ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలకు కేవలం ఒక పండుగ రోజు మాత్రమే కాదు. ఇది దశాబ్దాల త్యాగాలకు, కన్నీళ్లకు, ఆశయాలకు, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక. వేలాది మంది అమరుల కలలు సాకారమైన రోజు. తెలంగాణ అనే భౌగోళిక ప్రాంతం రాజకీయ రాష్ట్రంగా రూపుదిద్దుకున్న చారిత్రక ఘట్టం. అందుకే ప్రతి తెలంగాణ పౌరుడు ఈ రోజును గర్వంతో, ఆత్మీయతతో, బాధ్యత తో గుర్తు చేసుకోవాలి.
అయితే ఇటీవల కాలంలో తెలంగాణ అస్తిత్వం, రాష్ట్ర హక్కులు, తెలంగాణ సాధించిన విజయాల భవిష్యత్తు గురించి కొందరు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయా? తెలంగాణ ప్రత్యేకత క్రమంగా బలహీనపడుతోందా? ఉద్యమ లక్ష్యాలు పక్కదారి పడుతున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సందేహాలు, ఆందోళనలు సహజమే. ప్రజాస్వామ్యంలో అప్రమత్తత అవసరమే. కానీ అదే సమయంలో తెలంగాణ చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిరాశకు, భయాలకు ఎలాంటి స్థానం లేదని స్పష్టమవుతుంది.
తెలంగాణ చరిత్ర అంటే పోరాటాల చరిత్ర. ఈ నేల మీద పుట్టిన ప్రతి తరం ఏదో ఒక రూపంలో అన్యాయానికి ఎదురు నిలిచింది. నిజాం పాలనలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటం నుండి, 1969 తెలంగాణ ఉద్యమం వరకు, అక్కడి నుండి 21వ శతాబ్దంలో జరిగిన సకల జనుల ఉద్యమం వరకు తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వం కోసం నిరంతరం పోరాడారు.
1969 ఉద్యమంలో వందలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసారు. కానీ ఆ ఉద్యమం ఆశయాలు అంతమవలేదు. కాలం గడిచినా తెలంగాణ ఆకాంక్ష ప్రజల మనసుల్లో జీవించింది. చివరకు 2001లో ప్రారంభమైన ఉద్యమం గ్రామాల నుంచి నగరాల వరకు విస్తరించి సకల జనులను ఏకం చేసి మహా ఉద్యమంగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, మహిళలు, మేధావులు, కళాకారులు,జర్నలిస్టులు … అందరూ ఒకే జెండా కింద నిలబడి తెలంగాణ సాధన కోసం కదిలారు.
అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అనేక రాజకీయ కుట్రలు జరిగాయి. ఉద్యమాన్ని బలహీనపర్చే ప్రయత్నాలు జరిగాయి. ఆశలు రేపి నిరాశ పరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు వెనక్కి తగ్గలేదు. తమ లక్ష్యాన్ని సాధించే వరకు పోరాటాన్ని కొనసాగించారు. అదే తెలంగాణ ఆత్మ. అదే ఈ నేల బలం.
ఈ చరిత్రను గుర్తు చేసుకుంటే ప్రస్తుతం వ్యక్తమవుతున్న ఆందోళనలకు సమాధానం దొరుకుతుంది. తెలంగాణను ఎవరైనా బలహీనపర్చగలరని, తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరైనా చెరిపేయగలరని భావించడం చరిత్రను మరిచిపోవడమే అవుతుంది. ఒక రాష్ట్రాన్ని కేవలం రాజకీయ సరిహద్దులు మాత్రమే నిలబెట్టవు. ప్రజల ఆత్మగౌరవం, సంస్కృతి, భాష, చరిత్ర, సామూహిక చైతన్యం దానికి అసలైన పునాది. ఆ పునాది తెలంగాణలో ఎంతో బలంగా ఉంది.
నిజమే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనేక సవాళ్లు ఉన్నాయి. సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ వంటి అంశాలపై నిరంతర చర్చ అవసరం. ప్రభుత్వాలు మారవొచ్చు. విధానాలు మారవొచ్చు. రాజకీయ సమీకరణాలు మారవొచ్చు. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలనే ప్రజల సంకల్పం మారదు.
చరిత్ర చెబుతున్న ఒక గొప్ప సత్యం …తెలంగాణ ప్రజలు ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తారు. తమ హక్కులకు ముప్పు వొచ్చినప్పుడు సంఘటితమవుతారు. అవసరమైతే మళ్లీ ఉద్యమ బాట పడతారు. ఈ నేల ప్రజలు ఎప్పుడూ మౌన ప్రేక్షకులు కాలేదు. పరిస్థితులు వికటించిన ప్రతిసారి చరిత్ర సృష్టించారు.
అందుకే ఈ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన ముఖ్యమైన సూచన ఒక్కటే—ఆందోళన చెందవొద్దు. అప్రమత్తంగా ఉందాం . ప్రజాస్వామ్య చైతన్యాన్ని బలపరుస్తూ . తెలంగాణ సాధనకు దారితీసిన విలువలను కాపాడికుందాం . కానీ ఆందోళనపడొద్దు . ఈ రాష్ట్రాన్ని నిర్మించిన శక్తి ఇప్పటికీ ప్రజల్లోనే ఉంది.
తెలంగాణను సాధించిన ఉద్యమకారుల త్యాగ స్ఫూర్తి, విద్యార్థి యువతీయువకుల అమరుల ఆత్మబలం, ప్రజల సంఘటిత చైతన్యం ఈ నేలకు అతి పెద్ద రక్షణ కవచం. ఎటువంటి కుట్రలు వొచ్చినా, ఎలాంటి సవాళ్లు ఎదురైనా, తెలంగాణ ప్రజలు వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని గతంలో నిరూపించారు. భవిష్యత్తులో కూడా అదే పోరాట పటిమతో ముందుకు సాగుతారు.
తెలంగాణ ఒక భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. అది తెలంగాణా ప్రజల ఊపిరి … ఒక స్వాభిమాన ఉద్యమం. ఒక చరిత్ర. ఒక సంస్కృతి. ఒక ప్రజాస్వామ్య ఆకాంక్ష. అలాంటి తెలంగాణ అస్తిత్వం ఎప్పటికీ అజేయం.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరులందరికీ ఘన నివాళులు అర్పిస్తూ, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని, పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ …
జై తెలంగాణ!





