విద్యా ప్ర‌మాణాలు పెంచ‌డ‌మే ల‌క్ష్యం

*  భాషా ప‌రిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు నేర్పించాలి
* ప్ర‌తి పాఠ‌శాల‌లో నిర్ధిష్ట సంఖ్య‌లో విద్యార్థులు ఉండాలి
* విద్యార్థుల న‌మోదుపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి
*  డే స్కాల‌ర్స్‌కు గురుకుల స‌దుపాయాలపై అధ్య‌య‌నం చేయాలి
* విద్యా శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి

 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాలు పెంచ‌డ‌మే  త‌మ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ‌, ఇత‌ర స‌దుపాయాల క‌ల్ప‌నకు ఎంత ఖ‌ర్చ‌యినా వెనుకాడేది లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్ల‌లున్న గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠ‌శాల‌లు ప్రారంభిస్తున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు. పాఠ‌శాల‌లు పునః ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఐసీసీసీలో విద్యా శాఖ అధికారుల‌తో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేరిన ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందేలా వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దాల‌ని సీఎం ఆదేశించారు.
ఈ క్ర‌మంలో బోధ‌నా ప్ర‌మాణాల పెంపున‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను అధికారుల‌కు సూచించారు. విద్యార్థులకు భాషా ప‌రిజ్ఞానంతో పాటు నైపుణాల పెంపున‌కు వీలుగా విద్యా వ్య‌వ‌స్థ‌ను మార్పు చేయాల‌ని ఆయ‌న‌ సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల‌కు నైపుణ్యాభివృద్ధి క‌ల్పిస్తే భ‌విష్య‌త్‌లో వారు త‌మ‌కు ఇష్ట‌మైన రంగంలో రాణించే అవ‌కాశం ఉంటుంద‌ని  అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణలో ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా సాగుతున్న నేప‌థ్యంలో విద్యా శాఖ పుర‌పాల‌క శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిప‌ల్ లేఅవుట్ల‌లో సామాజిక వ‌స‌తుల కోసం గుర్తించిన స్థ‌లాల్లో పాఠ‌శాల‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కు ఉన్న వివిధ విద్యా సంస్థ‌ల‌ను హేతుబ‌ద్దీక‌రించి ప్ర‌తి పాఠ‌శాల‌లో నిర్ధిష్ట సంఖ్య‌లో విద్యార్థులు ఉండేలా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
నాణ్య‌మైన భోజ‌నం, యూనిఫాంలు, పాఠ్య పుస్త‌కాలు అందిస్తుండ‌డంతో పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నార‌ని, డే స్కాల‌ర్స్‌కూ ఆ పాఠ‌శాల‌ల్లోనే అవ‌న్నీ అందించే విష‌యంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పిల్ల‌ల‌కు కుటుంబం, స‌మాజం ప్రాధాన్యాన్ని వివ‌రించ‌డంతో పాటు కుటుంబం, సమాజం ప‌ట్ల వారి బాధ్య‌త‌ను తెలియ‌జేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మాన‌సికంగా దృఢంగా త‌యార‌వ‌డంతో పాటు బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా రాణిస్తార‌ని సీఎం అన్నారు. స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, సీఎం కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి శ్రీ‌దేవ‌సేన‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌ర‌సింహారెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page