మామునూర్‌ ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ఎవరిది ?

 నేటికి సరిగ్గా రెండేళ్ళనాటికి ఉమ్మడి వరంగల్‌ ‌మామునూర్‌ ‌విమానాశ్రయాన్ని వినియోగంలోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు మంగళవారం చేసిన ప్రకటనపై ఆ క్రెడిట్‌ ‌తమకే దక్కుతుందని రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తగవులాడుకుంటున్నాయి. తమ కృషివల్లే అది సాధ్యమైందని కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఏకంగా తమ కేంద్ర నాయకుల చిత్రపటాలకు గురువారం పాలభిషేకాలు చేశాయి. బిజెపి కార్యకర్తలు పిఎం నరేంద్రమోదీ చిత్రపటానికి, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సోనియా ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. దీంతో మామునూరు విమానాశ్రయ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు జోక్యంచేసుకుని ఇరువర్గాలవారిని అక్కడినుండి పంపించివేశారు. కాగా  కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలను అన్నిరంగాల్లో అభివృద్ధిపర్చే ఉద్దేశ్యంతో వివిధ రాష్ట్రాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయడంలో భాగంగానే మామునూరు విమానాశ్రయంపై శ్రద్ద తీసుకుందని, అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఈ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నదంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత దేశ వ్యాప్తంగా 90కి పైగా ఎయిర్‌పోర్టులను ప్రారంభించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.  2021లోనే నాటి విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య మామునూరు  ఎయిర్‌పోర్టు అభివృద్ధి విషయంలో నాటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారన్నారు.
 మరోవైపు , తొమ్మిది దశాబ్ధాల నాటి ఈ విమానాశ్రయాన్ని పునరుద్దరించే విషయంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్రంతో అనేక ఉత్తరప్రత్యుత్తరాలు జరపడంతోపాటు, అందుకు కావల్సిన భూ సేకరణ ప్రక్రియను తమ ప్రభుత్వం ప్రారంభించడంద్వారా తమకే ఆ క్రెడిట్‌ ‌దక్కుతుందంటోంది భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌). ఈ ‌మేరకు ఆ పార్టీ నాయకులు వినయ్‌భాస్కర్‌, ఆరూరి రమేష్‌, ‌నరేందర్‌లు తాము చేపట్టిన భూ సేకరణ మద్యలోనే ఉండగా ఎన్నికల కోడ్‌ అడ్డువచ్చిందని, అందుకే పూర్తి చేయలేకపోయామన్నారు. దాదాపు 90 సంవత్సరాల క్రితం 1930లో నాటి నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌చే నిర్మించబడిన ఈ మామునూరు విమానాశ్రయం దాదాపు 1981 వరకు పౌరులకు  సేవలు అందించింది. భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ 1959లో వరంగల్‌లోని నాటి ఆర్‌ఇసి నేటి నిట్‌ను ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. 1962 భారత, చైనా యుద్ధ సమయంలోకూడా భారత సైన్యం దీన్ని వినియోగించుకుంది.  ఆ తర్వాత కాలంలోకూడా పౌరుల వినియోగంకోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కాని ఆ సేవలు అర్దాంతరంగానే మిగిలిపోయాయి.
   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీని పునరుద్దరణగురించి పెద్దగా తీసుకున్న చర్యలులేవు. పైగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ‌విమానాశ్రయం నిర్మించిన సందర్భంగా దానికి 150 కిలో మీటర్ల దూరంలో మరే ఇతర కమర్షియల్‌ ఎయిర్‌పోర్టును నిర్మించరాదని జిఎంఆర్‌ ఒప్పందం చేసుకున్న దర్మిలా దాని పునరుద్దరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అనేక విజ్ఞప్తుల మేరకు జిఎంఆర్‌ ‌నిబంధనను తొలగించినప్పటికీ భూ సేకరణ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. వాస్తవానికి నిజాం నిర్మించినప్పుడు దీని పరిధిలో 1875 ఎకరాలుండగా, తర్వాత కాలంలో 950 ఎకరాలు మిగిలింది. దానికి మరో 253 ఎకరాల స్థలం అవసరమని ఎయిర్‌ ‌పోర్టు అథార్టి ఆఫ్‌ ఇం‌డియా పేర్కొనడంతో చుట్టుపక్కల ఉన్న గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాలనుండి భూ సేకరణ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో పూర్తి అయింది. దీంతో మరో రెండు వారాల్లో  ఎయిర్‌పోర్టుకు సంబందించి  రన్‌వే విస్తరణ, విమానాల పార్కింగ్‌ ‌బేలు, టెర్మినల్‌ ‌బిల్డింగ్‌, ‌కారు పార్కింగ్‌, ఎయిరోసిటీ, పైలెట్లు, ఇతర సిబ్బంది వసతి గృహాల నిర్మాణాలకు సంబందించిన టెండర్లను పిలవనున్నట్లు రామ్మెహన్‌ ‌నాయుడు తెలిపారు. 90 ఏళ్ళ ఈ విమానాశ్రయ పునరుద్దరణకోసం గత దశాబ్దంన్నరకు పైగా చేసిన కృషి చివరి అంకంలోకి చేరినట్లైంది.
వరంగల్‌ ‌మొదటినుండి రాజకీయంగా చైతన్యవంతమైన నగరంగా పేరున్నప్పటికీ ఇక్కడ రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, టెక్స్ ‌టైల్‌ ‌పార్క్, ఐటి పార్క్‌తో పాటు ఎయిర్‌పోర్టును సాధించుకోవడానికి దశాబ్ధాల కాలం పట్టింది. హైదరాబాద్‌ ‌తర్వాత ముఖ్య నగరంగా పేరున్న ఉమ్మడి వరంగల్‌ ‌వాస్తవానికి విద్యా వైద్య కళారంగాల్లో పేరున్నది. ప్రపంచ ప్రసిద్దిగాంచిన కాకతీయ శిల్పకళ విరాజిల్లిన ఈ నగరానికి ఎయర్‌పోర్టు సమకూరినట్లైతే వరంగల్‌ ‌త్వరితగతిన మరింతగా అభివృద్ధి చెందే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *