కంఠం మీద క‌త్తి పెట్టినా నిజ‌మే మాట్లాడ‌తా

-కాళేశ్వరం రిపోర్ట్ ‌త్వరగా బయట పెట్టాలి
-తాత్సారం చేస్తే వదిలే ప్రసకక్తి లేదు
-తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు మహారాష్ట్ర ఒప్పుకోలే
-కేబినేట్‌ ఆమోదం తరవాత త్రీమెన్‌ ‌కమిటీ వేశారు
-కాళేశ్వరం నిర్ణయం మొత్తం కెసిఆర్‌దే
– బీజేపీ ఎం.పి. ఈటెల రాజేంద‌ర్‌

‌కాళేశ్వరం రిపోర్ట్ ‌త్వరగా బయట పెట్టాలని రిపోర్ట్ ‌విషయంలో తాత్సారం చేస్తే వదిలే ప్రసక్తి లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌ అన్నారు. కాళేశ్వరం విచారణ అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ  కంఠంపై తుపాకీ పెట్టినా ఈటెల నిజమే మాట్లాడ‌తాన‌ని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డిజైన్లు, నిర్మాణంతో సంబంధం ఉందా అని కమిషన్‌ అడిగిందని తనకేం సంబంధం లేదని చెప్పానన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌పై అధికారం ఉండేదా అని అడగ్గా తనకు ఎలాంటి అధికారం లేదని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం క్వాలిటీ  గురించి ఇంజనీర్లు చూసుకోవాలని  కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్‌ ‌నాయకత్వంలో కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ వేశారన్నారు. మంత్రివర్గ ఉపసంఘం, సీడబ్ల్యూసీ రిపోర్ట్ ఆర్థిక శాఖ ముందు పెట్టారని తెలిపారు. నిజాయితీగా ఉండాలని కోరే పార్టీ బీజేపీ అని ఎంపీ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్‌  అని ఆయనే చెప్పుకున్నారని.. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.

కాళేశ్వరంపై నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ అని,  అప్పుడు ఆయనే బాస్‌ అన్నారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానన్నారు. తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని చెప్పారు. 2006లో తుమ్మిడిహట్టి రూ.16 వేలు ఉంటే 2015లో రూ.38 వేల కోట్లకు పెరిగిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలని అనుకున్నా మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నారు. మూడు బ్యారేజీలు సీడబ్ల్యూసీ రిపోర్ట్, ‌టెక్నికల్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో కట్టారన్నారు. మూడు బ్యారేజీలు సబ్‌ ‌కమిటీ, టెక్నికల్‌ ‌కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారని వెల్లడించారు. మొదట రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయితే  రైతుల డిమాండ్‌ ‌మేరకు రూ.82 వేల కోట్లకు పోయిందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏ ‌పర్పస్‌ ‌కోసం పెట్టారని కమిషన్‌ ‌ప్రశ్నిస్తే.. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఫైనాన్స్ ‌శాఖకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు.

మా బతుకులో నిబద్ధత ఉంది… నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్టకాల్చి మీదేస్తే నాకేమీ కాదు’ అని అన్నారు. మూడు బ్యారేజీలు రూ.10వేల కోట్ల లోపే అని చెప్పారు. కాళేశ్వరం కమిషన్‌ ‌రిపోర్ట్‌ను త్వరగా బయటపెట్టాలని.. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం తేల్చాలని  రాజేందర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌విచారణ కొనసాగుతోంది. శుక్రవారం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌ ‌కమిషన్‌ ‌ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓపెన్‌ ‌కోర్టులో ఈటెలతో అంతా నిజమే చెప్తానని కమిషన్‌ ‌ప్రమాణం చేయించింది. అనంతరం కమిషన్‌ ‌ప్రశ్నలు సంధించింది. కమిషన్‌ ‌ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు- విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్‌, ‌డీపీఆర్‌పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్‌ ‌సంధించింది. కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని తెలియజేశారు. మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page