– ఈనెల 26 నుంచి 2నెలల పాటు సర్వే ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ
– రెండు రోజుల్లో మూడు గ్రామాల్లో విలేజ్ మ్యాప్‌ల డిజిటలైజేషన్ కు శ్రీకారం
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భూభారతి చట్టాన్ని అమలు పరచే ప్రక్రియలో భాగంగా ఐదువేల మంది లైసెన్స్ లు కలిగిన సర్వేయర్ల నియాయకం కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 10,031 దరఖాస్తులు అందాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దరఖాస్తులకు గడువు 17వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో మంత్రి సర్వేయర్ల నియామకంపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపికైన వారికి ఈనెల 26వ తేదీ నుంచి గచ్చిబౌలి లోని సర్వే ట్రైనింగ్ అకాడమీ ( టీఏఎల్ ఐం) లో రెండు నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోవడం వలన గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు భూ వివాదాలను పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
టిజిఆర్‌ఏసి (టీజీఆర్ ఏసీ – తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్) ద్వారా సర్వే రికార్డులను (మ్యాపులు) డిజిటలైజేషన్ చేపడుతన్నామని మంత్రి తెలిపారు. ప్రయోగాత్మకంగా నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని లింగాల గ్రామం, జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని తక్కలపల్లి, ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పెద్దకోరుకొండి మూడు గ్రామాలలో ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈడిజిటల్ మ్యాప్ లను ఎక్కడినుండైనా సులభంగా యాక్సెస్ చేయవచ్చని, మాన్యువల్ పద్ధతుల కంటే వేగంగా మరియు తక్కువ ఖర్చుతో కచ్చితమైన సమాచారం పొందవచ్చన్నారు. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా భూక్షేత్రాల పరిమాణం, ఆకృతి వంటి వివరాలు ఖచ్చితంగా పొందవచ్చన్నారు .ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు మ్యుటేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. పునరుద్ధరణ మరియు భద్రత డిజిటల్ రూపంలో భద్రంగా నిల్వ చేయవచ్చు కాలానుగుణంగా అప్డేట్ చేయవచ్చు అని వివరించారు.