. అటువంటి భూమి పందారాలు అతి ఎక్కువగా జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిత్వ కాలంలో ఒక బోగస్‌ ‌క్రీడా సంస్థకు, ఆ సంస్థ ఏర్పడిన నాలుగైదు రోజులలోనే నాలుగు వందల ఎకరాలు కట్టబెట్టారు. ఆ సంస్థ ఏర్పాటు, ఆ సంస్థ బాధ్యుడిగా చెప్పుకున్న వ్యక్తి పూర్వాపరాలు అన్నీ అప్పుడే వివాదాస్పదమయ్యాయి. ఆ భూమిని వెనక్కి తీసుకుంటామనేది ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌వాగ్దానంగా మారింది. అలాగే తర్వాతి ముఖ్యమంత్రి వై ఎస్‌ ‌రాజశేఖర రెడ్డి ఐఎంజి భారత్‌ ‌తో ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఒక చట్టం చేశారు. ఆ రద్దు చెల్లదని ఐఎంజి భారత్‌ 2006‌లో హైకోర్టులో సవాల్‌ ‌చేయగా, 2024 మార్చ్ 7‌న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే, జస్టిస్‌ అనిల్‌ ‌కుమార్‌ ‌జూకంటిల ధర్మాసనం ఆ పిటిషన్‌ ‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ ‌చేస్తూ ఐఎంజి భారత సుప్రీంకోర్టులో స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌వేయగా జస్టిస్‌ ‌జె కె మహేశ్వరి, జస్టిస్‌ ‌సంజయ్‌ ‌కరోల్‌ ‌ల ధర్మాసనం మే 3న దాన్ని కొట్టి వేసింది.

ఈ తీర్పుల సారాంశాన్ని తప్పుగా అన్వయిస్తూ, ఆ భూమి ప్రభుత్వానిదే అని హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పాయని ప్రభుత్వం వాదిస్తున్నది. నిజానికి ఈ రెండు తీర్పులలోనూ 2003 నాటి కాంట్రాక్టు చెల్లుతుందా లేదా అనేది మాత్రమే వివాదం జరిగి, చెల్లదు అని తీర్పులు వచ్చాయి. భూమి ఎవరిది అనే చర్చ జరగనే లేదు. దాని మీద తీర్పూ రాలేదు. మరి 2003లో ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వానికీ, ఐఎంజి భారతకూ కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసిన చట్టం చెల్లదు అన్న తర్వాత, ఆ భూమి ఎవరిదని తేలినట్టు? ఈ కేసు నడుస్తున్న సందర్భంలో విశ్వవిద్యాలయం కూడా ఇంప్లీడ్‌ అయి, తన భూమి తనకు వెనక్కి ఇప్పించమని పిటిషన్‌ ‌వేస్తే బాగుండేది. అప్పటికీ ఇప్పటికీ విశ్వవిద్యాలయ అధీనంలో ఉన్న భూమి మీద, అడవిగా పర్యావరణ రక్షణగా ఉన్న భూమి మీద, భవిష్యత్‌ ‌తరాల వినియోగంలో ఉన్న భూమి మీద ప్రభుత్వానికి ఎంతమాత్రమూ హక్కు లేదు. దాని పట్టా ఎవరి పేరు మీద ఉన్నది అనేది చర్చనీయాంశమే కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page