- సంబరాలు సరే.. హావిూల సంగతేమిటి?
- సవాల్ గా మారిన కౌలు రైతుల రుణాల సమస్య
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ఏడాది పూర్తి చేసుకుని ఘనంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంది. ఇందులో తప్పు పట్టవలసినది ఏవిూ లేదు. ఐతే, విజయోత్సవాలు జరుపుకునే సందర్భంలో తాము ఏం సాధించాం అనేది చెప్పడం సంప్రదాయం. ఈ సంవత్సర కాలంలో ఏమైనా పొరపాట్లు చేశామా, తప్పడు నిర్ణయాలు తీసుకున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సన సందర్భం కూడా ఇదే. అయితే అధికార పార్టీలు సత్సంప్రదాయన్ని పాటించటం లేదు అనేది నిజం. పాలక పార్టీలు బలహీనపడడానికి కారణం కూడా ఇదే. ఇందుకు బీఆర్‌ఎస్ ఓటమే ఒక పెద్ద ఉదాహరణ. అధికారంలో ఉన్నపుడు ఆత్మపరిశీలన చేసుకొని ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్లి వుంటే అంత సులభంగా ఓడిపోయేది కాదేమో. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కొన్ని వాగ్దానాలు చేసింది. గెలిచిన తర్వాత ఆ వాగ్దానాలను అమలు చేయడానికి నానా తంటాలు పడుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విూద వడ్డీలు కట్టడం, అలాగే అప్పులో కొంతభాగం తీర్చడంలో ఆర్థిక వెసులుబాటు లేకుండా పోయింది. రైతాంగం అప్పలు మాఫీ చేయడానికి ఎంత ఇబ్బందిపడ్డారో చూసాం. ఈ రుణ మాఫీ సైతం రైతులు అందరికీ చేయలేకపోయారు. ఇక కౌలు రైతుల రుణాల సమస్య తీవ్ర సవాలుగానే ఉంది. కాంగ్రెస్ ఏడాది పాలనలో కౌలు రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి, రైతుల దురవస్థలను తొలగించాల్సింది ప్రభుత్వమే.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగానే అమలు చేస్తోంది. గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ సరఫరా చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి పరిమితిని పదిలక్షలు చేసారు. అందరికీ నాణ్యమైన వైద్యం ప్రభుత్వ రంగంలో అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకున్నా తెలంగాణ ప్రభుత్వం తనకు తాను కొన్ని సమస్యలను సృష్టించుకుంటున్నది. పారిశ్రామికీకరణలో భాగంగా అమెరికా వెళ్ళి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపింది. చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చాయి ఫార్మా కంపెనీలు. కాని ప్రపంచంలో చాలా దేశాలు ఈ పరిశ్రమను వదులుకుంటున్నాయి. మందుల ఉత్పత్తి చాలా ఖర్చుతో కూడుకున్నది.. ఫార్మా పరిశ్రమలు విసర్జించే వ్యర్థ, విష పదార్థాలు పర్యావరణ భద్రతకు హాని చేకూర్చేవి. జల, వాయు కాలుష్యాలు సరేసరి. అందుకే సంపన్న దేశాలు ఆ పరిశ్రమలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలిస్తున్నాయి. కనుకనే భారత్ లాటి వర్ధమాన దేశాలు అడిగనదే తడవుగా చాలా పెద్ద ఎత్తున వస్తాయి. ఈ పరిశ్రమ అనుభవం దాని పర్యవసానం మన పటాన్‌చెరువు ప్రాంతాన్ని చూస్తే అర్థమవుతుంది. . అలాగే ఇంధన సమృద్ధిని సమకూర్చుకోవడానికి ఇథనాల్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా తెలంగాణలో ఇలాంటి ముప్పై పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారు.
రాష్ట్ర పాలకులు ఈ నిర్ణయాలు అమలు చేసేముందు నారాయణపేట జిల్లా చిత్తనూరు వెళ్ళి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు చూస్తే ఫార్మా పరిశ్రమను ప్రోత్సహించరు. మనం మన అనుభవాల నుండి ఎందుకు నేర్చుకోవడం లేదనేది ఒక చిక్కు ప్రశ్న. ఏ సమాజ అభివృద్ధికైనా విద్య, వైద్యం చాలా కీలకమైనవి. బీఆర్‌ఎస్ సర్కార్‌ని ఏ తప్పుకు అయినా క్షమించవచ్చు కాని విద్యారంగ విధ్వంసం విషయంలో క్షమించడం చాలా కష్టం. తెలంగాణలోని ఏ విశ్వవిద్యాలయం గురించీ ఇప్పుడు గర్వంగా చెప్పుకోలేం. ఒకనాడు ఉస్మానియా విశ్వవిద్యాల యం దేశంలో అత్యంత ప్రతిష్ఠ గల ఐదారు విశ్వవిద్యాలయాలలో ఒకటి. బీఆర్‌ఎస్ ఎందుకు విద్యను ఇంత నిర్లక్ష్యం చేసిందో అర్థం కాదు. ఆ పార్టీ ఓటమికి అదొక బలమైన కారణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే విద్యావేత్తలు కలిసి ఈ సమస్యను ప్రస్తుత ప్రభుత్వానికి చాలా విపులంగా చెప్పారు. విద్యకు తమ మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన మేరకు 15శాతం బ్జడెట్‌లో కేటాయించాలని కోరారు. మరి 2024-25 వార్షిక బ్జడెట్‌లో గత బ్జడెట్ కంటే కేవలం 0.7శాతం మాత్రమే పెంచారు. విద్యా కమిషన్ నొకదాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే చెప్పింది. ఎట్టకేలకు నియమించింది. కమిషన్ ఒకవైపు తన కర్తవ్య నిర్వహణ చేస్తున్న క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫాషన్ యూనివర్సిటీ అని ప్రకటించారు. ఇలాంటి విశ్వవిద్యాలయాలు ప్రారంభించినపుడు వాటి సాధకబాధకాల గురించి కమిషన్‌కి నివేదిస్తే ఆ నిపుణల సంఘం వాటిని పరిశీలించి ఇచ్చే సలహాల మేరకు విధాన నిర్ణయం చేయడం మంచిది.
ఇక నిరుద్యోగ విషయం ఇదొక అంతు లేని సమస్య. నయా ఆర్థిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్యను పెంచుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నియామకాలు ఒక నినాదంగా ముందుకు వచ్చాయి. రాష్ట్రంలో కొన్ని వేల ఉద్యోగాలకి లక్షల మంది పోటీపడుతున్నారు. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు కాని ఒక సమగ్రమైన ఎంప్లాయ్ మెంట్ పాలసీ ఉండాలి. ఏ ఏ పరిశ్రమలు ఎక్కువ ఉద్యోగాలను సృష్టించగలవో పరిగణనలోకి తీసుకోవాలి. ఎలాంటి పారిశ్రామిక విధానం కావాలో సమగ్ర సమాలోచనలతో నిర్ణయించుకోవాలి. మొన్నటి ఎన్నికల్లో నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ గెలుపుకి చాలా శ్రమపడింది. కాంగ్రెస్ నిపుణులతో ఒక కమిటీ వేసి ఈ మొత్తం సమస్యకు పరిష్కారమేమిటో సలహా ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ కోరాలి. ఆ పార్టీ అధికారంలో ఒక ఏడాది కాలాన్ని పూర్తిచేసుకున్న సందర్భంలో ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలను నిష్కర్షగా చెప్పడం సముచితం. పార్టీ హితవరులు చేసే హెచ్చరికల మేరకు ప్రభుత్వపరంగా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని సుపరిపాలననందించడం తెలంగాణలోను, దేశ వ్యాప్తంగాను జాతీయ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు అత్యవసరం.
-బొయిదాపు శివ కుమార్
(సీనియర్ జర్నలిస్ట్ )