పద్యం ఇంకాసేపట్లో మరణిస్తుంది
చూడు పద్యం ఎలా గింగిర్లు కొడుతుందో
మొదటి రెండు పంక్తులు కూలిపోయాయి
మధ్యలో చరణం నొప్పి భరించలేక
బంతిలా మారిపోయింది
ప్రతి పదపు స్వేద రంధ్రాల నుండి
రక్తం పారుతుంది
కొన్ని పదాలు మట్టిలా ఎండిపోయాయి
కాగితం, ముక్కలు ముక్కలై పోయేట్లుగా
పటపటమంటున్నాయి
పదాల శరీరాలు మండుతున్నాయి
ఎటు చూసినా పొగతో నిండిపోయింది
అయితే కొన్ని పదాలు
అచ్చం చనిపోయినట్లే
గాఢ నిద్రలో ఉన్నాయి
చుట్టూ ఏం జరుగుతుందో
వాటికి అస్సలు అవగాహన లేదు
కొన్ని పదాలు
తప్పించుకోవడానికి యత్నిస్తున్నాయి
అయితే, అవి కాగితం నుండి పారిపోలేవు
కొన్ని తమను తాము
కావాలనే గాయపరచుకొని
రక్తపు మడుగులో జీవ రహితంగా పడిపోతాయి
చివరి పంక్తి రక్తపు వర్షంలో తడిసిపోతుంది
ఇంతకీ, ఎవరు రాశారు
ఈ వెంటాడే కవితని?
-అస్సామి మూలం : నీలిమ్ కుమార్
-తెలుగు అనువాదం : రమేశ్ కార్తీక్ నాయక్
-తెలుగు అనువాదం : రమేశ్ కార్తీక్ నాయక్