సామాజికతను స్పష్టంగా ప్రతిబింబిస్తూనే నిర్మొహమాటంగా తన భావాల్ని కవిత్వీకరిస్తున్న కవి ప్రముఖుల్లో ముఖ్యులు రేడియమ్ . జీవగణితం పేరుతో వెలువడిన ఆయన కవిత్వం భాష మీద సాధికారతతో, నవ్యతతో సాగింది. ఇందులోని 81 కవితలు కవిగా ఆయనలోని భిన్న పరిశీలనా పార్శ్వాలను ప్రతిబింబించాయి. కవిలోని సునిశిత అంతరంగిక దృష్టికి తార్కాణాలుగా నిలిచాయి. అవసరమైన క్లుప్తతను కవితలలో పాటిస్తూనే నూతనత్వంతో కూడిన విశిష్ట పదబంధాల ప్రయోగం కూడా కవిపరంగా జరిగింది.
వంకలు లేని బతుకు / పంకమంటని బతుకు / పండువెన్నెలే కదా? అని కౌముది అన్న తొలి కవితలో బతుకంటే ఏమిటో స్పష్టంగా కవి చెప్పారు. తిరుగుబాటు, ధైర్యం జనం బాటకు ప్రగతిగీతం అని అన్నారు. పద్యపరమార్థం పదవి, పైకం,మైకం కాకూడదని ఘాటుగా చెప్పారు. మారవు చరిత్ర చిత్రాలు అవి మిగులు బాధల విచిత్రాలు అని తేల్చారు. సంపాదించుకున్న అభిమాన సంపాదన తోడుంటే అంతా ఆనందమే అన్నారు. సుఖదుఃఖాలను జీవన వాహికలుగా చెప్పారు. మేలు చేయువాడు మేలిమి బంగారం అని, కీడు చేయువాడు చీడపురుగు అని నిర్మొహమాటంగా చెప్పి మనిషి నోటి మాట క్రాంతి బాట కావాలని ఆకాంక్షించారు. బాధను తీర్చి ఓదార్చే మలయ పవనం వంటిది స్నేహం అని నిర్వచించారు. బంధాల పూలహారమే జీవనసారమని వివరించారు. తూకంలో కొత్త రకపు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తరాజా మజాకా కవితలో తెలిపారు. తూకం ఏదైనా గ్రాహకులే బలి అని గమనించమని ప్రజలను హెచ్చ రించారు. పెళ్లి తంతు ఒక్కటే అంటూనే ఆశల దీపాలు కలిసి ఆకాశాన వెలిగే రవిబింబం అవ్వాలని అన్నారు. సమాజంలోని పోకిరిని ఉప్పులేని సముద్రపు దిబ్బతో పోల్చి చూపారు.
ఉద్దర మాటలు ఊరు దాటవు, ఊతమియ్యవు, ప్రణాళికలు గాలికి / ప్రసంగాల ప్రహసనాలు / మాయని ఆకలి గాయాలు అని నాల్గు మాటలు కవితలో రాజకీయులకు చురక లంటించారు. రాత్రి పాషాణం కరిగితే ఉషోదయ గీతం పల్లవిస్తుందని అన్నారు. గుల్దస్తా కవితలో గుల్జార్ కవిత్వానికి గులాబీల పరిమళం అద్దారు. వేము అంత చేదయినా ఆరోగ్య భూషణమే అని చెప్పారు. పెరిగి తరిగేదిలో కరిగిపోయేది వయస్సు అని తెలిపారు. ఆశ నిండిన ఎదురుచూపు తప్పక వెలుగును పొందుతుందని భరోసా ఇచ్చారు. బుద్ధి డబ్బు మేసిన తీరుగా ఎన్నికల ప్రసంగం మారిపోయిందని వేదనపడ్డారు. కులం కోట్లు, కరెన్సీ నోట్లుగా ఓట్ల జాతర మారి గద్దె కోసం తండ్లాట భీకరమై కూర్చుందని అన్నారు. నీ చేతిలోని ఓటుతో కొత్త దీపం వెలిగించు అని ఓటరుకు సూచన చేశారు. తేనె మాటలు,సొరకాయ కోతల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతిలోని సేవా తత్పరతను మనిషి గ్రహించాలన్నారు. రాలే కధల్లో పండిన సత్యాల పచ్చలను దాచుకోవాలని సూచించారు.
ఆకుపచ్చతనం ఇప్పుడు మనిషికి కావాలని చెప్పారు. ఓటరుకు ప్రతిసారి నేతలతో వాగ్దానాల వాయిదాల రాగం తప్పడం లేదని అన్నారు. మదిని తాకే మాటలు మమతలు పెంచుతాయని చెప్పారు. ప్రజాస్వామ్య వెలుగుల అడుగులు తిరుగమనం వైపా అని ప్రశ్నించారు. శతాబ్దాలు గడిచినా మార్పు లేదే అని బాధపడ్డారు. ప్రతికూలతల మధ్య ఆధునిక అసమర్ధుడుగా మారిన మనిషి రేపటి విస్ఫోటనం కాక మానడు అని చెప్పారు . సహనం సమానతతో సర్వమానవాళి గౌరవం పొందాలని అన్నారు. అక్కరకు రాని కవితలు మక్కువతో చదివినా ఫలితం లేదని చెప్పారు. నీటి కొరత బాధలలో జనత ఉందని, ఆ సమస్యను తీర్చాల్సిన బాధ్యతని ప్రభుత్వానికి గుర్తు చేశారు. పరిస్థితులకు ఎదురీతి నిలబడే వాడే కాలంతో సాగే మనిషి అని చెప్పారు. కరోనాను తరిమేందుకు నడువు ముందుకు అని ఒక కవితలో ధైర్యపు ఊపిరులు ఊదారు. ఎండను కాలానుభూతిగా చెప్పారు. మాటలే పుత్తడి విలువలు అని మరువకు తమ్మి అని హితవు పలికారు. శ్రమదోపిడి పై ఎగిసిన జయకేతనమే కార్మిక క్రాంతి అని చెప్పారు. రాజకీయ మంచె పైన బతుకు జీవుడా అన్నట్టుగా ప్రజల పరిస్థితి మారిందని తెలిపారు.
వోటు అంటే జన రాజ్యాంగమని నూతన అభివ్యక్తితో చెప్పారు. కీచులాటలు,కుర్చీ ఫీట్లతో రాజకీయం రణరంగంగా మారుతున్నదన్నారు. ప్రజాపక్షమే పత్రికల అభిమతం కావాలని చెప్పారు ప్రకృతి ధర్మం సదా ఆచరణీయమని తెలిపారు. లెక్క తప్పితే మిగిలేది చిక్కుల చితుకేనని చెప్పారు. ప్రేమ లేని విశ్వం, మిధునం లేని ప్రకృతి లేదన్నారు. కవి చలాన్ని ప్రేమ పవనంతో పోల్చారు. వసుధ పచ్చగా పరుగులు పెట్టాలని భావించారు. ఎన్నెన్నో ఎత్తు పల్లాలను చూసి గాయాల గేయమైన పోరాటాల మాతృ కైన తెలంగాణ నేలకు జయహో అన్నారు. జీవికి జీవన భుక్తి తప్పనిసరిగా దొరకాలి అన్నారు.
మూసీ తీర నివాసంలో భయంతో జనం, నేతల్లో మాత్రంచోద్యం అని వ్యాఖ్యానించారు . ఇప్పటి పరిస్థితులలో మనిషి మనిషిలా జీవించడమే లేదన్నారు. అద్భుత దీప కథలు నమ్మే కాలం పోయిందన్నారు. సామాన్యుల బతుకు కథలన్నీ చప్పగానే ఉంటాయని చెప్పారు. మత్తును తప్పనిసరిగా కాలబెట్టమని పిలుపునిచ్చారు. మందమతుల్ని మతిమతుల్ని చేయడం సాధ్యమే నన్నారు. యుద్ధం కాని యుద్ధంలో మరణించేవాడు సామాన్యుడేనని చెప్పారు. జీవన ఉత్ప్రే రకాలు మట్టి పరిమళాలు అన్నారు. రాక్షసక్రీడలకు చెల్లు చీటీ పాడాలన్నారు. ఓటరు ప్రజాస్వామ్య భవనానికి దిక్సూచి వంటి వాడని చెప్పారు. ఓటరు ఐదేళ్లకోసారి కనిపించే అతిధిగా పాత్రను నిర్వహిస్తున్నాడని కూడా వేదన చెందారు. దోపిడీ సింహాన్ని అంతం చేయాలని అన్నారు.
మనిషిని మనిషిగా ప్రేమించే తత్వం మహిలో పెరగాలని భావించారు. బహుజన అరుణ కిరణం ఇతిహాసానికి మంచి తరుణం అని చెప్పారు. మట్టి లేకపోతే మనిషి ఎక్కడ అని ప్రశ్నించారు. మండుతున్న ధరల ప్రపంచంలో సామాన్యుడి బతుకు విలవిల అన్నారు. చరిత్రలో దుఃఖపు పుటనే మనిషి కన్నీటి పాట అని చెప్పారు. శ్రమ దోపిడీ అంతమైతేనే జన జాగృతి మొదలవుతుందని అన్నారు. భూ భకాసురుల్లో హైడ్రా భయం చెలరేగించిందని చెప్పారు. భయం తొలగించుకొని నమ్మకం పెంచుకొని ఆశల మెట్లు ఎక్కుతూ ముందుకు సాగాలని చెప్పారు. కాళోజీకి కవితే శ్వాస అని చెప్పారు. విశ్వ మానవాళి ప్రగతికి శాంతి ఒక సోపానం అవుతుందని అన్నారు. జీవితం రసమయం అయ్యేదాకా జీవితపు పడవ ముందుకు సాగుతూనే ఉండాలని చెప్పారు. మార్పు కోసం కలం పట్టి కదలిన కథానాయకుడు సురవరం ప్రతాపరెడ్డి అని నివాళులర్పించారు. నిజం నిరంతర జ్వాల వంటిదని సూచించారు. ఆకలి పట్నం వైపు జనాన్ని నడిపిస్తే గ్రామం గల్లంతయిందని వేదన పడ్డారు.
చైతన్య జ్వాలా గీతికలు ఉదయిస్తే భయానికే భయం ఏర్పడుతుందని చెప్పారు. ప్రత్యూష రేఖలతో కొత్త రుతువు మానవజీవనంలోకి అడిగిడాలని ఆకాంక్షించారు. వర్తమాన దుస్థితి తొలగి వెలిగే దీపాల కాంతి వెల్లి విరియాలని అన్నారు. చెట్టు అంత విశాలంగా మనిషి కూడా ఎదగాలని చెప్పారు. మనిషి ఇప్పుడు మరొక యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. మారణ హోమాలు లేని మానవ కళ్యాణ ప్రపంచం కోసం పరితపన ప్రతి ఒక్కరిలో పెరగాలన్నారు. వ్యవహారిక భాషకు ఆదరణ పెరగాలన్న ఆర్తిని కవి కనపరిచారు. కవికి కవిత్వంతో ఉన్న సుదీర్ఘ అవ్యాజనుబంధం వల్ల ప్రతి కవిత పరిణత, ప్రమాణతతో పరిమళించింది. ఒకవైపు చెణుకులు, చురకలు వేస్తూనే అవసరమైన సందర్భాలను బట్టి దిశా నిర్దేశనాలు, భవిష్యత్తుకు మార్గదర్శనాలను ఈ కవి తమ కవితల ద్వారా అందించారు. ఆలోచనాత్మకమైన సరికొత్త పదప్రయోగాలు, ఎంపిక చేసుకొని జాగ్రత్తగా కూర్చిన పరిణత పదబంధాలు ఎన్నో ఈ సంపుటిలోని కవితల్లో దృశ్యమానమయ్యాయి.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764