తియ్యతీగలనిప్పు… దీర్ఘచింత బాణాల “కుంపటి”

ఒత్తిడీ ఒరిపిడీ … ఉమ్మనీరులో ఓలలాడించడానికి నాన్న పట్టుకున్న బతుకుదివ్వే ….ఈ కుంపటి
యోజనాల రశ్మీతీర్థంలో సూర్యగోళానికి బతుకువచనాలిచ్చిన ఆహనబెంగ… తధాలత కల్వంలో నూరిపోసుకున్న శ్వాసలకి ప్రతిపదార్థం… కుంపటి…
కదలాడే దీపకొండల్లో రాత్రి జాముని ఊదుతూ… పచ్చి కలల వేడిమి అంచుల్లో వర్ణమాయకై కరిగే ద్రవనర్తన…సమసంచయం… పరిస్తంభన. విస్మృతిలోని ధూపం …సమయంలోకి ఊదిన మహా వేడీ దుఃఖస్థలంలోని బిడ్డ… సంయమ జోరులోని విఖిల ధూపయజ్ఞం… చేతులభాషణ… ప్రయాస  కల్హం లో  ఇంటి వేడుకని నిందించే శత్రుపహార.. అదేరో నిస్వరం భూగొంతుకలోకి… శరీరస్థితికై ఊపిన బుగులు

పుట్టురోష్ణ విమగ్న ధృతి రాజేయ…లోహద్రవాల ఎర్రని బంగారం లోంచి మెరిసే కన్ను… రెండోయానంలోని మహానైవేద్యం…
గోపురవాడల్లో దేహతీర్థం… ఆది సంకీర్తనలకు తిప్పినపొగ… సమయమితి అల్లిన దుఃఖస్థలంలో అతనింకా ఊదడాన్నే …మాటలన్నీ పొగగొట్టంలొంచే  ఆశీస్సులుగా మారి నిద్ర స్థలంలో బీడువారిన నగలతో పోటోలు…

సామరస్య అధీగాహన… నిర్ణయదేహం  లోని  శ్వాసకవ్వంగా చిలికిన మహానీలపుకొండ
సెగసంపూర్ణాల తీవ్రమృతనివేశం… సంజీవ అమృతాలతో పుట్టు తాళ్లు పెనవేసిన పూర్ణ ప్రవేశిక కుంపటి
ఇదొక వైవిధ్య శిలాయానం. రంగుమొరల బంగారు తీగపై చిత్రపూతల బ్రహ్మజెముడుకి పువ్వుని గుచ్చే …భృతి-కళ.. స్త్రీ అనోహంలోంచే మెరిసే వాన మొవ్వుల గుజ్జు.. చెమట కుండలో పుట్టిన బొగ్గు మడుల బిడ్డ…మెళ్ళో తాళిలా మెరిశాక  నేత చీరల బజారులో నిండా మోసుకున్న మల్లెల గుసగుస.. వాన బుగ్గలో వెచ్చని ముద్దు సలికిడి…
నిర్వేదంలో నుంచి మహాసారాల అన్నంముద్ద మింగినట్లు.. అనేకానేక కృతజ్ఞతల వత్తిడి…
ఇంకేం ఇవ్వాలి కవిత్వం?
నాన్న…అన్నమిచ్చిన మహాపళ్ళెం.. విశ్వాన్ని చితికళాయిలోతిప్పి బయటకు తీసిన ఇంద్రధనుస్సుల నగకి గర్భసంచి… ఊపిరిసంచిలోంచి vocal cards ని చేరే గాలి నిందలన్నీ మోగిస్తున్న ఆభరణ చివుళ్ళలో కన్నుచిందాడుతున్న చిత్రగర్భాలకి దిష్టిచుక్కగా…నాబిడ్డకి ఆబూడిదలోంచి చిటికెడు ఇవ్వండి… వేలవర్ణాల నవ్వుతో పుట్టిన వీధులన్నీ మళ్ళీ దీపాలతో వెలగడం చూస్తూ…ఈ కుంపటిని నెత్తిమీద పెట్టుకొని సంబరంగా ఊరేగుతాను

నాకు నేను దొరుకుతాను మా అమ్మమ్మ కుంపటిపై వoడే పప్పు మాగుతున్న వాసన ఊపిరిలో బరువెక్కి…
శ్రీనివాస్ మీరు నన్ను నాకిచ్చారు.. కొబ్బరిచెట్ల కింద అతిధులకు వండివార్చే గాడిపోయి పక్కన మట్టిపాత్రలో ఉడికిన కుంపటి పప్పుకి నెయ్యి కలిపి తినిపించిన అమ్మమ్మ చేతి గాజులు పుట్టింది ఈ కుంపటిలొంచేనని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది… ఒక్క ఫోటోనైనా మిగిల్చుకోనందుకు దుఃఖమూ ముంచుకొస్తుంది
సార్థసత్తువల మహాభూమిలోంచి వేడుకకి కన్నుని తెరవడం మొదలైనప్పుడు.. ఓ మంత్రనగరానికి బంగారు తాపడం చేస్తున్న కుంపటి లోంచి మాయాచేతులు గర్భనివేశం చేసిన అదృశ్యస్మృతి పంచలో తిరిగి అన్నం ఒడ్డించమంటాయి.
బొగ్గు పిండిన చేతులు… తీగలు కోసిన రేఖలు… నిప్పుకందిన పెదాల్లోంచి… వేడిమచ్చల నాలిక రుచి అడిగి ఎంగిలి ముద్దని ప్రసాదంగా నాకు ఒడ్డిస్తోంది.
ఊపిరికొసల లోపలి తిత్తుల్లోకి ఊదుతూ .. నాన్ననింపిన ఇల్లు నిప్పులపై కాలుతున్న చెట్టు.. ఛాయా లాలమ మోగిన ఎర్రగన్నేరుల చీకటి.  బావి వెనుక  పొగ ఇంకా ఆరని కుంపటి నుంచేనని… భయం వదిలి నా లోపలి వాక్యం ఆరబెట్టుకుంటుంది.
ఎర్రని అమ్మ బొట్టులోంచి రాలిన కుంకుమ…ఎర్రబొగ్గై ఏడుస్తూ…ఇంకా నా దోసిలిలో కాలుతూనే ఉంది. ఛాతిలోపల దిగులుతిత్తికి పట్టిన బొగ్గుజిడ్డులో నల్లదగ్గు. చేతిని  నింపిన బంగారు కంకణం. బొగ్గుబొమ్మలకు  కట్టిన నల్ల చీరల ఉస్త్వమ్వంలో కుంపటి తెల్లార్లూ ఊరేగుతూనే ఉంది.

శ్రీనివాస్ ఇది పూర్తిగా మీ సంతకం. మీ పునాది. మీ పునారవ వ్యక్తం లోని ఆధార గమ్యం. నాన్న ఊపిరికి పుట్టిన ఆది కలువలకి చెమట నిచ్చిన అలంకారం
నేరుగా పెనవేసుకున్న మట్టిలోంచి… నిద్ర వాయిద్యాల వాన తెమ్మెరలోను ఆరిపోకుండా ఊదే శ్వాసకోశాలు నిద్రాణస్థితి.
మహా పుట్టుక… కళలోంచి తావిమోసిన మంగళముద్రతో అమ్మను కన్న నాన్న. సదా వివశంలో సర్వస్వయాత్రతోను వెన్నుకి చుట్టుకున్న ఆకలిపుండు-కుంపటి.
అసాధారణమంతా సాధారణ లోంచే ఉంది. నిరామయ దేహకక్ష్యలోంచి నాన్న ఆశీస్సు కోసమైన ఓ కుంపటిమీ ఇంట్లో నిరంతరం తెలగనివ్వండి.ఆవిరి చిత్రాల పొగలోంచి పురానవ శరీరాల జన్మస్థలాలన్నింటికీ ఆ కుంపటిలోని బూడిదతో  మొదటిబొట్టు పెట్టండి. సాపేక్షస్థితి నిర్మాణాలపై భుజం ఆసరా ఇచ్చిన శరీరాల వంతులో  చీకటి వడపోయండి.
నిర్యాణమూ … నిర్మాణము… నిద్రాణము….. ప్రతీక ప్రత్యక్షంలోని నిద్రమెరుగుల కలలోంచి మెలకువలు ఉలిక్కి పాటుతో  ఊడుతున్న శబ్దమే ఇక చూడగలం.
ఇప్పడిక కుంపటి ఎక్కడ కనిపించినా తలొంచి మొక్కాలనిపిస్తుంది. రాని ఏ చితి పద్యాన్నైనా గొంతెత్తి పాడాలనిపిస్తుంది. నన్ను నేనుకి తప్పిపోయిన ఆ పాత వసారాలో లైట్లన్ని ఆర్పి కుంపటి వెలిగించి… ఆ వెలుగులోకి… అద్దంలో కనిపించిన నాలోకి నేను వెళ్ళిపోయి.
మీకు  కృతజ్ఞతలు ఎప్పటికీ చెబుతూనే ఉండాలనిపిస్తుంది
బి.ఎస్.ఎం. కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page